కోపాలను దూరం చేసుకోండి...

ApurupA
0
కొన్ని కుటుంబాల్లో తమ పిల్లలకు కోపాన్ని వ్యక్తం చేసే ఏ చిన్న అవకాశమూ ఇవ్వరు. ఆ పిల్లలే రేపు యుక్తవయస్కులై, ప్రేమికులై, దంపతులయ్యాక సహజీవనంలో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటారు. కోపాన్ని ఒక పరిణతితో, ఎదుటి వారు ఆమోదించేలా వ్యక్తం చేయడం ఎలాగో వాళ్లకు ఎంత మాత్రమూ తెలియదు. చెప్పదలుచుకున్న విషయం హేతుబద్ధమే కావచ్చు. ప్రయోజనకరమే కావచ్చు. కానీ, ఆ వ్యక్తం చేసే విధానంలోని లోపమే బంధాల మధ్య దూరాలు పెరగడానికి కారణమవుతుంది. అంటున్నారు మానసిక తత్వ శాస్త్ర వేత్తలు.

ఏ చిన్న వాహనాన్ని నడపడానికైనా శిక్షణ తీసుకుంటాం. కానీ, మనలోని భావోద్వేగాల్ని వ్యక్తం చేయడానికి ఏ శిక్షణా ఉండదు. బాహ్యంగా ఎవరో వచ్చి శిక్షణ ఇవ్వకపోయినా, మనకు మనమే ఆత్మ శిక్షణ ఇచ్చుకోవడం అవసరం. ఆ శిక్షణ ఇచ్చుకోవడం కన్నా ముందు అసలు కోపం అంటే ఏమిటో, కోపం రావడానికి గల అసలు కారణమేమిటో ముందు తెలియాలి.

ఊహ తెలిసిన నాటి నుంచి చిన్నవో  పెద్దవో ప్రతి మనిషికీ కలలూ, కోరికలూ, ఆశలూ, ఆకాంక్షలూ, గమ్యాలూ, లక్ష్యాలూ ఎన్నో ఉంటాయి. వాస్తవానికి ఎవరి జీవితంలో నైనా వాటిలో చాలా వరకు నెరవేరవు. ఆ విషయానికి సంబంధించిన నిరాశా నిస్పృహలూ, వేదనలూ, దుఃఖాలు ప్రతి మనిషినీ ఏదో ఒక దశలో వేధిస్తూనే ఉంటాయి. మౌలికంగా తన కోపం వెనుకున్నది దుఃఖమేనన్న విషయమే తెలియని మనిషి ఇక దుఃఖ నివృత్తి కోసం ఏం ప్రయత్నం చేస్తాడు? అతడు చేసేదల్లా ఆ దుఃఖం తాలూకు అసహనాన్ని, చికాకునూ యథాతథంగా వ్యక్తం చేయడమే. తన దుఃఖానికి అసలు కారణం మరేదోనన్న సంగతి విస్మరించి, అన్నిసార్లూ వాటన్నిటికీ తనకు ఎదురుగా ఉన్న వాళ్ల మీదే విరుచుకు పడతారు. తన కోపానికంతటికీ అప్పుడు జరిగిన అంశమేదో కారణమను కుంటారు. దాని వెనుక కొన్నిసార్లు ఎప్పటెప్పటివో గత కాలానికి సంబంధించిన గాయాల మూలాలు కూడా ఉంటాయనే విషయాన్ని చాలా మంది గుర్తించరు.
తమకు తాముగానే కొన్నిసార్లు 'నాకు కొంచెం కోపం ఎక్కువే సుమా:' అని తమకేదో పెద్ద జ్ఞానోదయం అయినట్టు మాట్లాడేస్తారు కానీ, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయరు. అవతలి వాళ్లు కూడా 'వీడో పెద్ద కోపిష్టి' అని ఆ ఒక్క మాటతో చేతులు దులిపేసుకు వెళ్లిపోతారే గానీ కారణాల్లోకి వెళ్లరు. ఇతరుల మాట ఎలా ఉన్నా, అయిన వాళ్లు, చివరికి జీవన సహచరులు కూడా ఆ కోపం మూలాల్లోకి వెళ్లరు. మన లోలోపల పాతుకు పోయిన మూలాలన్నీ ఇప్పటికప్పుడు తొలగించడం అంత సులువైన పనేమీ కాదు కానీ, ఆ సత్యాన్ని గురించిన జ్ఞానం మనకు ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దాని వల్ల కారణం కాని వాళ్లను కారణం చేసి మనం అవతలి వాళ్లను బాధపెడుతున్నామనే విషయం మనకు బోధపడుతుంది. దానివల్ల మన ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది. ఇప్పటి కారణాలు అసలే ఉండవని కాదు. అవీ ఉండవచ్చు. కానీ, వాటికి పాత కారణాలు కూడా జత చేయడం ఎందుకు? ఒక వేళ సమస్య ఇప్పటిదే అయినా కోపం సమస్యను మరింత జటిలం చేస్తుందే తప్ప పరిష్కరించడానికి అది ఎంత మాత్రం ఉపకరించదు.
నిజానికి ఏ కోపానికి మూలం ఎక్కడుందో తెలసుకోవడం మానవ జీవితంలో ఒక విశేష జ్ఞానమే అవుతుంది. మూలాలు తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది. అకారణమైన కోపాలు మనలోనే అడుగంటి పోతాయి. నిజాల్ని పసిగట్టే గుణాలు మనలో పెరుగుతాయి. అవి ఎన్నో దూరభారాల నుంచి, అపార్థాలనుంచి, అనర్థాల నుంచి మనల్ని కాపాడతాయి.

