గుండెపోటు అన్నది గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల గుండె కండరానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే సమస్య. గుండెదడ అన్నది గుండె ఎలక్ట్రిక్ సిస్టమ్లో మార్పు రావడం వల్ల సంభవించేది. కాబట్టి గుండెదడ, గుండెపోటు వేర్వేరు సమస్యలు. వాటికి కారణాలు, పర్యవసానాలు, వైద్యచికిత్స కూడా వేరుగా ఉంటాయి. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పైన రెండు గదులను కుడి, ఎడమ కర్ణికలు (ఏట్రియమ్) అంటారు. వీటిలో రక్తం నిల్వ ఉంటుంది. కింద రెండు గదులను కుడి, ఎడమ జఠరిక (వెంట్రికిల్) అంటారు. ఈ రెండు గదుల నుంచి నిరంతరం శరీరానికి రక్తం సరఫరా అవుతుంటుంది.
వ్యాధి నిర్ధారణ : గుండెదడ వచ్చినప్పుడు అది ఏ రకానికి చెందినదో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. కొంతమందికి గుండె కొట్టుకోవడం మామూలుగా ఉన్నా గుండె ఎక్కువగా కొట్టు కుంటోందనే అపోహ ఉంటుంది. కాబట్టి గుండె తరంగాలను ఈసీజీ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా గుండె స్పందనలు మామూలుగా ఉన్నాయా లేక అసాధారణంగా ఉన్నాయా అన్నది నిర్ధారణ చేయవచ్చు. కొన్నిసార్లు 24 గంట పాటు ఈసీజీ తీసి పరీక్షించడానికి హోల్టర్ అనే పరికరాన్ని కూడా అమర్చాల్సి రావచ్చు. మరికొన్నిసార్లు టీఎంటీ పరీక్ష కూడా అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏది ఎప్పుడు చేయాల న్నది వైద్యులు సూచిస్తారు.