
దీన్ని ఎదుర్కొనేందుకు..
- నివాస ప్రాంతం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటే మంచిది. ఇరుగు పొరుగు వారు సైతం అనుకూలంగా ఉండే వారుంటే మంచిది.
- విపరీతమైన ఒత్తిడి పెంచటంలో డబ్బుల పాత్ర కూడా అధికమే. వాటి గురించే ఎక్కువగా ఆలోచించటమూ, ఎలా ఖర్చవుతున్నాయనేది అస్సలు పట్టించుకోకపోవటం రెండూ సరైనవి కాదు.
- ఎంత పని ఒత్తిడి ఉన్నా, మధ్యాహ్న వేళల్లో 10-20 నిమిషాలపాటు చిన్నపాటి కునుకు తీయాలి. ఈ సమయంలో శరీరంలో జీవక్రియలు నెమ్మదిగా పని చేస్తుంటాయి. అంతేకాదు, మధ్యాహ్న వేళ నిద్ర జీవ గడియారానికి అనుగుణంగా ఉంటుంది. ఈ చిన్న కునుకు చాలా శక్తినిస్తుంది.
- మీ పిల్లలు మీలా అన్నింట్లో సంతృప్తికరంగా ఎదగటం లేదనే ఆత్మన్యూనత పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎంత మీ పిల్లలైనా వారి వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మీలో పెరిగే ఒత్తిడి మిమ్మల్నే కాకుండా, మొత్తం కుటుంబంపైనా ప్రభావం చూపిస్తుంది.
- మీరు ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్నా సరే.. క్రమం తప్పకుండా అన్నిరకాల వైద్య పరీక్షలూ చేయించుకుంటుండాలి.
- సమయం వృథా కాకుండా మరింత చక్కగా ఉపయోగించుకోవాలి. రోజువారీ ప్రణాళిక, ఏ సమయంలో ఏయే పనులు చేయాలి వంటివన్నీ ముందుంచుకుని, వాటి ప్రకారం పని చేయటం వల్ల గందరగోళం తగ్గి, పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. దీనివల్ల చాలా ఒత్తిడి తగ్గుతుంది.
- సామాజిక అనుబంధాలు కేవలం మానసికోల్లాసం కోసమే కాకుండా, మానసిక ఆరోగ్యానికీ తోడ్పడతాయి. మీలో అంతర్గత ఇంధన వనరులు తగ్గిపోయినప్పుడు స్నేహితులతో గడిపే సమయంతో శక్తిని పుంజుకోవచ్చు.
- మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి ఏదైనా కొత్త హాబీని అలవాటు చేసుకోవాలి. దీనితోపాటు పెంపుడు జంతువుల సంరక్షణ కూడా ఒత్తిడి తగ్గించటంలో బాగా పని చేస్తుంది. పెంపుడు జంతువులతో మసలేవారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.
- కొన్ని విషయాల్లో మన దృక్పథంలో సైతం మార్పురావాలి. దీనివల్ల ఒత్తిడి చాలామేర తగ్గుతుంది. ఆఫీసుకు వెళ్లే సమయంలో రిలాక్సేషన్ పొందేలా అలవాటు చేసుకోవాలి. బస్సు, రైలు వంటి వాటిలో సైతం ధ్యానం చేసుకోగలిగే అలవాటు పెంపొందించుకోవాలి.
- రోజువారీ పనుల నుంచి బయటపడి కొద్దిసేపైనా ధ్యానం చేసేవారిలో ఒత్తిడి ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు.