ఆఫీసు వాతావరణం ఏలా ఉంటే మంచిది..?

ApurupA
0
ఆఫీసులో ఉద్యోగి ఎలా ఉండాలి? ఉద్యోగి మరింత బాగా పని చేసేందుకు ఆఫీసు ఎలా ఉండాలి? ఈ కోణంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నో అధ్యయనాలు సాగాయి. సంతోషంగా ఉండే ఉద్యోగి, ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పని చేసే చోట కొన్ని చిన్నచిన్న మార్పులు చేపట్టటం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఉదాహరణకు తరచూ ఈ మెయిల్స్‌ చూడటాన్ని తగ్గించటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందనీ, పనిచేసే చోట మొక్కల్ని పెంచుకోవటం ద్వారా గొంతు నొప్పి వంటి సమస్యల్ని నివారించుకోవచ్చని పేర్కొన్నారు. కిటికీ దగ్గర కూర్చునే అవకాశం ఉంటే.. ఒత్తిడి మరింతగా తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. పని ప్రదేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవటానికి కొన్ని చిట్కాలివి.

  • కార్యాలయంలో లోపలి భాగంలో మంచి రంగులుసరిపడినంతగా వెలుతురు ఉండటం వల్ల మూడ్‌ బాగుండటమే కాకుండా తలనొప్పి వంటి సమస్యలూ తగ్గుతాయని పేర్కొన్నారు. టెక్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. తెలుపునీలం ఆకుపచ్చ రంగులు వేసిన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో మంచి పనిసామర్థ్యం కనబరిచినట్లు గుర్తించారు. వీరిలో మూడ్‌ చక్కగా ఉండటంపనిలో తృప్తి ఎక్కువగా కనిపించినట్లు గుర్తించారు.
  • కంప్యూటర్‌ తెరను సరైన పద్ధతిలో అమర్చకపోతే తలనొప్పులుఅలసటమెడనడుముభుజంమణికట్టు నొప్పులు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. కాంగ్స్‌బెర్గ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (నార్వే) పరిశోధకులు కంప్యూటర్‌ తెరను అమర్చిన విధానం ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందనేది పరిశీలించారు. మానిటర్‌ను 15 డిగ్రీలు అటూఇటూగా అమర్చుకున్న వారికి మరింత ఎక్కువ నొప్పి ఉంటోందనీఎక్కువగా సిక్‌ సెలవులు పెడుతున్నారనీమెడల్ని ఎక్కువగా కదిలించలేకపోతున్నారనీ గుర్తించారు. కంప్యూటర్‌ తెరను సరిగ్గా అమర్చుకోవటమంటే.. కంటి ఎత్తుకు సమానంగా మానిటర్‌ పైభాగాన్ని అమర్చుకోవటమేనని సూచిస్తున్నారు.
  • ఐయోవా యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. 62 శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఆఫీసుల్లో అనారోగ్యకర అనుబంధాల్ని కొనసాగిస్తారని గుర్తించారు. దీనివల్ల అనవసర ఒత్తిడులు పెరిగి, కార్యాలయంలో ఆరోగ్యకర వాతావరణం కాస్తా చెడిపోతుందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్ని వదిలెయ్యటమే మేలని సూచిస్తున్నారు.
  • కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు పనిగంటలకీ, రక్తపోటు పెరగటానికీ మధ్య సంబంధాన్ని పరిశీలించారు. వారానికి 40 గంటలు పనిచేసే స్త్రీ పురుషుల్లో 14 శాతం అధిక రక్తపోటు ముప్పు పెరిగినట్లు గుర్తించారు. 11 నుంచి 39 గంటలు మాత్రమే పనిచేసే వారిలో ముప్పు ఈ స్థాయిలో లేదు. అదే 41 -50 గంటలు పనిచేసేవారిలో 17 శాతం, 51 గంటలకన్నా ఎక్కువ చేసేవారిలో 29 శాతం రక్తపోటు ముప్పు పెరిగినట్లు తేల్చారు.
