పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని పోవడం ప్రమాదకరమా.

ApurupA
0

ప్రశ్న: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని పోవడం ప్రమాదకరమా.


జవాబు: అవును. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరు కొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్, దాని ప్రాధాన్యం స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకు రోజువారీ పనులకు, అన్ని జీవ క్రియలకు కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే వస్తుంది. మనం తీసుకున్న ఆహారం పేగులలో జీర్ణమై, రక్తం లోకి చేరుతుంది. సగటున మనిషికి రోజుకు 2000 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. అవసరానికి మించి క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటే, శరీర అవసరాలకు పోగా మిగిలిన శక్తిని శరీరం కొవ్వురూపంలోకి మార్చుకొని నిలువ చేసుకుంటుంది. అయితే శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది ముందుగానే నిర్ణయమై ఉంటుంది. ఈ విలువను ‘సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటారు.

ఉదాహరణకు 60 కేజీలు ఉండాల్సిన వ్యక్తి 120 కేజీల బరువు ఉన్నాడనుకుందాం. అంటే ఆ వ్యక్తి 60 కేజీల అదనంగా బరువున్నట్లు. అంటే ఆ వ్యక్తి కొవ్వు సెట్పాయింట్ 60 కేజీలు. కొంతమంది తక్కువ తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంత మంది ఎక్కువ తింటున్నప్పటికీ సన్న గానే ఉంటారు. దీనికి కారణం లావుగా ఉన్న వ్యక్తుల్లో సెట్ పాయింట్ ఎక్కువగా, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్ పాయింట్ తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల (కూల్డ్రింక్లు, ఐస్క్రీములు, స్వీట్లు, కేక్లు, బర్గర్లు, పిజ్జాలు, బిస్కట్లు మొదలైన వాటివల్ల) సెట్ పాయింట్ పెరుగుతుంది. ఒకసారి పెరిగిన సెట్పాయింట్ మళ్ళీ తగ్గదు. ఈ సెట్పాయింట్ మన మనసు అధీనంలో ఉండదు. ఇది మన శరీర ఉష్ణోగ్రత సెట్పాయింట్ లాంటిదే. మన శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారిన్హీట్గా సెట్ అయి ఉంటుంది. దీనిని మనసులో అనుకుని మనం ఎలా మార్చలేమో, అలాగే ‘సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ను కూడా మార్చలేము.

ఈ సెట్పాయింట్ జీర్ణవ్యవస్థలో తయారయ్యే కొన్ని హార్మోన్ల అధీనంలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి గ్రెలిన్, జీఎల్పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1). గ్రెలిన్ జీర్ణా శయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచే హార్మోన్. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ ఎక్కువగా తయారై ఆకలి పెరుగుతుంది. కడుపునిండా ఆహారం తీసుకుంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి తగ్గుతుంది. అలాగే చిన్న పేగు చివరి భాగంలో జీఎల్పీ-1 హార్మోన్ తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గించే హార్మోన్. చిన్నపేగు చివరి భాగంలోకి జీర్ణం కాని ఆహారం వస్తే జీఎల్పీ-1 ఎక్కువగా తయారై, ఆకలి తగ్గుతుంది. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి పెరుగుతుంది. అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటాం, మన శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్ల నియంత్రణలో ఉంటుందన్న మాట.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top