మన శరీరానికి తగినంత శక్తి కావాలంటే ప్రధానంగా పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు), ప్రొటీన్లు, కొవ్వులు తగిన మోతాదులో మనం తప్పనిసరిగా తీసుకోవాలి. వీటి తో పాటు సూక్ష్మపోషకాలైన విటమిన్లు, ఖనిజలవణాలను కూడా తగిన పాళ్లలో తీసుకుంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం.
రోజూ మంచి ఆహారం తీసుకుంటున్నా నీరసంగా ఉంటోంది అని వాపోయే వారిని చూస్తుంటాం. ఏదో ఒకటి తినడం కన్నా ఎన్ని రకాల పదార్థాలు తింటున్నామన్న విషయం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పండ్లు, కూరగాయలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను మన మెనూలో చేర్చినప్పుడే సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం మన సొంతం అవుతుంది.
అసలైన ఆహారం.. పండ్లు, కూరగాయలు
విటమిన్ ఎ : ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లలో ఎ విటమిన్ దొరుకుతుంది. కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా ఇది మంచి యాంటి ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు శరీరం లోపలి పొరలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
విటమిన్ బి : పాలు, గోధుమ అన్నం, నారింజ, సోయా, మాంసాహారం, అలసందలు, బబ్బర్లు, గింజధాన్యాల్లో వివిధ రకాల బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారడంలో బి విటమిన్‌ది కీలక పాత్ర.
విటమిన్ సి : నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి లాంటి సిట్రస్ ఫలాల్లో అధికంగా ఉంటుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యానికే కాదు.. మన శరీరం ఎ విటమిన్‌ను సరిగ్గా తీసుకోవాలంటే తప్పనిసరిగా విటమిన్ సి ఉండాల్సిందే. అయితే వేడిమితో విటమిన్ సి నశిస్తుంది. అందుకే మొలకెత్తిన గింజలను వేడి చేయకుండా పచ్చివిగానే తీసుకోవాలి.
విటమిన్ డి: ఉదయం నీరెండలో కాసేపు నిల్చుంటే మనకు డి విటమిన్ వచ్చేసినట్టే. శరీరం కాల్షియంను గ్రహించి వినియోగించుకోవాలంటే డి విటమిన్ కావాల్సిందే.
విటమిన్ ఇ : ఇది శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్. చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఇ విటమిన్ వివిధ రకాల జీవప్రక్రియలకు కూడా తోడ్పడుతుంది. గింజధాన్యాలలో ఇది ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్ కె: ఉదయం నీరెండలో కాసేపు నిల్చుంటే మనకు డి విటమిన్ వచ్చేసినట్టే. శరీరం కాల్షియంను గ్రహించి వినియోగించుకోవాలంటే డి విటమిన్ కావాల్సిందే.రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర వహించే కె విటమిన్ ఆకుకూరలు, చిక్కుళ్లలో ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్లతో పాటు ఖనిజలవణాల పాత్ర కూడా కీలకమైనదే. ఎముకలు, దంతాల పటిష్టతకు కాల్షియం, బిపి, గుండెజబ్బుల నివారణకు పొటాషియం, ఎంజైమ్‌ల చర్యల కోసం మాంగనీస్, శిరోజాల ఆరోగ్యానికి, గ ర్భస్థ శిశువు పెరుగుదలకు జింక్, రక్తవృద్ధికి ఇనుము, థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగుండడానికి అయోడిన్.. ఇలా ఖనిజలవణాలన్నీ కూడా మన ఆహారంలో సమపాళ్లలో ఉన్నప్పుడే అది పూర్తిస్థాయిలో సమతులాహారం అవుతుంది.
