అధికబరువుతో రకరకాల అనర్థాలు పొంచి ఉన్న మాట నిజమే. కానీ తక్కువ బరువునూ తక్కువగా అంచనావేయటానికి వీల్లేదు. ఎందుకంటే శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) సాధారణ స్థాయిలో (18.5-25.9) గలవారి కన్నా తక్కువ బీఎంఐ (18.5, అంతకన్నా తక్కువ) గలవారికి రకరకాల కారణాలతో మరణించే ముప్పు 1.8 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
మామూలు వ్యక్తులతో పోలిస్తే వూబకాయులకు (బీఎంఐ 30-34.9) మరణ ముప్పు 1.2 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక బీఎంఐ 35, అంతకంటే ఎక్కువగల వుబకాయులకు ఈ ముప్పు 1.3 రెట్లు ఎక్కువని తేలింది. అంటే వూబకాయం కంటే తక్కువ బరువే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోందన్నమాట. మన బీఎంఐ కేవలం శరీరంలోని కొవ్వును మాత్రమే కాదు. కండరాల మోతాదునూ ప్రతిబింబిస్తుంది.
అందువల్ల వూబకాయాన్ని తగ్గించే విషయంలో కొవ్వు, కండరాల, ఎముక మోతాదులు తగినంత స్థాయిలో ఉండేలా చూసుకోవటం కీలకమని అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యులు చెబుతున్నారు.