మగవాళ్లు ఎందుకు అబద్ధాలు చెబుతారు?
సాహసాలు చేయటానికి ముందుకెందుకు దూకుతారు?
భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా లోపలే ఎందుకు
దాచుకుంటారు? వీటన్నింటికీ టెస్టోస్టీరాన్ హార్మోన్
ప్రభావమే కారణమని చెబుతున్నారు అమెరికా సైకియాట్రిస్ట్‌లు. వారు ఆడవారు, మగవారి ఆలోచనలు, ప్రవర్తనలకు గల తేడాలను విశ్లేషించారు.
అందుకు కారణమవుతున్న అంశాలనూ వివరించారు. అందులో కొన్ని విషయాలు మీ కోసం..
- గర్భంలో ఉండగానే ఎనిమిదో వారం నుంచే మగశిశువు మెదడుపై టెస్టోస్టీరాన్ ప్రభావం పడుతోంది. దీంతోనే అబద్ధాలు ఆడటం, సాహసం చేయటం, భావోద్వేగాలను అణచుకోవటం వంటి లక్షణాలకు బీజం పడుతోంది.
- యుక్తవయసులో మగపిల్లలు ఇతరులను ఎక్కువగా విమర్శిస్తుంటారు. అన్నింటి పైనా త్వరగా ఆసక్తి కోల్పోతుంటారు. మెదడును టెస్టోస్టీరాన్ ఎక్కువగా ప్రభావితం చేయటం వల్ల.. అసాధారణమైన భావోద్వేగాలు మాత్రమే వారిని ఉత్తేజితం చేయగలుగుతాయి. అందుకే ఉద్వేగభరితమైన వీడియోగేమ్‌లను ఆడేందుకు మగపిల్లలు ఇష్టపడుతుంటారు.
- సంభోగానంతరం ఆనందాన్ని కలగజేసే ఆక్సిటోసిన్ హార్మోన్ హైపోథాలమస్‌లోకి విడుదల అవుతుంది. దీని ప్రభావంతో ఆడవాళ్లు తమ భాగస్వాములను హత్తుకోవాలని, మాట్లాడాలని భావిస్తుంటే.. మగవారిలో ఇది నిద్ర మాత్రలా పనిచేసి మగతను కలిగిస్తుంది. అందుకే వారు శృంగారంలో పాల్గొన్న తర్వాత వెంటనే నిద్రపోతుంటారు.
- ఎవరైనా ఏదైనా సమస్యను మగవారికి చెప్పగానే సానుభూతికి బదులు ఏదో ఒక పరిష్కారాన్నే సూచిస్తుంటారు. మెదడులోని టెంపోరల్ పార్షల్ జంక్షన్ వ్యవస్థ చురుగ్గా పనిచేసి విశ్లేషణకు పురికొల్పటమే ఇందుకు కారణమవుతోంది. ఆ సమయంలో ఈ జంక్షన్. భావోద్వేగాలను రేకెత్తించే భాగంపై ఆధిపత్యం చెలాయిస్తుంది.
- అయితే ఆడవారిలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకే స్త్రీలు పరిష్కారాలను సూచించే తార్కికత కంటే భావోద్వేగాలకే ఎక్కువ లోనవుతుంటారు.
- కాబోయే తండ్రుల్లో టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో ప్రోలాక్టిన్ హార్మోన్ స్థాయి పడిపోతుంది. కాబోయే తల్లుల చర్మం నుంచి విడుదలయ్యే ఫెర్మోన్స్‌కు ప్రతిస్పందించటం వల్లే ఇలా జరగుతుండొచ్చు. ఇదే సమయంలో మెదడులో శబ్దాలను వినే భాగం మరింత చురుకుగా మారుతుంది.
- అందువల్లే పిల్లల ఏడ్పును త్వరగా వినగలుగుతారు. పిల్లలు పుట్టే సమయానికి వారిని కనిపెట్టుకొని ఉండటంలో మగవారు ప్రధాన బాధ్యత తీసుకునే స్థాయికి చేరుకుంటారు.