కాబోయే అమ్మ కోసం ఆహార నియమాలు

ApurupA
0
మాతృత్వం ఓ వరం. ప్రతి స్త్రీకి గర్భం దాల్చిన క్షణం నుంచి ఏదో తెలియని ఉద్వేగం, సంతోషం ఉంటుంది. ఏం తినాలి.. ఎది తినకూడదు. బరువు పెరిగితే లాభమా.. నష్టమా అనే విషయాలపై ఆందోళనా ఉంటుంది. ప్రెగ్నెసీ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తల్లికి, బిడ్డకు క్షేమం వంటి అంశాలపై మహిళలకు అవగాహన ఉండటం చాలా అవసరం. అప్పుడే పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.
గర్భం దాల్చారని తెలుసుకునే లోపే మూడు నెలలు గడిచిపోతాయి. చాలా మంది విషయంలోనూ ఇలానే జరుగుతుంది. కొంత మంది మాత్రం ప్రెగ్నెసీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతారు. నిజానికి అలా చేయడం చాలా ముఖ్యం. హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకు మందులు వాడుతూ ప్రెగ్నెసీ కోసం ప్రయత్నించాలి.

మొదటి 3 నెలలు
గర్భం దాల్చాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మొదటి 3 నెలల్లో అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సమతుల్య ఆహారం తీసుకోవాలి. గర్భం దాల్చిన వారికి ఫోలిక్ ఆసిడ్, ఐరన్ చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. క్యాబేజీ, బత్తాయి, ఖర్జూర, మాంసాహారం తీసుకుంటే మంచిది. అలాగే హీమోగ్లోబిన్ శాతం సరియైన స్థాయిలో ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి. ఐరన్ కోసం డేట్స్ తీసుకోవచ్చు. ఈ మొదటి 3 నెలల సమయంలో అదనపు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ వెయిట్ ఉండేలా చూసుకోవాలి.

తర్వాత 3 నెలలు

ఈ సమయంలో కూడా అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. సమతుల్య ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతి రోజు ధాన్యపు గింజలు, రాగులతో చేసిన ఆహారం తీసుకోవాలి. రాగులలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా దొరుకుతుంది. తాజా పండ్లు తీసుకోవడం కూడా చాలా అవసరం. పాలు, పెరుగు తప్పకుండా తీసుకోవాలి. పాల ఉత్పత్తులను ప్రతి రోజు 300 ఎం.ఎల్. తీసుకుంటే గర్భిణిలకు చాలా మంచిది. ప్రోటీన్స్ సమృద్ధిగా లభ్యమయ్యే పప్పుధాన్యాలు, మాంసాహారం, చేపలు, గుడ్లు మెనూలో ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ పదార్థాలు, స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి.

చివరి 3 నెలలు

ఈ సమయంలో బిడ్డ పెరుగుదల వేగంగా ఉంటుంది. ఇప్పుడు బిడ్డకు కూడా ఆహారం అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అదనపు ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో బరువు తగ్గడం మంచిది కాదు. బరువును ఎప్పటిక ప్పుడు చెక్ చేసుకుంటూ సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. చివరి 3 నెలల సమయంలో చాలా మందికి ఒంటికి నీరు పడుతుంది. అలాంటప్పుడు బార్లీ నీళ్లు, నిమ్మరసం తీసుకుంటే ఒంటికి పట్టిన నీరు తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ పళ్లు తినాలి. ఫోలిక్ఆసిడ్, ఐరన్ చాలా అవసరం కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లభ్యమయ్యే ఆహారపదార్ధాలు తీసుకోవడం అవసరం. ఉదయం పూట సిక్‌నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణమయ్యే ఇడ్లీ, పండ్లు లాంటివి తీసుకోవచ్చు. ఆయిల్ పదార్థాలు తీసుకోకూడదు. పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. చాలా కీలకమైన ఈ సమయంలో డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తల్లి ఆరోగ్యం బాగుండటంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top