గుండెవేగాన్ని గుర్తించటమెలా?

ApurupA
1
మన గుండె నిరంతరం లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్‌ అవుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ వేగం (పల్స్‌) మన శరీర సామర్థ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.  

గుండె సాధారణ (నార్మల్‌) వేగం ఒకొకరిలో ఒకోరకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్లు, మోచేయి, మెడ, పాదంపైన పల్స్‌ను స్పష్టంగా గుర్తించొచ్చు. ఈ భాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీరానికి రక్తసరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూలేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. తీవ్రంగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి, క్రీడాకారుల్లో గుండె కండరం బలంగా ఉండటం వల్ల విశ్రాంతి సమయంలో ఈ నాడి వేగం 60 కన్నా తక్కువగా ఉండొచ్చు. రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్‌ మందులు, గుండెలయను సరిచేసే మందులు వేసుకునేవారు గుండెవేగంపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. ఇలాంటి వారిలో ఏవైనా తేడాలు కనిపిస్తే మందుల మోతాదు మార్చటమో, వేరే మందులకు మారటమో చేయాల్సి ఉంటుంది. గుండెవేగం చాలా తక్కువగా ఉన్నా, తరచుగా గుండెవేగం పెరుగుతున్నా, ముఖ్యంగా బలహీనత, తలతిప్పు, వణుకు వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవటం మంచిది. ఏవైనా సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశముటుంది.  

వేగాన్ని పెంచే కారకాలు 

  • భావోద్వేగాలు: ఒత్తిడి, ఆందోళన, విచారం, సంతోషం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడూ గుండెవేగం పెరుగుతుంది. 
  • శరీర భంగిమ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కూచున్నప్పుడు, నిలబడినప్పుడు గుండె వేగం ఒకేలా ఉంటుంది. అయితే కొన్నిసార్లు నిలబడిన వెంటనే 15-20 సెకండ్ల పాటు ఇది కాస్త పెరగొచ్చు. కానీ కొద్దిసేపట్లోనే వేగం సర్దుకుంటుంది. 
  • వూబకాయం: భారీ వూబకాయుల్లో విశ్రాంతి సమయంలో గుండెవేగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా 100కు మించకపోవచ్చు. 
  • ఉష్ణోగ్రత: వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ పెరిగినపుడు గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్‌ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె నిమిషానికి 5-10 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. 

వేగాన్ని ఎంతవరకు పెంచొచ్చు?

వ్యాయామం చేసినపుడు గుండె సాధ్యమైనంత ఎక్కువగా కొట్టుకునేలా చూసుకోగలిగితే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
అయితే ఈ గరిష్ఠ గుండెవేగాన్ని గుర్తించటమెలా? దీనికి తేలికైన సూత్రముంది. 220లోంచి వ్యక్తి వయసును తీసేస్తే.. వచ్చే సంఖ్యను గరిష్ఠ గుండెవేగంగా పరిగణించొచ్చు. అంటే 40 ఏళ్ల వ్యక్తి నిమిషానికి గరిష్ఠంగా 180 సార్లు గుండె కొట్టుకునేవరకు వ్యాయామం చేయొచ్చన్నమాట. అయితే ఇది ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మరవరాదు. కచ్చితంగా ఎంతమేరకు వ్యాయామం చేయాలనేది డాక్టర్ల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. You have explained it so well that it had clear my

    doubts. wonderful article.Keep posting such

    informative posts.Thanks
    http://thelusa.com/telugu

    ReplyDelete
Post a Comment
Accept !
To Top