నిద్ర తగ్గితే.. కలిగే ఇబ్బందులు..

ApurupA
0
ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఆహారం, వ్యాయామాల పైనే దృష్టిపెడుతూ నిద్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదు. నిద్ర తగ్గటం వల్ల శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందన్న సంగతిని విస్మరిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • దీర్ఘకాలం పాటు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యల్ని పరిష్కరించే నేర్పు తగ్గటం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్థూలకాయం, మానసిక కుంగుబాట్లు, తరచూ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి. 
  • నిద్రలేమి వల్ల వ్యక్తి రోజువారీ ఎదురయ్యే సాధారణ ఒత్తిడిని కూడా తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటారు. దీనివల్ల చిరాకు, అసహనం, మూడీగా ఉండటం, దేనిపైనా మనసు పెట్టలేకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. 
  • పరీక్షకు వెళ్లటానికి ముందు చాలామంది రాత్రంతా మేల్కొని చదివేస్తుంటారు. దీనివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. ఏదైనా నేర్చుకోవాలన్నా, జ్ఞాపకం పెట్టుకోవాలన్నా కంటి నిండా నిద్ర తప్పనిసరని తాజా అధ్యయనాల్లో తేల్చారు. చాలీ చాలని నిద్ర మెదడుకు నేర్చుకునే సామర్థ్యాన్నీ, కొత్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవటం, జ్ఞాపకాల్ని తిరగతోడటం వంటివాటన్నింటినీ తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. 
  • నిద్ర తగ్గితే.. క్యాన్సర్లు, టైప్‌-2 మధుమేహానికి కారణమయ్యే ఇన్సులిన్‌ నిరోధకత సమస్యల వంటివీ చుట్టుముడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 
  • నిద్ర ఎంతసేపు పోవాలనే విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కో అలవాటు ఉంటుంది. కొంతమంది కొన్ని గంటల నిద్రతో సరిపెడతారు. మరి కొంతమందికి 8 నుంచి 9 గంటల నిద్ర లేకపోతే సరిపోదు. రోజుకు 5 గంటలకన్నా నిద్ర తగ్గినా, 9 గంటలకన్నా ఎక్కువసేపు నిద్రపోయినా అనారోగ్య సమస్యలు తప్పవని పలు అధ్యయనాల్లో గుర్తించారు
  • శరీరంలో జీవక్రియల్ని, కణాల్లోని శక్తి నిల్వల్నీ నియంత్రించే జీవ గడియారం కూడా కంటినిండా నిద్ర, సరైన ఆహారం ఉన్నప్పుడే చక్కగా పని చేస్తుంది.
  • దీర్ఘకాలంగా చాలినంత నిద్రలేకుండా గడపటం వల్ల జీవక్రియ పనితీరులో మార్పులు తలెత్తుతాయి. పిండి పదార్థాలను జీర్ణించుకోవటం, నిల్వ చేసుకోవటం, ఒత్తిడి హార్మోన్‌ కార్టిసోల్‌ను ఎక్కువెక్కువగా విడుదలయ్యేలా ప్రేరణలు అందించటం వంటి జీవక్రియ మార్పులు చోటుచేసుకుంటాయి.  
  • కార్టిసోల్‌ ఎక్కువెక్కువగా విడుదలైతే పొట్టచుట్టూ అదనపు కొవ్వు పేరుకుంటుంది. దీనివల్ల గుండె జబ్బుల ముప్పూ ఎక్కువవుతుంది.
  • నిద్రలేమి లెప్టిన్‌ నిల్వల్ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్‌ ఆకలిని అణచి పెడుతూ, మరోవైపు ఆకలిని ప్రేరేపించే ఘ్రెలిన్‌ నిల్వల్ని పెంచుతుంది. ఈ సమతౌల్యం కారణంగానే ఆకలి-తినటం అనే ప్రక్రియ సజావుగా సాగుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top