"జుట్టు తెల్లబడి, చర్మం ముడుతలు పడడమే వయసు మీద పడిందనడానికి గుర్తనుకుంటే పొరపాటు. అసలు మొత్తం శరీరానికి ఒకటే వయసు ఉంటుందనుకుంటే అది ఇంకా పెద్ద పొరపాటు. శరీరంలోని చాలా భాగాలు మీ వయసు కంటే ముందుగానే ముసలివి అవుతాయి'' అంటున్నారు క్లినీషియన్ (clinician) డాక్టర్ యాంజిలా ఎపిస్టిన్. ఆమె లెక్క ప్రకారం మనని ప్రతిక్షణం నడిపించే మెదడు 20 యేళ్ల నుంచే ముసలిదవడం ప్రారంభమవుతుందట. మరి మిగతా భాగాల సంగతో అంటున్నారా. ఆ వివరాలు చెప్పే కథనమే ఇది.
గుండె : గుండె వృద్ధాప్యం నలభై యేళ్ల నుంచి మొదలవుతుంది. వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలోకి రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేదు. కారణం రక్తనాళాల్లో సాగేగుణం తగ్గిపోవడమే. ధమనులు గట్టిపడతాయి లేదా కొవ్వు రక్త నాళాల్లో అడ్డుపడుతుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్ పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కరొనరి ఆర్టరీల్లో కొవ్వు డిపాజిట్లు ఏర్పడతాయి. దాంతో గుండెకు రక్త సరఫరా తగ్గిపోతుంది. యాంజినా నొప్పి వస్తుంది. 45 యేళ్లు పైబడిన పురుషుల్లో, 55 యేళ్లు పైబడిన మహిళల్లో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువగా ఉండేది అందుకే.
మెదడు : మీకు 20 యేళ్ల వయసుండగానే మెదడు ముసలిదైపోవడం మొదలవుతుంది. పుట్టినపుడు వంద బిలియన్లు ఉండే న్యూరాన్లు 20 యేళ్లు వచ్చేసరికి తగ్గిపోవడం మొదలవుతుంది. 40 యేళ్లు వచ్చేసరికి రోజుకి పదివేల కణాల చొప్పున కోల్పోతుంటాం. అందుకే జ్ఞాపకశక్తిలో తేడాలు, సమన్వయ లోపాల వంటి సమస్యలు వచ్చి మెదడు పనితీరులోనే మార్పు వస్తుంది.
కళ్లు: ఇవి నలభై యేళ్ల నుంచి ముసలివవడం మొదలవుతుంది. అప్పట్నించి కంటిచూపులో తేడా వస్తుంది. దీనికి కారణం కంటి కండరాలు బలహీనమవడమే.
గొంతు : దీని వృద్ధాప్యం 65 యేళ్ల నుంచి మొదలవుతుంది. గొంతు గరుకుగా మారుతుంటుంది. స్వరపేటికలో ఉండే మృదుత్వచాలు బలహీనమవడం వల్ల ఈ పరిస్థితి వస్తుతంది. మహిళల గొంతు బొంగురుగా మారితే మగవాళ్ల గొంతు సన్నగా ఉంటుంది.
దంతాలు : 40 నుంచి వయసు మీద పడుతుంది వీటికి. బ్యాక్టీరియాని కడిగి పారేసే లాలాజలం తక్కువగా విడుదలవడం వల్ల దంతాలు, చిగుళ్లు బలహీనమై ఖాళీలు ఏర్పడతాయి.
కండరాలు: వీటికి వృద్ధాప్యం 30 నుంచే మొదలవుతుంది. యువతలో కండరాలు ఏర్పడటం, విడిపోవటం సమతుల్యంగా జరుగుతుంటుంది. 30 యేళ్ల తర్వాత విడిపోవడం పెరిగిపోయి, కొత్తగా తయారవడం తగ్గిపోతుంది. అందుకే 40 యేళ్ల తర్వాత ఏడాదికి 0.5 నుంచి రెండు శాతం వరకు కండరాలు కోల్పోతారు. దీన్ని నివారించాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి మించిన పరిష్కారం లేదు.
కాలేయం : అన్నిటికంటే ఆలస్యంగా ముసలిదయ్యేది ఇదే. 70 ఏళ్ల దాకా దీనికి వృద్ధాప్యం రాదు. కాలేయానికి కణాలని పునరుజ్జీవం చేసుకునే సామర్ధ్యం ఉంటుంది. కాలేయ దాతకి ఆల్కహాల్ తాగే అలవాటు లేకుండా, ఇన్ఫెక్షన్లు లేకపోతే 70 యేళ్ల వయసున్న వాళ్ల కాలేయాన్ని 20 యేళ్ల వయసున్న వాళ్లకి కూడా అమర్చొచ్చు.
ఊపిరితిత్తులు : ఇవి కూడా 20 యేళ్ల నుంచే ముసలివి అవడం ప్రారంభమవుతుంది. ఈ వయసు నుంచే ఊపిరితిత్తుల సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. 40 యేళ్ల వాళ్లలో కొందరికి అప్పుడప్పుడు ఊపిరాడనట్టు ఉంటుంది. దీనికి కారణం శ్వాసను అదుపులోఉంచే కండరాలు, పక్కటెముకలు గట్టిపడడమే. దాంతో ఊపిరితిత్తులు పనిచేయడం కష్టమవుతుంది. అంటే శ్వాస బయటకు వదిలిన తరువాత కూడా కొంత గాలి ఊపిరితిత్తుల్లో ఉండి శ్వాస ఆడనీయదు. 30 యేళ్ల వాళ్లు లోనికి తీసుకునే ఒక శ్వాసలో సగటున 2 పింట్స్ అంటే దాదాపు 950 మిల్లీలీటర్ల గాలి ఉంటే 70 యేళ్ల వ్యక్తి ఒక పింట్ మాత్రమే తీసుకోగలరు.
