గర్భం ద్వారా ఏర్పడిన పిండం మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత గర్భాశయం నుండి బయట పడడాన్ని గర్భస్రావం అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చు.
పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది.
సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవేకాక దీనికి ఎన్నో కారణాలుటాయి. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం.
ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవ సరం లేదు. వరుసనే ఎక్కువ సార్లు గర్భ స్రావం జరగడానికి అనేక కారణా లున్నాయి. అందు లో ముఖ్య మైనవి .
తల్లి వయసు
19 నుంచి 25 ఏళ్ల వయసులో గర్భం దాల్చ డానికి అన్నింటి కన్నా క్షేమ మైనా వయసు. 29 ఏళ్ల వరకు పర్వాలేదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత రిస్కు ఎక్కువుంటుంది.
జన్యుపరమైనవి
కనీసం 50 శాతం గర్భస్రావాలకు ఇవే కారణం. మొదటి మూడు నెలల్లోనే ఇవి చాలావరకు జరుగుతాయి. ప్రతీసారి అలా జరగాలని లేదు. జన్యుపరమైన లోపాలు గలిగిన పిండం ఎదగకుండా ఇది ఒక రకమైన సహజ సెలెక్షన్.
గర్భసంచిలో లోపాలు
పుట్టకతో గర్భకోశంలో ఉన్న లోపాల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, సర్విక్స్ వదులగా ఉండటం, గర్భకోశ ఆకారం పిండం ఎదుగులకు సరిపోకపోవడం, చిన్నగా ఉండటం వంటివి జరగొచ్చు. దీని వల్ల మూడో నెలలోపు లేదా నాలుగు ఐదు నెలల పిండంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశాలున్నాయి. సర్విక్స్ వదులుగా ఉండి గర్భం నిలువకపోవడం అనేది పుట్టుకతో వచ్చిన లోపం మాత్రమే కాకుండా క్రితం జరిగిన ప్రసవంలో చిరిగిపోవడం వల్ల అనేక మార్లు గర్భస్రావం జరగడం వల్ల, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశముంది. పిండానికి ఎలాంటి ఇన్‌ఫెక్షను సోకకుండా సర్విక్స్ కాపాడుతుంది. అది వదులు అయినప్పుడు గర్భకోశానికి, పిండానికి సోకే ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా నొప్పులు ముందే మొదలైన గర్భస్రావం జరగొచ్చు.
కంతులు
ఇవి ఉన్న ప్రదేశాన్ని బట్టి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కంతులు గర్భకోశం లోపలివైపు ఉన్నప్పుడు పిండం ఎదగడానికి సరైన రక్తప్రసరణ జరగకపోవడం, ముందే కాన్పు, నొప్పులు రావడం అసలు గర్భం ధరించడానికే ఆలస్యం అవడం జరగొచ్చు. ఇవే కంతులు గర్భకోశానికి బయటివైపు ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశం కొంచెం ఎక్కువ.
ఇతర కారణాలు
అవాంఛిత గర్భం తీసివేయడానికి అనేసార్లు క్యూరుటు చేయించుకోవడం వల్ల గర్భకోశంలో అనవసరమైన పొరలు ఏర్పడే అవకాశముంది. క్షయ వచ్చినప్పుడు కూడా ఇలా జరగొచ్చు. ఈ పొరలు రక్తప్రసరణను అడ్టుకుంటాయి. వీటిని హిస్టిరోస్కోపి ఆపరేషను ద్వారా తొలగించొచ్చు. పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోం, థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిలో గర్భస్రావాలు జరగొచ్చు. రక్తం గడ్డకట్టడంలో లేడాలు, ఎపిఎల్‌ఎ సిండ్రోం, ధూమపానం, పెల్విక్ ఇన్‌ఫెక్షన్లు, మానసికంగా అశాంతి, ఉద్యోగంలో పనిఒత్తిడి వంటివి కూడా గర్భస్రావానికి కారణం కావొచ్చు.
చికిత్స
రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్ యాసిడ్ వాడుకుని మళ్లీ గర్భం ప్లాన్ చేయొచ్చు. అబార్షన్ అయినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి, ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.
గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషను ద్వారా సరిదిద్దొచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్‌కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించొచ్చు.
గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు, వాడుకుని, విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగు చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనొవ్వొచ్చు.