తెలుపు (వైట్‌ డిశ్ఛార్జి) ని తేలిగ్గా తీసుకోవద్దు!

ApurupA
0
మహిళలు వైద్యుల్ని సంప్రదించడానికి దారితీసే కారణాల్లో వైట్‌ డిశ్ఛార్జి కూడా ఒకటి. వినడానికి చిన్న విషయంగానే అనిపిస్తుంది కానీ.. కొన్నిసార్లు ఇది రకరకాల ఇన్‌ఫెక్షన్లకీ, క్యాన్సర్‌కీ సూచన కావచ్చు. అందుకే ఈ కింది కారణాల్లో ఏది కనిపించినా.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. 

శరీర సహజ పనితీరు వల్ల జరిగే వైట్‌ డిశ్ఛార్జికీ, మరేదయినా కారణంతో అది కనిపించడానికీ చాలా తేడా ఉంటుంది. ఈ సమస్యతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు నడుమునొప్పీ, విపరీతమైన నీరసం, ఏ పనీ చేయలేకపోతున్నామని చెబుతుంటారు మహిళలు. వైట్‌ డిశ్ఛార్జి కావడం వల్లే ఇలా జరుగుతోందా అని సందేహిస్తారు. కొన్నిసార్లు ఇతర కారణాలూ ఈ సమస్యకు దారితీస్తాయి. అసలు వైట్‌ డిశ్ఛార్జి, ఎలా ఎందుకు అవుతుందంటే..  

నోట్లో లాలాజలం, కంట్లో తడి పొర ఉన్నట్లుగానే యోనిలోనూ సహజమైన స్రావాలు ఉంటాయి. అవి గర్భాశయ ముఖ ద్వారం, యోని గోడలూ, యోని ద్వారంలో ఉండే బార్థోలిన్‌, చర్మంపై ఉండే స్వేద గ్రంథులూ, సెబేషియస్‌ గ్రంథుల నుంచి తయారవుతాయి. అలాగే అతి కొద్దిగా ఫెల్లోపియన్‌ ట్యూబులూ, ఎండోమెట్రియం పొర నుంచీ స్రావాలు విడుదలవుతాయి. ఇవన్నీ కలిసి యోని నుంచి తెల్లని ద్రవం రూపంలో బయటకు వస్తాయి. అదే వైట్‌ డిశ్ఛార్జి. అయితే ఆ స్రావాలు ఎంతవరకూ ఉంటాయనేది ఆ సమయంలో శరీరంలో ఉండే హార్మోన్ల పనితీరు ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఈస్ట్రోజెన్‌ హార్మోను ఎక్కువగా ఉండే సమయంలో వైట్‌ డిశ్ఛార్జి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అదే అండం విడుదలైనప్పుడు జిగురు లాంటి మ్యూకస్‌ కనిపిస్తుంది. దాన్ని బట్టి గర్భధారణకు ఆ స్త్రీ శరీరం అనుకూలంగా ఉన్నట్లు అర్థం. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు హార్మోన్ల పనితీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడూ కనిపిస్తుంది. కలయిక సమయంలో ల్యూబ్రికేషన్‌ కోసం గ్రంథులు ఎక్కువగా ప్రేరేపితమైనప్పుడూ, నెలసరికి ముందూ వైట్‌ డిశ్ఛార్జి కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో భయపడాల్సిన అవసరంలేదు.  

అనారోగ్యానికి సంకేతం.. 

