‘ఒత్తిడి అలా కొనసాగుతూ ... అది ఎలాంటి హానీ చేయకపోతే దాన్ని ఎంతకాలమైనా భరించ గలం’ అనుకునే వాళ్లూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఒత్తిడి అన్నది కేవలం ఆ సమయానికే పరిమితం కాదు. ఒత్తిడి అప్పటికి తొలగినా... దాని భవిష్యత్ పరిణామాలు మాత్రం వేరుగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉండే ఒత్తిడి అలా అలా వేర్వేరు వ్యాధులకు దారితీస్తుంది. అదీ నిజమైన సమస్య. అందుకే ఏరోజుకు కలిగే ఒత్తిడిని ఆ రోజుకు అలా భరిద్దాంలే అనుకుంటే కుదరదు. అదలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ పోతూ ఉంటే, దాని వల్ల వచ్చే వేర్వేరు వ్యాధులు... అందు వల్లదాన్ని నివారించుకోవాల్సిన ఆవశ్యకత గురించిన అవగాహన కోసం... ఈ కథనం.
వ్యాధి నిరోధక శక్తిపై ఒత్తిడి ప్రభావం...
మనకు ఏదైనా గాయం అయినప్పుడు అక్కడ వాపు రావడం, ఎరబ్రారడం (ఇన్ఫ్లమేషన్) వంటి పరిణామాలు జరుగుతాయి. ఇది బాధాకరంగానే ఉన్నా, కాస్త వ్యవధి తర్వాత ఆ ఎరుపూ, మంటా, వాపు వంటివి దానంతట అదే తగ్గడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ను నివారించే శక్తిని మన శరీరం కోల్పోతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ తాలూకు మార్గదర్శ కాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ర్పభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెల్లడైంది. నిజానికి మనలో ఇన్ఫ్లమేషన్ కలిగిన ప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ వ్యాధి నిరోధకతను కలిగించే అంశాలు ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. కానీ దీర్ఘకాలపు ఒత్తిడి కారణంగా కార్టిజోల్ అన్న హార్మోన్ స్రవించినా అది సరిగా పనిచేయదు. దాంతో ఒత్తిడి కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. అంతే కాదు... ఈ థియరీ మరికొన్ని దృష్టాంతాల ద్వారా కూడా వాస్తవమని తేలింది. సాధారణంగా మనకు జలుబు చేస్తే, ఒకటి రెండు రోజుల తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం తీసుకుంటుంది. కారణం... ఒత్తిడి ప్రభావం మన వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూలంగా పడటమే. ఇలా మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే బాధించకుండా క్రమంగా అది శారీరక బాధలైన స్థూల కాయం, గుండెజబ్బులు, అల్జైమర్స్ వ్యాధులు, డయాబెటిస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి వాటికి దారితీస్తుందని స్పష్టంగా గుర్తించారు.