బ్లీడింగ్ ఎక్కువవుతోందా?

ApurupA
0
ఎప్పుడు చలాకీగా, పని విషయం చాల చురుగ్గా ఉండే మహిళలు నెల నెలసరి సమయంలో మాత్రం కూర్చొన చోటు నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం అధిక రక్తస్రావం సమస్య. నిజానికి చాల మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందైతే సమస్య తీవ్రంగా ఉంటే పనులేవి చేసుకోకుండా రెస్ట్ తీసుకుంటుంటారు. అయితే ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. ప్రతి నెల ఇదే సమస్యతే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు నిపుణులు.

నెలసరి దగ్గర పడుతూంటే చాలు. అధిక రక్తస్రావం సమస్య ఉన్న మహిళల్లో కంగారు మొదలవుతుంది. అసలు రక్తస్రావం అధికంగా అవుతోందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు సాధారణంగా ఎంత రక్తస్రావం అవ్వచ్చనే దానిపై అవగాహన ఉండాలి. సాధారణ నెలసరి అంటే నెలకు మూడు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువగా రక్తస్రావం కాకూడదు. ఈ సమయంలోనూ ఇరవై నుంచి అరవై మి.లీ. దాకా మాత్రమే రక్తస్రావం కావాలి. ఇది తెలుసుకోవడం కొంచెం కష్టమే. అయితే కొంత మందిలో హెవీ పీరియడ్స్ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దీన్ని కొన్ని సంకేతాలను బట్టి తెలుసుకోవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ నాపకిన్లు మార్చుకోవాల్సి రావడం, ఓకే సారి రెండు నాపకిన్లు కూడా వాడాల్సి రావడం, రక్తం ముద్దలు, ముద్దలుగా పడం వంటివి అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి.

ఇవీ కారణాలు

రుతుక్రమం ప్రారంభమైన రోజు నుంచి మెనోపాజ్ దశ వరకు ఎప్పుడైనా ఎవరికైనా ఈ సమస్య ఎదురుకావచ్చు. ప్రతి పది మందిలో దాదాపు ఆరు గురికి ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. చాల సార్లు దీనికి అసలు కారణాలు కూడా తెలియక పోవచ్చు. కొన్నిసార్లు ప్రోస్టాగ్లాండిస్ అనే రసాయనం రక్తంలో ఉండే స్థాయిని బట్టి ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఈ రసాయనం గర్భాశయ గోడలపై ప్రభావం చూపి సమస్యగా మారుతుంది. ఇంకొన్ని సార్లు గర్భాశయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పెద్దగా ఉన్నప్పుడు కూడా ఇల జరిగే అవకాశం ఉంటుంది.

  • గర్భాశయంలోని కండరాల్లో ఫైబ్రయిడ్లు ఉంటాయి. ఇవి అధిక రక్తస్రావానికి ఇవి దారితీస్తాయి. ఇవే కాకుండా గర్భాశయం పొరకు వచ్చే ఎండోమెట్రియాసి లాంటివి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా అధిక రక్తస్రావానికి కారణమవుతాయి.
  • పాలీసిస్టిక్ ఓవేరియస్ డిసీజ్ (పీసీఓడీ)తో బాధపడే కొందరు మహిళల్లో ప్రతి నెల అండం సక్రమంగా విడుదల కాదు. అలాంటప్పుడు కూడా ఈ సమస్య కనిపిస్తుంది. థైరాయిడ్ ఉన్న వారిలోనూ అధిక రక్తస్రావం కనిపిస్తుంది.
  • కీమోథెరపీ, లేదా ఇతరత్రా సమస్యలకు వాడే మందుల వల్ల కూడా కొన్నిసార్లు ఎక్కువగా రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి.
పరీక్షలతో గుర్తించడం సులువే

ఈ సమస్య కనిపించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భరిస్తూ ఉంటారు చాల మంది మహిళలు. దాన్ని భరించడం కన్నా పరిష్కారం కోసం డాక్టరును సంప్రదించడం చాల ముఖ్యం. అలాంటప్పుడు వైద్యులు గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం సైజు, ఆకృతి అంచనా వేసేందుకు కొన్ని పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే రక్తహీనత కూడా అధిక రక్తస్రావాన్ని సూచిస్తుంది. ప్రతి నెల ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటే రక్తంలోని ఐరన్ శాతాన్ని భర్తీ చేసేందుకు మాత్రలను వేసుకోవాల్సి ఉంటుంది. అధిక రక్తస్రావంతో బాధపడే ప్రతి ముగ్గురి లో ఇద్దరికి ఎనీమియా తప్పకుండా ఉంటుంది కాబట్టే డాక్టర్లు ముందుగా ఈ పరీక్షను చేయమని సలహా ఇస్తారు.

