తమ వయసుకు తగినట్లుగా ఎత్తు పెరగకపోవడం అన్నది చాలామందికి మనస్తాపం కలిగించే అంశమే. అది వాళ్లలో అత్మన్యూనతను పెంచుతుంది కూడా. మన జనాభాలో 3-5 శాతం మంది ఈ ఎత్తు పెరగకపోవడం అనే సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఎదిగే వయసులోని పిల్లలు, యుక్తవయస్కులను ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. నిజానికి ఎత్తు తక్కువగా ఉండటం ఒక వ్యాధి కాదు. సాధారణంగా తల్లిదండ్రులు తక్కువ ఎత్తు ఉంటే, జన్యుపరమైన కారణాలతో వాళ్ల పిల్లలూ తక్కువ ఎత్తే పెరుగుతారు. అయితే ఒక్కోసారి ఏదైనా వ్యాధి కారణంగా కూడా ఎత్తు పెరగకపోవడం జరగవచ్చు. అలాంటప్పుడు దానికి చికిత్స చేయవచ్చు. తద్వారా ఎత్తు పెరిగేలా చూడవచ్చు.
ఎత్తు పెరగకపోవడానికి కారణాలు...
- ఎకాండ్రోప్లేసియా (జన్యుపరంగా వచ్చే సమస్యతో ఎత్తుపెరగకపోవడం)
- దీర్ఘకాలిక వ్యాధులు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, మూత్రసంబంధ వ్యాధులు, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా, యుక్తవయసులో వచ్చే కీళ్ల నొప్పులు (జువెనైల్ డయాబెటిక్ ఆర్థరైటిస్), మధుమేహం (డయా బెటిస్) వంటి వ్యాధుల వల్ల
- పెరుగుదల నెమ్మదిగా ఉండటం (కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే)
- కుషింగ్స్ డిసీజ్
- యుక్తవయుసు ఆలస్యంగా రావడం
- డౌన్స్ సిండ్రోమ్
- హైపోథైరాయిడిజం పుట్టుకతోనే ఉండటం
- పేగులో వాపు
- పేగులో పుండు
- పౌష్టికాహారలోపం
- నూనాన్ సిండ్రోమ్
- పెరుగుదల హర్మోన్ తగ్గుదల
- యుక్తవయసు ముందుగానే రావడం
- రికెట్స్
ఎత్తు అన్నది తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమించే అంశం. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు.
అయితే ఏదైనా వ్యాధి కారణంగా ఎత్తు పెరగకపోవడం జరిగితే, దాని కోసం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు తమ వయసు వారితో పోల్చినప్పుడు మరీ తక్కువ ఎత్తుగా ఉన్నా లేదా పెరుగు దల ఆగిపోయినట్లు అనిపించినా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు వైద్యులు తగిన పరీక్షలు (రక్తపరీక్ష, ఎలక్ట్రొలైట్ లెవెల్స్, ఎక్స్-రే వంటివి) చేస్తారు. జన్యుపరమైన లోపాలు (ఉదాహరణకు టర్నర్స్ సిండ్రోమ్) వంటివి ఏవైనా ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. తల్లిదండ్రుల ఎత్తును, కుటుంబ వైద్య చరిత్ర వంటివి పరిశీలిస్తారు. పుట్టిన తేదీ, ఆహారనియ మావళి, యుక్తవయసు ఎప్పుడు మొదలైంది, ఇతరత్రా వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను తెలుసుకుంటారు.
తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల బరువును, ఎత్తును రికార్డు చేస్తూ ఉంటే వారి పెరుగుదల క్రమంలో ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం సాధ్యమవుతుంది.