శారీరక సమస్యలు దరిజేరకుండా చేయడానికి 5 మార్గాలు...

ApurupA
0
వయస్సులో ఉన్నప్పుడు ఏం తిన్నా.. ఎలా తిరిగినా రోజులు బాగానే గడిచిపోతాయి. ఆ ఉరకలెత్తే వయస్సులో శారీరక సామర్థ్యం అంత  బాగా ఉంటుంది! కానీ 30లు దాటుతున్న కొద్దీ పరిస్థితి క్రమేపీ మారిపోతుంటుంది. ఎప్పుడూ లేనిది నెలకో రెణ్ణెల్లకో ఏదో ఒక చిన్నాచితకా ఆరోగ్య సమస్య పలకరించటం. మళ్లీ కొద్దిరోజుల్లో సర్దుకోవటం! చాలామందికి నలభైల్లో పడిన తర్వాత బండి ఇలాగే నడుస్తుంది! శరీరం కొద్దికొద్దిగా పట్టు సడలుతోందనటానికి ఇదే తార్కాణం. మరి దీన్ని అడ్డుకునేదెలా? 50, 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఎటువంటి శారీరక సమస్యా దరిజేరకుండా.. దృఢత్వం జారకుండా చక్కటి ఆరోగ్యాన్ని నిలబెట్టుకునేదెలా? అందుకోసం..  పాటించండీ ఈ ఐదు సూత్రాలు!

  • ముప్ఫై ఏళ్లు దాటుతుంటే సహజంగానే స్త్రీపురుషులు ఇరువురూ కొద్దిగా బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా ప్రసవానంతరం స్త్రీలు కొంత బరువు పెరగటం చూస్తూనే ఉంటాం. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా బరువు పెరగటం మంచిది కాదు. అందుకోసం పద్ధతి ప్రకారం తప్పనిసరిగా రోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యటం చాలా అవసరం. బద్ధకం ముంచెత్తకుండా ఉండేందుకు నలుగురితో కలిసి వ్యాయామానికి వెళ్లేందుకు వీలుగా వాకింగ్‌ లాంటివి ఎంచుకోవచ్చు. నిజానికి సాధారణ వ్యాయామాలన్నింటిలోకీ ఈత ఉత్తమమైనది. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి తేలికైన, సమర్థమైన వాకింగ్‌ను ఎంచుకోవచ్చు. వారానికి కనీసం నాలుగు రోజులు గుండె బలాన్ని పెంచే వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌ చెయ్యాలి. మిగిలిన రోజుల్లో జిమ్‌ వ్యాయామాల వంటివి ఎంచుకోవచ్చు. బరువు పెరగకుండా ఉండటమే కాదు.. చిన్నాచితకా జబ్బుల బారిన పడకుండా రోగనిరోధక శక్తి బలపడేందుకు, శరీరంలో జీవక్రియలు సజావుగా సాగేందుకు కూడా నిత్య వ్యాయామం దోహదపడుతుందని మరువద్దు. 


  • ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటో అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. ప్రతిపూటా వరి అన్నం, గోధుమ వంటి పిండి పదార్ధాలనే ఎక్కువెక్కువగా తినటం సరికాదు. వీటిని కొద్దిగా తీసుకోవాలి. అది కూడా ముడివైతే మంచిది. (మైదా వంటి తేలికగా జీర్ణమయ్యే రిఫైన్డ్‌ పిండ్లు బాగా తగ్గించెయ్యాలి) ప్రతి భోజనంలోనూ ప్రధానంగా పప్పు, మాంసం వంటి మాంసకృత్తులు దండిగా ఉండాలి. ఇక ప్రతి పూటా కూరలు, ఆకుకూరలు దండిగా తినాలి. కూరలను, పండ్లను చెక్కు తియ్యకుండా తినటం, లేదా సాధ్యమైనంత తక్కువగా తియ్యటం మంచిది. నూనె, కొవ్వు, స్వీట్లు బాగా తగ్గించెయ్యాలి. రోజూ ఒకే సమయానికి తినటం అలవాటు చేసుకోవాలి. వారాంతాల్లో-ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువెక్కువగా తినటం మంచిది కాదు. 


  • ఇన్నాళ్లుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించి.. మన శరీరం మీద ఒక కన్నేసి ఉంచటం చాలా అవసరం. ముఖ్యంగా 30-35 ఏళ్లు వచ్చినప్పుడు ఏడాదికి ఒకసారైనా కొన్ని తేలికపాటి పరీక్షలు చేయించుకోవటం మంచిది. ముఖ్యంగా బీపీ చూపించుకోవటం, మధుమేహం వస్తోందేమో తెలుసుకునేందుకు, రక్తహీనత-అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు రక్తపరీక్షలు చేయించుకోవాలి. స్త్రీలైతే- పాప్‌స్మియర్‌ పరీక్ష (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వస్తోందేమో ముందే గుర్తించేందుకు), 40 ఏళ్లు దాటిన తర్వాత రెండేళ్లకొకసారైనా మామోగ్రామ్‌ పరీక్ష (రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను పసిగట్టేందుకు) చేయించుకోవటం ఉత్తమం. పరీక్షల విషయంలో తాత్సారం అంత మంచిది కాదు! మన శరీరం పట్ల మనం శ్రద్ధ కనబరుస్తున్నామనటానికి ఇదే తార్కాణం. 


  • 30 ఏళ్ల వయసనేది ఎవరైనా ఇంట్లోనూ, పనిలోనూ కూడా చాలా చురుకుగా ఉండే సమయం. కెరీర్‌ పరంగా కూడా చాలా వేగంగా ఎదిగే సమయం. పిల్లల పెంపకం, డబ్బు దాచుకోవటం, భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకోవటం, సామాజిక సంబంధాలు పెంచుకోవటం.. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీద పడతాయి. ఈ ఒత్తిడికి ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ఏదైనా కాస్త అటూఇటూ అయితే మానసికంగా నిరాశలోకి జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అన్నింటినీ ఒక్కసారే నెత్తినేసుకుని వైఫల్యాన్ని కొని తెచ్చుకోకూడదు. జీవితాన్ని ప్రణాళికా బద్ధంగా మలుచుకోవటం, సమయ పాలన, 'ఈ క్షణం మనది' అనుకుంటూ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో జీవితాన్ని ఆనందించటం ముఖ్యం. ప్రతి పనిలోనూ సానుకూల దృక్పథం ప్రదర్శించటం అవసరం. మానసిక నిశ్చింతకు అవసరమైతే యోగాభ్యాసం, ధ్యానం వంటివి కూడా ఉపకరిస్తాయి. 


  • కచ్చితంగా రావాలనేం లేదుగానీ... కొన్ని వ్యాధులు, రుగ్మతలు కుటుంబ పరంగా వచ్చే ఆస్కారం లేకపోలేదు. అందుకే కుటుంబంలో, వంశంలో ఇంతకు ముందు ఎవరికైనా గుండె జబ్బులు, హైబీపీ, మధుమేహం, క్యాన్సర్లు, థైరాయిడ్‌ సమస్యలు, కీళ్ల వాతం వంటివి ఉన్నాయేమో తెలుసుకుని ఉండటం.. వీలైతే సాధ్యమైనంత వరకూ మనకు రాకుండా 20-30 ఏళ్ల వయసు నుంచే నివారణ చర్యలు ఆరంభించటం చాలా చాలా అవసరం. దీని విషయమై కుటుంబ వైద్యులతో ముందే చర్చించటం శ్రేయస్కరం! 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top