మూత్రపిండాలు : 50 యేళ్ల నుంచి వీటి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. రక్తంలో ఉండే చెత్తను తీసిపారేసే ఫిల్టర్లు అయిన నెఫ్రాన్స్ అప్పటికి తగ్గిపోతాయి. దీనివల్లే రాత్రుళ్లు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది.
వినికిడి : 50 లనుంచి దీనికి ఓల్డ్ ఏజ్ ఆరంభం. సగానికి సగం మంది 60 యేళ్లు వచ్చేసరికి వినికిడి లోపంతో బాధపడుతుంటారు. ఈ స్థితిని ప్రెస్బీక్యుసిస్ అంటారు. దీనికి కారణం లోపలి చెవిలోని చిన్న సెన్సరీ కణాలు శిథిలమవడమే. ధ్వని తరంగాలను గ్రహించి మెదడుకు పంపించే కణాలివే.
చర్మం: దీని వృద్ధాప్యం 20 యేళ్ల నుంచే మొదలవుతుంది. కొత్త చర్మం తయారవ్వాలంటే మృతకణాలు త్వరగా రాలిపోవాలి. అలా జరగకపోవడం వల్ల చర్మం ముడుతలు, పలుచబడడం వంటివి జరుగుతాయి. చర్మం ముడుతలు పడడం అనేది 30ల మధ్య నుంచి క్రమేపి పెరుగుతుంది.
రుచి-వాసన: 60ల వరకు నో ప్రాబ్లమ్. పదివేల రుచి మొగ్గలున్న నాలుకతో జీవితం మొదలయితే ఆ తరువాత వీటి సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. 60 యేళ్లకి రుచి, వాసన రెండూ తగ్గుతాయి.
ఎముకలు : 35 యేళ్ల వయసు నుంచే ఇది ముసలిదవడం మొదలవుతుంది. పిల్లల్లో ఎముకల పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి అస్తిపంజరం ఏర్పడేందుకు వారికి రెండేళ్లు పడితే పెద్దవాళ్లకు పదేళ్లు పడుతుంది. 20 యేళ్ల వరకు ఎముకల సాంద్రత పెరుగుతుంది.కాని 35 దాటాక తగ్గుతుంది. ఈ స్థితి మెనోపాజ్కి ముందు మహిళల్లో ఇంకా తీవ్రంగా ఉంటుంది. దానివల్లే ఎముకలు పలుచబడి ఆస్టియోపొరోసిస్ బారిన పడతారు. సైజు, సాంద్రతల్లో తగ్గుదల మొదలవడం వల్ల ఎత్తులో కూడా మార్పు వస్తుంది. 80 యేళ్లు వచ్చేసరికి రెండు అంగుళాల ఎత్తు తగ్గిపోవడానికి కారణం ఇదే.
జుట్టు : 30 యేళ్ల నుంచే ముసలిదవుతుంది. మగవాళ్లలో జుట్టు రాలిపోవడం 30లనుంచే ఉంటుంది. చర్మం కింద ఉన్న ఫాలికిల్ అనే చిన్న చిన్న పాకెట్ల నుంచి జుట్టు తయారవుతుంది. ఒక్కో ఫాలికిల్ నుంచి మూడేళ్ల పాటు వెంట్రుక పెరుగుతుంది. ఆ తరువాత రాలిపోయి కొత్త వెంట్రుక వస్తుంది.
మగవారికి బట్టతల ఎందుకొస్తుందంటే 30ల కంటే ముందునుంచే వాళ్లలో టెస్టోస్టిరాన్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఆ ప్రభావం పైన చెప్పిన సైకిల్ మీద ఉంటుంది. దానివల్ల ఫాలికిల్స్ ముడుచుకుపోతాయి. దాంతో కొత్తగా వచ్చే ప్రతీ వెంట్రుకా అంతకుముందు వచ్చిన దానికంటే చిన్నదిగా వస్తుంది. దాంతో అది చర్మాన్ని దాటుకుని బయటికి రాలేదు.
పేగు లేదా ఆంత్రం (గట్): మనకు 55 యేళ్లు వచ్చేవరకు ఇది బాగానే పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న గట్ హానికారక, స్నేహపూరిత బ్యాక్టీరియాలను సమతుల్యం చేస్తుంటుంది. 55 యేళ్ల తరువాత నుంచి స్నేహపూరిత బ్యాక్టీరియా తగ్గిపోతుంటుంది. ఇది పెద్దపేగు విషయంలో మరింత స్పష్టంగా తెలుస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం, గట్కి సంబంధించి పలు వ్యాధులు రావడం ఇందుకు నిదర్శనం. వయసుతో పాటు మలబద్ధకం పెరగడం కూడా ఇందుకే. ఉదరం, కాలేయం, క్లోమగ్రంధులు, చిన్న పేగుల నుంచి విడుదలయ్యే జీర్ణరసాలు నెమ్మదిస్తాయి.
ఫెర్టిలిటీ : ఇది ముసలిదవ్వడం 35 యేళ్ల నుంచి మొదలవుతుంది. అండాల నాణ్యత, సంఖ్య తగ్గు ముఖం పడతాయి. అండాశయ పొర పలుచబడడం మొదలవుతుంది. దాంతో అండాల ఫలదీకరణ సరిగా జరగదు. అలాగే వీర్యకణాలకు సరైన వాతావరణం కూడా ఉండదు.