ఎనొరెక్సియా అనేది కౌమార, యుక్త వయసులో ఉన్న పిల్లల్లో తలత్తే మానసిక పరిస్థితి. ఈ సమస్య అబ్బాయిలలో కంటే అమ్మాయిలలో ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి వైద్య చికిత్సతో పాటు నిపుణుల కౌన్సెలింగ్ కూడా తప్పనిసరి అవుతుంది. గతంలో ఈ వ్యాధి కేవలం విదేశాల్లో మాత్రమే కనిపించేది. ఈ మధ్య మన దేశంలోనూ చాలమంది అమ్మాయిలు ‘ఎనొరెక్సియా’తో బారిన పడుతున్నారు.
- ఎనొరెక్సియా బాధితులను ముఖ్యంగా తాము లావైపోతున్నామన్న భావన వేధిస్తూ ఉంటుంది. అద్దంలో తమను తాము చూసుకున్నప్పుడు వీరికి చింత పెరిగిపోతూ ఉంటుంది. సన్నగా ఉంటేనే సమాజంలో ఆదరణ లభిస్తుందని, అదే అందమని వీరికి ఓ అపోహ ఉంటుంది.
- దాంతో ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేస్తారు. ఈ సమస్య ఎక్కువగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. వీళ్లు సాధారణంగా ఉండాల్సిన దాని కంటే 15 శాతం తక్కువ బరువుంటారు.
- చిత్రమేమిటంటే వీళ్లు తాము ఎనొరెక్సియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే వీళ్ళను చికిత్స కోసం ఒప్పించడం కూడా అంత సులువైన విషయమేమీ కాదు.
- ఇలాంటి వాళ్లు ఆహార నియమాలను మార్చుకొని, తమ ఎత్తుకు తగిన బరువును తిరిగి పొందేందుకు చాల కష్టపడాల్సి ఉంటుంది.
ఎత్తుకు తగిన బరువు ఉండాల్సిన అవసరం, శరీర ఆకృతి పట్ల అవగాహన, పెరిగే వయసులో శరీరానికి అవసరమయ్యే పోషకాలు, ఆరోగ్యకరమైన అలవాట్లు వంటి వాటి గురించి తెలుసుకోవడం చాల ముఖ్యం. ఆకలితో మాడిపోతే శరీరం ఎలా శుష్కించిపోతుందో అర్ధం చేసుకోవాలి.
- అదే పనిగా బరువు తగ్గుతున్నా, ఆహారం మరీ మితంగా తీసుకుంటున్నా, కుంగుబాటుకు గురవుతున్నా, చదువులో వెనుకబడ్డా ఎనొరెక్సియాతో బాధపడుతున్నట్లు వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తించాల్సి ఉంటుంది. అధికంగా డైటింగ్ చేయడం వల్ల నాడీ మండల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- కొన్ని హార్మోన్ సంబంధిత ఇబ్బందులు కూడా తలత్తే అవకాశం ఉంటుంది. తిన్నది కొంచెమే అయినా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇదీ సమస్యలో బాగమే.
- దీంతో పాటు ఇతర సమస్యలూ ఉంటాయి. మలబద్ధకం, డీహైడ్రేషన్, కుంగుబాటు, మత్తుగా ఉండడం, నీరసం, ఏకాగ్రత లేకపోవడం, బరువు, బీపీ తగ్గడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, లావవుతున్నామనే మానసిక ఆందోళన, తదితర సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
- ఇలాంటి వాళ్లు కావాలనే ఆకలిని చంపుకుంటూ ఉంటారు. దాంతో కడుపు నిండా తిండి తినడంలోని ఆనందాన్ని ఆస్వాదించ లేరు. పైగా ఆకలిని అణచివేసి సన్నబడు తున్నామనే సంతృప్తిని పెంచుకుంటారు. ఇది శృతి మించితే మనిషి ఎముకల గూడుల మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
- దీంతో పాటు గుండె, జీర్ణక్రియ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి పునరుత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స చేయిస్తే మంచిది.