  • ఉల్ట్సర్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో.. లిఫ్టుకు బదులుగా మెట్లెక్కే వారిలో కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం, శ్వాససామర్థ్యం మెరుగ్గా ఉండటం, గుండె ఆరోగ్యం బాగుండటం, బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కే మెట్ల సంఖ్యను పెంచి చూసినప్పుడు శ్వాస సామర్థ్యం మరింత మెరుగవ్వటమే కాకుండా కొలెస్ట్రాల్‌ బాగా తగ్గినట్లు తేల్చారు.
  • ఆఫీసు ఆవరణలో మొక్కల కుండీల్ని అమర్చుకోవటం ద్వారా గొంతెండిపోవటం, ముక్కులు బిగుసుకోవటం వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు అంటున్నారు. 'నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ (ఓస్లో)' పరిశోధకులు ఆఫీసు ఆవరణలో కుండీమొక్కల ప్రభావాన్ని పరిశీలించారు. ఇలా మొక్కల్ని అమర్చుకున్న వారిలో.. ముక్కు, గొంతు, పొడిచర్మం సమస్యలు 23 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దగ్గు 37 శాతం, బడలిక 34 శాతం తగ్గినట్లు తేల్చారు. ఆఫీసు మొక్కలు ఎందుకిలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది మాత్రం నిర్దిష్టంగా చెప్పలేదు. మొక్కల కారణంగా గాలి స్వచ్ఛత పెరగటం, మానసిక ప్రభావం ఉండటం వంటివి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక ఉద్యోగి ఈ మెయిల్‌ ఒత్తిడితో బాధపడుతున్నట్లు 'పెయిస్లే యూనివర్సిటీ' పరిశోధకులు పేర్కొన్నారు. కొంతమంది ఉద్యోగులు నిమిషానికి 40 సార్లు మెయిల్స్‌ చూసుకుంటారనీ, ఫలితంగా ఒత్తిడి పెరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు మరింత ఒత్తిడి ఎదుర్కొంటారని అన్నారు. తక్షణం తెరపై మెయిల్స్‌ కనిపించే పద్ధతిని మానేసి రెండు రోజులకు ఒకసారి అన్ని మెయిల్స్‌ను సరి చూసుకునే పద్ధతిని అనుసరించటం మంచిదని సూచిస్తున్నారు.
  • డెస్కు కిటికీకి దగ్గరగా ఉండటం మంచిది. అయితే.. ప్రింటర్లకు మాత్రం కొద్దిగా దూరంగా ఉండాలి. 'లండ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (స్వీడన్‌)' పరిశోధకుల ప్రకారం- కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు ఉద్యోగుల మూడ్‌ బాగుంటున్నట్లు గుర్తించారు. ప్రింటర్లు కాలుష్య కారకాలుగా మారి వూపిరితిత్తుల ఆరోగ్యానికి హాని తలపెడతాయని పేర్కొన్నారు. ఆఫీసుల లోపలి నుంచి గాలి ధారాళంగా బయటికి వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
  • ఉద్వేగాలన్నింటినీ మనసులో కుక్కుకోవటం ఆరోగ్యానికి మంచిదికాదు. ఇది.. డిప్రెషన్‌కు దారితీయటమే కాకుండా గుండె జబ్బులకూ కారణమవుతుంది. 'స్ట్రెస్‌ అండ్‌ హెల్త్‌' జర్నల్‌ ప్రచురించిన ఒక అధ్యయనం ఎమోషన్‌ డైరీ పేరిట ఒక డైరీని పెట్టుకుని ఒత్తిడి కారకాల్నీ, భావాల్నీ అందులో రాసుకుంటే చాలా వరకు ఒత్తిడి తగ్గిపోతుందని పేర్కొన్నారు. దీనివల్ల మొత్తంగా ఆరోగ్యమూ మెరుగవుతుందని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top