కొన్నిసార్లు వైట్‌ డిశ్ఛార్జితో పాటూ దురదా, దుర్వాసనా కూడా ఉంటాయి. రంగూ మారుతుంది. అది ఇన్‌ఫెక్షన్‌కి సంకేతం కావచ్చు. యోనిలో ఉండే లాక్టోబాసిలస్‌ అనే మంచి బ్యాక్టీరియా మిగిలిన సూక్ష్మక్రిముల ద్వారా ఇన్‌ఫెక్షన్లు రాకుండా రక్షణ కవచంలా అడ్డుకుంటుంది. అయితే కొన్నిసార్లు నెలసరి సమయంలో, కాన్పూ, అబార్షన్‌ తరవాత ఆ లాక్టోబాసిలస్‌ క్రిముల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడూ హానికారక బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాంటి వాటిల్లో ట్రైకోమోనాస్‌, ఫంగస్‌, క్లమీడియా లాంటి ఇన్‌ఫెక్షన్లు కీలకమైనవి. వీటిల్లో చాలా వరకూ లైంగికపరంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేవే. ఈ ఇన్‌ఫెక్షన్లు ఒక్క యోని భాగానికి మాత్రమే పరిమితం కావు. గర్భాశయ ముఖద్వారానికీ, తద్వారా గర్భాశయంలోకీ, ఫెల్లోపియన్‌ ట్యూబుల్లోకీ ప్రవేశిస్తాయి. 

ఎలా గుర్తించాలి: 
వైట్‌ డిశ్ఛార్జితో వైద్యుల్ని సంప్రదించినప్పుడు 'స్పెక్యులమ్‌' అనే పరీక్ష చేస్తారు. ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ ఉందనే విషయాన్ని.. డిశ్ఛార్జి రంగు, వాసన, యోని ఎటువంటి మార్పులు జరిగాయనే దానిపై గుర్తిస్తారు. ట్రైకోమోనాస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు జననేంద్రియ భాగం ఎర్రగా, కంది పోయినట్లుగా కనిపిస్తుంది. ఎర్రగా, చిన్నచిన్న పొక్కులూ, లేత పసుపు రంగులో నురగ లాంటి డిశ్ఛార్జి కనిపిస్తుంది. ఒకవేళ ఫంగస్‌ లేదా ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే మీగడ తరకల్లాంటి డిశ్ఛార్జి యోని గోడలకు గట్టిగా అతుక్కుని ఉంటుంది. ఇలాంటప్పుడు విపరీతమైన దురద ఉంటుంది. వివిధ రకాల బ్యాక్టీరియాలు కారణమైతే డిశ్ఛార్జి లేత మబ్బు రంగులో కనిపించడంతోపాటూ, నీచు వాసనలా ఉంటుంది. 

సమస్యను గుర్తించాక ఇన్‌ఫెక్షన్‌ని బట్టి చికిత్స ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ స్త్రీతోపాటూ ఆమె భర్త కూడా చికిత్స తీసుకోవాలి. ఈ ఇన్‌ఫెక్షన్లకు మందులను నోటి మాత్రలుగా, యోనిలో అమర్చుకునేలా మాత్రల్లా లేదా క్రీంల రూపంలో ఉంటాయి. ట్రైకోమోసాస్‌ కోసం మెట్రోనిడజాల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు ఇమెడజోల్‌, క్లమీడియాకు డాక్సిసైక్లిన్‌, ఎరిత్రోమైసిన్‌ లాంటివి అందుబాటులో ఉన్నాయి. 

దీర్ఘకాలిక సమస్యలూ.. 

బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వైట్‌ డిశ్ఛార్జి అవుతున్నప్పుడు ఇతర సమస్యలూ తలెత్తవచ్చు. ముఖ్యంగా కటివలయానికి సంబంధించి పీఐడీ (పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌) మొదలవుతుంది. దాంతో పిల్లలు పుట్టకపోవడంతో మొదలుపెట్టి.. గర్భం దాల్చినప్పుడు కూడా ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. నెలలు నిండకుండా ఉమ్మ నీరు సంచి చిట్లి పోవడం, త్వరగా ప్రసవం జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రసవానంతరం కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించడం వల్ల ఇతర సమస్యలూ ఉంటాయి. 

