డాక్టర్ దగ్గరకు వెళ్లగానే.. స్టెతస్కోప్‌తో 'లబ్-డబ్'లు వినటానికంటే ముందే.. మణికట్టు దగ్గర పట్టుకుని ఒక్క నిమిషం నాడి చూస్తారు. ఇలా చూస్తే ఏం తెలుస్తుంది? 'నాడి' మన వైద్యులకు ఏం చెబుతుంది? పూర్వకాలంలో కేవలం నాడి చూసే ఎన్నో వ్యాధులను గుర్తించేవారు. అన్ని విషయాలను చెబుతుందా మన నాడి?
మన గుండె అత్యంత కీలకమైన అవయవం. అది బలంగా కొట్టుకున్న ప్రతిసారీ.. మన గుండెకు అనుబంధంగా శరీరమంతా ఉన్న రక్తనాళాలు కూడా ప్రభావితమవుతాయి. గుండె కొట్టుకోవటం, ఆ ఒత్తిడి తాలూకూ తరంగాలు రక్తనాళాల ద్వారా మన శరీరమంతా పాకుతాయి. దీన్నే మన వైద్యులు 'నాడి' చూడటం ద్వారా గుర్తిస్తారు. ఈ ఒత్తిడి తరంగాలను మణికట్టు దగ్గర, చంకల్లో, మెడ పక్కన, తొడలు, మోకాలు వెనకవైపు, పాదాల్లో స్పష్టంగా గమనించవచ్చు. ఈ నాడీ వేగం.. మన గుండె కొట్టుకుంటున్న వేగాన్ని సూచిస్తుంది.
మణికట్టు దగ్గర నాడి తెలుసుకోవటం తేలిక. మణికట్టు కింద బొటనవేలు, పైవైపు చూపుడు, మధ్య, ఉంగరం వేళ్లను పెట్టి కొద్దిగా అదిమి చూస్తే.. క్రమ పద్ధతిలో నాడి కొట్టుకోవటం మనకు ఇట్టే తెలిసిపోతుంది. సాధారణంగా వైద్యులు దీన్ని 30 సెకన్లు లెక్కించి, దాన్ని రెట్టింపు చేయటం ద్వారా ఒక నిమిషంలో నాడి వేగాన్ని గణిస్తుంటారు.
స్టెతస్కోపు, ఈసీజీ వంటివి లేని పూర్వకాలంలో డాక్టర్లు ఈ నాడి చూడటం ద్వారానే రోగ నిర్ధారణ చేస్తుండేవారు. మానసిక ఆందోళన, ఉద్వేగాలు నాడీ వేగం పెరిగేలా చేస్తాయి. ఒంట్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా, రక్తహీనత వచ్చినా, కొన్నిరకాల గుండె జబ్బులున్నా నాడి ప్రభావితమవుతుంది. కాపీ, టీ, కూల్‌డ్రింకుల వంటి కెఫీన్ ఉండే పానీయాలను తాగినా నాడీ వేగం పెరుగుతుంది. కొన్ని రకాల బీపీ మందులు వేసుకుంటుంటే నాడీ వేగం తగ్గుతుంది.
మొత్తమ్మీద- విశ్రాంతి సమయంలో నాడీవేగం 76 కంటే ఎక్కువుంటే గుండె వ్యాధుల ముప్పు రెట్టింపు అయినట్టు లెక్క. అలాగే నాడి కొట్టుకుంటున్న తీరును బట్టి రకరకాల గుండె జబ్బులను కూడా వైద్యులు గుర్తించే లేదా కనీసం అనుమానించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాడి మీద ఒక కన్నేసి ఉండటం ద్వారా మన ఆరోగ్య పరిరక్షణకు కొంతవరకూ మనమే నడుం కట్టొచ్చు
మన వయసును బట్టి ఈ నాడీ వేగం మారుతుంటుంది...
- ఏడాది లోపు పిల్లల్లో: 100-160
- 1-10 ఏళ్ల పిల్లల్లో: 70-120
- 10 ఏళ్ల పైబడిన వారిలో: 60-100
- శిక్షణ పొందిన క్రీడాకారుల్లో: 40-60
- నిద్రలో: 40 వరకూ కూడా తగ్గొచ్చు.
- బాగా వ్యాయామం చేసినప్పుడూ.. మానసికంగా భయాందోళనలకు గురైనప్పుడు: 200 వరకూ కూడా వెళ్లొచ్చు.