టీ త్రాగడం వల్ల కలిగే ప్రభావాలు..

ApurupA
0
కొందరికి టీ కాఫీలు మంచి నీళ్ల ప్రాయం. అలా తాగడం వల్ల ఒనగూరే లాభాలు, నష్టాలు తెలియకపోయినా అదేపనిగా వాటిని తాగేస్తుంటారు. నాలుగు కప్పులకు మించకుండా తాగే టీ... కనీసం 20 శాతం పక్షవాతాలను నివారిస్తుంది. చాక్లెట్ల తీరూ అంతే. కానీ మూడు కప్పులు మించిన కాఫీతో మాత్రం ఇబ్బందులు తప్పవు.. టీ త్రాగడం వల్ల మెదడు పై ప్రభావాలు ఎలా ఉంటాయంటే...

 గ్రీన్ టీ - బ్లాక్ టీ ల ప్రభావాలు:
 టీ గురించి పూర్వం నుంచే తెలుసు. ప్రధానంగా చైనా వారికి టీ గురించి 4,700 సంవత్సరాల క్రితం నుంచీ అవగాహన ఉంది. మంచి నీళ్ల తర్వాత మానవాళి అత్యధికంగా తాగేది టీనే. ఇందులోనూ అనేక రకాలున్నాయి. అయితే మనం తీసుకునే టీ ఎంతోకొంత పులిసే తత్వం ఉన్న పానీయం. కానీ గ్రీన్ టీలో పులిసే తత్వం లేదు. ఇక అన్నిరకాల టీలలో కాటేచిన్స్, ఫ్లేవనారుడ్స్ అనే జీవరసాయనాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి రెండూ ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్స్. అయితే టీలో... ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు... వంటివేవీ ఉండవు. టీ తాగగానే అందులోని ఫ్లేవనాయిడ్స్ హానికరమైన కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ను, కొవ్వు పదార్ధలైన ట్రైగ్లిజరాయిడ్స్ను సైతం తగ్గిస్తాయి. కానీ శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) ను మాత్రం పెంచలేవు. టీ తాగడం వల్ల కొవ్వు పేరుకునే ప్రక్రియకు కాస్త అడ్డుకట్ట పడుతుంది. అయితే ఈ సుగుణం ఉంది కదా అని మోతాదుకు మించకుండా పరిమితంగా మాత్రమే తాగాలి. అంటే రోజుకు నాలుగు కప్పులకు మించనివ్వ కూడదు.
ఇలా పరిమితంగా టీ తాగడం పక్షవాతాన్ని నివారిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని రక్తప్రవాహాన్ని అడ్డు కోవడం వల్ల వచ్చే ఇస్కిమిక్ స్ట్రోక్, రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చే హేమరేజిక్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ల నివారణకు తోడ్పడతాయి. ఇలా స్ట్రోక్ను నివారించే గుణం సాధారణ టీ కంటే గ్రీన్ టీ లో ఎక్కువగా ఉంది. వివిధరకాల పక్షవాతాల్లో కనీసం 20 శాతం పక్షవాతాలను టీ నివారిస్తుంది. తాగిన వెంటనే శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడం, నైట్రిక్ఆక్సైడ్ పాళ్లను పెంచడం వంటి గుణాలు ఉన్నందున ఈ ప్రయోజనం చేకూరుతుంది. రక్తనాళాల్లోని లోపలి పొర అయిన ఎండోథీలియం... రక్తాన్ని సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. ఈ గుణాన్ని టీ మరింత మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. టీలోనూ కొంత మేరకు కెఫిన్ పాళ్లు టీలో ఉన్నప్పటికీ వాటి ప్రభావం చాలా తక్కువ. 
ఆరోగ్యానికి మేలు చేకూరేలా టీ తాగడం ఎలా: 
టీలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు కాచిన టీలోనే అవి ఎక్కువగా లభిస్తాయి. అందుకే టీని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకుని తాగాలి. ఇన్స్ స్టెంట్ టీ/ఐస్ టీలలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ పాళ్లు చాలా తక్కువ.
టీ లో ప్రతికూల అంశాలు... 
మేలు గుణాలతో పాటు, టీ లో కొన్ని ప్రతికూల గుణాలూ ఉన్నాయి. ఉదాహరణకు మనం తీసుకున్న ఆహారం, పండ్లు, కూరగాయల నుంచి శరీరానికి అందాల్సిన ఐరన్ను టీ శరీరంలోకి ఇంకకుండా నిరోధిస్తుంది. అందుకే ఆహారం తీసుకునే సమయంలో టీని పూర్తిగా దూరంగా ఉంచాలి. తినే ముందు, తిన్న తర్వాత కూడా చాలాసేపటి వరకు టీ తాగకూడదు. అలాగే టీ ఎక్కువగా తాగే అలవాటు (అంటే రోజుకు ఒక లీటర్ కంటే ఎక్కువగా తాగుతూ, అలా ఏళ్ల తరబడి తాగేవారికి) దీర్ఘకాలంలో ఫ్లోరోసిస్ కు దారితీసే ప్రమాదం ఉంది. పైన పేర్కొన్న అధ్యయనాలతో తేలిన విషయం ఏమిటంటే... గ్రీన్ టీ లేదా సాధారణ టీ తాగే అలవాటును కొనసాగించవచ్చు. 
కాకపోతే రోజుకు నాలుగు కప్పులకు మించి తాగవద్దు. ఆ పరిమితుల్లో టీ తాగడం వల్ల భవిష్యత్తులో పక్షవాతాన్ని చాలావరకు, గుండెజబ్బులను కొద్ది మేరకు నివారించుకోవచ్చు. ఇక చాక్లెట్ కూడా ఒకటికి మించి తినవద్దు. అయితే కాఫీ అలవాటు ఉన్నవారు మాత్రం రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదు. ఆ మోతాదు మించితే అది హానికరమని గ్రహించండి. కాఫీ, టీలలో వేసుకునే చక్కెర పాళ్లను గణనీయంగా తగ్గించాలని గుర్తుపెట్టుకోండి. పరిమితికి మించిన చక్కెర వేసుకుంటుంటే అది క్రమంగా రక్తంలో చక్కెర పాళ్లను పెంచడం, బరువును పెంచి స్థూలకాయం వచ్చేలా చేయడం జరుగుతుందని మర్చిపోకూడదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top