ప్రొటీన్లు
శరీరం దృఢమైన రూపు సంతరించుకోవడానికి మూలకారణం ప్రొటీన్లే. ముఖ్యంగా పిల్లల్లో పెరుగుదల ప్రక్రియ సజావుగా సాగడానికి ప్రొటీన్ల అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక అనేక రకాలైన శరీర క్రియలను నిర్వర్తించే హార్మోన్లు రక్తంలోకి విడుదల కావాలన్నా, చురుగ్గా పనిచేయాలన్నా ప్రొటీన్లు అవసరం. అత్యవసర అమైనో ఆమ్లాల తయారీకి ప్రొటీన్లు ఉపయోగపడతాయి. ఈ అమైనో ఆమ్లాలు మెదడు పెరుగుదల, పనితీరుకు అవసరమవుతాయి. గాయం త్వరగా మానాలన్నా, శరీరంలో ఎటువంటి మరమ్మతులు జరగాలన్నా వాటిలో ప్రొటీన్ల పాత్ర ఉంటుంది. అందుకే ఆపరేషన్ అయిన తరువాత ఎక్కువగా ప్రొటీన్లు తీసుకోవాలంటారు. శరీరంలో జరిగే ప్రతి జీవరసాయనిక చర్యలోనూ ప్రొటీన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. రక్తంలోని హిమోగ్లోబిన్ తయారుకావాలంటే ప్రొటీన్లు ఉండాల్సిందే. అందుకే ప్రొటీన్లు తక్కువైతే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. శరీర వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
కొవ్వు పదార్థాలు
అమితమైన శక్తినిచ్చే పోషకాలు కొవ్వు పదార్థాలు. మేలుచేసే కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకుంటే ఎంత నష్టం ఉంటుందో హానికరమైన కొవ్వులను ఎక్కువగా తీసుకుంటే అంతకు రెట్టింపు కీడు కలుగుతుంది. పత్తినూనె, పామాయిల్, నెయ్యి, వెన్న లాంటి వాటిలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో వీటి మోతాదు పది శాతం కన్నా తక్కువే ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగి గుండెజబ్బుల్లాంటి వ్యాధులకు దారితీస్తుంది. చేపలు, అవిసె నూనెలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెజబ్బులకు మంచి మందుగా పనిచేస్తాయి. రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తాయి. రక్తం నుంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించి వెనక్కి కాలేయానికి పంపిస్తాయి. తద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా కాపాడతాయి. మనం రోజుకి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. కోడిగుడ్డు పసుపు సొనలో సుమారు 250 మిల్లీగ్రాముల దాకా కొలెస్ట్రాల్ ఉంటుంది.
వైట్‌రైస్ కన్నా గోధుమరొట్టె తినడం శ్రేయస్కరం. బియ్యంలో పోషకాలు చాలా చాలా తక్కువ. ఒకరకంగా ఏమీ ఉండవనే చెప్పాలి. అంతేగాకుండా అన్నం తిన్నప్పుడు దానిలోని చక్కెరలు రక్తంలోకి చాలా వేగంగా చేరుకుంటాయి. అన్నం ద్వారా వచ్చే కేలరీలు ఏమాత్రం ఎక్కువైనా సులభంగా కొవ్వులుగా మార్పు చెందుతాయి.శక్తి కోసం తప్పితే వీటివల్ల ఎటువంటి లాభమూ లేదు. మనం తీసుకునే బియ్యం పాలిష్ చేసినవి కావడం చేత బి - విటమిన్ కూడా నష్టపోతున్నాం. అందుకే సాధారణ తెల్ల బియ్యం కన్నా బ్రౌన్‌రైస్ (గోధుమ అన్నం) తీసుకోవడం మంచిది. గోధుమల్లో మాత్రం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే చక్కెరలు కూడా చాలా సంక్లిష్టమైనవి. కాబట్టి రక్తంలోకి చేరాలంటే ఎక్కువ సమయం పడుతుంది. గోధుమల్లో ప్రొటీన్లు, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈ రెండింటి కన్నా మేలైన కార్బోహైడ్రేట్లు ఓటు ధాన్యంలో ఉంటాయి. వీటిలోని కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెరల మోతాదు పెరగకుండా అడ్డుకుంటుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.