  • కొంతమంది ఏళ్ల తరబడి చికిత్సలు తీసుకున్నా ఈ సమస్య తగ్గదు. అలాంటప్పుడు లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లూ లేవని నిర్థరించుకోవాలి. 
  • భర్తకి ఏదయినా కారణం వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు భార్య మాత్రమే వైట్‌ డిశ్ఛార్జికి చికిత్స తీసుకుంటే సరిపోదు. కలయిక జరిగాక భర్త నుంచి ఆ ఇన్‌ఫెక్షన్‌ మళ్లీ మొదలవుతుంది. ఉదాహరణకు భర్త మధుమేహంతో బాధపడుతున్నప్పుడు.. అతనికి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. అటువంటప్పుడు అతనూ చికిత్స తీసుకోవాలి. లేదంటే భార్యకు ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. 
  • మొండి బ్యాక్టీరియా ఉన్నప్పుడు వాడే మాత్రలు పనిచేయకపోవచ్చు. అటువంటప్పుడు ఎంత చికిత్స చేసినా ఫలితం ఉండదు. ఇలాంటి వారికి ఏ మందులు పనిచేస్తాయనేదీ తెలుసుకునేందుకు కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ పరీక్ష సూచిస్తారు వైద్యులు. వైట్‌ డిశ్ఛార్జిని ఒక చుక్క తీసుకుని గ్లాస్‌ పలకమీద ఉంచి మైక్రోస్కోప్‌ కింద పరీక్ష చేస్తారు. దానివల్ల ఏ తరహా బ్యాక్టీరియా అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టీ సరైన మందులు సూచిస్తారు. 


కొన్నిసార్లు ట్యూమర్లూ, క్యాన్సర్‌, అల్సర్‌ వల్ల కూడా అసాధారణమైన డిశ్ఛార్జి కావచ్చు. డిశ్ఛార్జిలో నెత్తుటి చారలు ఉండటం, కలయిక తరవాత రక్తం కనిపించడం ట్యూమర్లకి ముఖ్య సూచనలు. అలాగే గర్భాశయంలో ఎండోమెట్రియల్‌ పాలిప్స్‌, గర్భశయం లోపల పొరల్లో గడ్డలున్నప్పుడూ ఇటువంటి వైట్‌ డిశ్ఛార్జి కనిపిస్తుంది. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. 

ఇతర కారణాలు: 
కొన్నిసార్లు గర్భాశయ ముఖద్వారానికి పుండు అవుతుంది. ఆ భాగం చుట్టూ ఎర్రగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో డిశ్ఛార్జి ఎక్కువగా అవుతుంది. అప్పుడు పాప్‌స్మియర్‌ పరీక్ష చేస్తారు. ఆ తరవాతే చికిత్సను నిర్ధరిస్తారు. ఇలాంటప్పుడు యాంటీ బయోటిక్స్‌తో పాటూ ఎర్రగా మారిన భాగం మానేందుకు క్రయోథెరపీ లేదా ఎలక్ట్రిక్‌ కాటరీ చికిత్సలుంటాయి. 

ఈ జాగ్రత్తలూ అవసరమే..
ఈ సమస్యతో బాధపడేవారు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. కలయిక సమయంలో కండోమ్‌ వాడటం తప్పనిసరి. 
  • వ్యాధినిరోధక శక్తి తగ్గినా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి కాబట్టి తగ్గకుండా చూసుకోవాలి. ఆహారంలో పండ్లూ, కాయగూరలూ, ఆకుకూరలూ తీసుకోవాలి. వ్యాయామం చేయడమూ అవసరమే. 
  • వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. నెలసరి సమయంతో మొదలుపెట్టి జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పాప్‌స్మియర్‌ పరీక్షలు చేయించుకోవాలి. పిల్లల్ని ఎప్పుడు కనాలి.. అవాంఛిత గర్భం రాకుండా ఉండాలంటే ఏంచేయాలనే విషయాలను వైద్యులతో చర్చించాలి. సాధ్యమైనంత వరకూ అబార్షన్‌ చేయించుకోకూడదు. లేదంటే ఇన్‌ఫెక్షన్లు త్వరగా దాడిచేస్తాయి. 
  • ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని అనుమానం కలగగానే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top