ఒకవేళ గర్భాశయం, ముఖ ద్వారంలో ఎలాంటి సమస్యలూ లేకుండా, వయసు నలభైలో వుంటే ఎలాంటి టేస్టులు చేయమని సూచించరు. సమస్య తీవ్రతను బట్టి మాత్రలు ఇస్తారు. ఒకవేళ నలభై ఏళ్ల పైనబడిన రైతే నెలసరి, నెల సరికి మధ్య రక్తస్రావం కనిపిస్తున్నా, కలయిక సమయంలో రక్తస్రావం అవుతున్నా, కలయిక తర్వాత నొప్పి వంటి లక్షణాలున్నా, డాక్టర్లు గర్భాశయం లోపలి పరిస్థితి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో గర్భాశయం లోపలి పరిస్థితి, ఫైబ్రయిడ్లు లాంటివి ఉన్నాయా అన్న సంగతి తెలుస్తుంది. వీటితో పాటు కొన్నిసార్లు ఎండోమెట్రియల్ శాంపిల్ కూడా తీసుకొని పరిశీలిస్తారు. పరిస్థితిని బట్టి హిస్టరోస్కోపీ అనే పరీక్షను కూడా చేస్తారు.

మొదటి చికిత్స మాత్రలే..

ప్రత్యేక కారణాలంటూ లేకుండా సమస్య ఎదురైతే దాన్ని తగ్గించడానికి మాత్రలను సూచిస్తారు. అదే ఫైబ్రయిడ్లు, ఎండోమెట్రియాసి లాంటి సమస్యలుంటే వాటికి చికిత్స చేస్తారు. ఈ మాత్రలు నలభై నుంచి యాభై శాతం రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతాయి. కానీ వీటివల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పిని, రక్తస్రావం అయ్యే రోజులను తగ్గించడానికి కుదరదు. వీటి వల్ల అరుదుగా కడుపులో నొప్పిగా కూడా అనిపించే అవకాశాలున్నాయి.

  • మరికొన్ని రకమైన మాత్రల వల్ల అధిక రక్తస్రావమే కాదు. నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది. వీటి వల్ల ప్రోస్టాగ్లాండిస్ రసాయన ప్రభావం కూడా చాల వరకు అదుపులోకి వస్తుంది. అయితే వీటిని పరీక్ష చేసే ముందే డాక్టర్కి మీకున్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి కూడా చెప్పడం మంచిది. కడుపులో అల్సర్, ఆస్తమా లాంటి సమస్యలున్నాళ్లు ముందే తప్పనిసరిగా చెప్పి, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
  •  గర్భం రాకుండా చేసే కంబైన్డ్ ఓరాల్ కాంట్రెసెప్టివ్ మాత్రలు కూడా కొంతవరకు రక్తస్రావం, నెలసరి నొప్పిని తగ్గిస్తాయి.
  • మిరేనా గా వ్యవహరించే లవనోజెస్ట్రెల్ ఇంట్రాయుటరైస్ సిస్టమ్ కూడా సమస్యను చాలమటుకు తగ్గిస్తుంది. దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. అది ప్రతి రోజు లవనోజెస్ట్రెల్ అనే ప్రొజెస్టిరాస్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. దీనివల్ల నెలసరి తగ్గిపోవచ్చు. లేదా కొంతకాలం పూర్తిగా ఆగిపోవచ్చు. ఆ సమయంలో వచ్చే నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. ఇది ఎండోమెట్రియల్ పొరను కూడా పలుచన చేస్తుంది. ఈ మిరేనాను కనీసం ఐదేళ్ల వరకు అమర్చుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు వెంటనే తొలగించుకోవచ్చు. రక్తస్రావం సమస్య తగ్గడంతో పాలు ఎక్కువ కాలం గర్భం రాకుండా జాగ్రత్త పాడాలనుకునే వాళ్లకు ఇది మంచి పరిష్కారం.
అదనపు జాగ్రత్తలు

అధిక బరువున్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. రక్తహీనత సమస్య ఉందని తేలితే రోజూ ఐరన్ మాత్రలు తీసుకోవడంతో పాటు ఇనుము అందించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బెల్లం, తోటకూర, కోడిగుడ్లు, ఎండు ద్రాక్ష, సోయా వంటివి రోజూ ఆహారంగా తీసుకోవాలి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top