ఏదీ పరమ సత్యం కాదు
అన్ని విషయాల్లోనూ నాకు తెలిసిందే పరమ సత్యం అనే ధోరణి కూడా కోపానికి కారణమవుతూ ఉంటుంది. ప్రతి సత్యానికీ వేలాది ముఖాలు ఉంటాయి మరి! ఎంతటి వారికైనా ఆ ముఖాల్లో కొన్ని మాత్రమే తెలుస్తాయి. వయసు పెరిగే కొద్దీ, అనుభవాలు పెరిగే కొద్దీ మరికొన్ని తెలిసిపోవచ్చు. ఎన్ని తెలిసినా ఎప్పుడూ తెలియనివంటూ కొన్ని మిగిలే ఉంటాయి. ఎందుకంటే సత్యం నిలకడగా ఉండదు. మూలాలేమీ మారకపోవచ్చు. కానీ, సత్యం నిరంతరం విస్తృతమవుతూ ఉంటుంది. అది విస్తృతమయ్యే కొద్దీ మరేవో కొత్త విషయాలు అందులోకి వచ్చి చేరిపోతుంటాయి. అందరికీ అన్ని విషయాలూ తెలిసిపోయే స్థితి ఎప్పుడూ రాదు.
 నీకు తెలిసినవి ఎదుటి వాళ్లకు తెలియక పోవచ్చు. ఎదుటి వాళ్లకు తెలిసినవి నీకు తెలియక పోవచ్చు.
అందుకే 'నువ్వు చెప్పింది పూర్తిగా తప్పు' అని ఎప్పుడూ వాదించకూడదు. అంతకన్నా ' ఒక కోణంలో నువ్వు చెప్పేది నిజమే కానీ, దానికి సంబంధించిన మరో కోణం కూడా ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే గానీ, నేను చెప్పే దాంట్లో నిజం ఉందని నీకు అనిపించదు.'' అనాలి. ఇలా మాట్లాడటం వల్ల ఎదుటి వారి అహం దెబ్బ తినదు. నీ మాటను అంగీకరించడంలో అభ్యంతరంగా ఏమీ అనిపించదు. అతడూ అదే విధానాన్ని పాటిస్తే ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఆసక్తిగా వింటారు. ఆ ఆసక్తి స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య రసానందాన్ని నింపుతుంది. జీవన కాంతిని నింపుతుంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top