వయసుకు తగినట్లు శారీరక మార్పులు జరిగితేనే ఆనందమే. రుతుచక్రానికి కూడా ఇదే వర్తిస్తుంది. సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలు అవ్వవలసిన రుతుక్రమం పదేళ్లలోపే వస్తే? దానిని ఒక సమస్యగానే భావించాలంటున్నారు నిపుణులు. సరైన అవగాహన పెంచుకుని, ఇతరత్రా ఇబ్బందులు తలత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అమ్మాయిలు బాల్యం నుంచి యౌవ్వనంలోకి అడుగుపెట్టే క్రమంలో శారీరక మార్పులు చోటుచేసుకోవడం సహజం. ఎముకలు, కండరాల ఎదుగుదలతో పాటు, సంతానోత్పత్తికి అనువుగా మరికొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. వీటితో పాటే అమ్మాయిలకు రుతుచక్రం కూడా సాధారణంగా వచ్చే మార్పే.
ఇది పన్నెండు నుంచి పదిహేనేళ్లలోపు మొదలవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో పదేళ్ల వయసుకి ముందే నెలసరి మొదలవడం ఎక్కువవుతోంది. మూడు నాలుగేళ్ల ముందుగానే ఇలా జరగడానికి కారణాలివీ అని స్పష్టంగా చెప్పలేం. ఆడపిల్ల రజస్వల అవడానికి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు భాల్యం నుంచి యౌవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో శారీరకంగా ఎలాంటి మార్పులు జరుగుతాయనేది తెలుసుకోవాలి. మెదడులో ఈ ప్రక్రియ మొదలై గొనాడోట్రోఫిస్ అనే హార్మోస్ విడుదలవుతుంది. అది ప్రిట్యూటరీ గ్రంథికి చేరి ఎల్హెఛ్, ఎఫ్ఎహెచ్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ రెండూ అమ్మాయిల్లో శారీరక మార్పులు జరిగేందుకు తోడ్పడే ఈస్టోజన్ హార్మోన్ ను అండాశయాల్లో విడుదలయ్యేల చేస్తాయి. అప్పటి నుంచి శారీరక మార్పులు చోటుచేసుకుంటయి. ఆ తర్వాతే నెలసరి రావడం ప్రారంభమవుతుంది.
మార్పుకు కారణాలు..
కొన్నిసార్లు ఎలాంటి సమస్యలు, లోపాలు లేకపోయినా రుతుచక్రం ముందుగానే వచ్చేయవచ్చు. మరికొన్ని సార్లు మెదడూ, వెన్నెముకపై రేడియేషస్ ప్రభావం ఎక్కువగా ఉండం, వాటికి గాయాలవడం కూడా అందుకు కారణం అవుతాయి. ఒక్కోసారి జన్యుపరమైన సమస్యలూ కారణమవుతుంటయి. అయితే, చాల తక్కువ మందిలో ఇలా జరుగుతుంది. ఎముకలూ, చర్మం రంగుని ప్రభావితం చేసే జన్యు సమస్య మెక్క్యూస్ ఆల్బ్రైట్ సిండ్రోమ్ ఇలాంటి వాటిలో ఒకటి. దీని వల్ల హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. అడ్రినల్, పిట్యుటరీ గ్రంథులూ, అండాశయాల్లో లోపాల వల్ల శరీరంలో ఈస్టోజెస్ హార్మోస్ త్వరగా విడుదలవుతుంది. ఇస్ఫెక్షన్లు, హార్మోన్ల పనితీరులో తేడా, హైపో థైరాయిడిజం వల్ల కూడా రుతుచక్రం ముందే వచ్చేయచ్చు. వయసు, శరీరాకృతికి తగిన్టు సరైన బరువు లేకపోయినా సమస్యే. పీలగా కనిపించే వారిలో రుతుక్రమం త్వరగా వచ్చేస్తుంది. సెక్స్ హార్మోన్స్ గా పరిగణించే ఈస్టోజెస్, టస్టోస్టీరాన్ లు ఉన్న మాత్రలను తీసుకోవడం వల్ల కూడా ముందే రుతుక్రమం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు జంక్ఫుడ్ ఎక్కువగా తినడం, అది వారికి పడకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమే అని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
లక్షణాలను ముందే గుర్తించవచ్చు :
అంతగా ఊహ తెలియని వయసులో రుతుక్రమం మొదలు కావడంతో చాలమంది అమ్మాయిలు భయపడతారు. ఛాతీ పెరుగుదల, మొటిమలు రావడం, చేతుల కింద వెంటుకలు రావడం వంటివి అర్థం కాక అయోమయానికి గురవుతారు. అదీకాక తమ వయసు వారి కన్నా ముందే వేగంగా పొడవు పెరుగుతారు. ఎముకలు కూడా త్వరగా పరిణతి చెందుతాయి. అయితే రుతుక్రమం మొదలై కొన్నాళ్లు గడిచేప్పటికి ఆ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. దాంతో కొన్నేళ్ల తర్వాత చూసుకుంటే వయసుకు తగిన పొడవు ఉండరు. ఈ క్రమంలో- ఈ మార్పుల్ని గమనించి తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వయసుకు తగిన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో రుతుచక్రం మొదలైన అమ్మాయిల్లో తోటివారితో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవడం, అది ఒత్తిడికి దారి తీయడం, చురుగ్గా లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఈ సమయంలో తల్లి పాత్ర చాల కీలకమైంది. శరీర నిర్మాణం, రుతుచక్రం రావడం గురించి అమ్మాయికి విపులంగా వివరించాలి. చిన్న వయసులోనే రుతుక్రమం రావడం సమస్య కాదనీ, ఒక్కోసారి అల జరుగుతూ ఉంటుందని చెప్పాలి. ఈ విధంగా ముందుగా మెచ్యూర్ అయిన వాళ్లపై టీవీ, ఇంటర్నెట్ ఆకర్షణల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
చిన్నవయసులోనే రుతుక్రమం మొదలైనప్పుడు లేదా అంతకన్నా ముందే ఆ లక్షణాలను గుర్తించడానికి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు. అమ్మాయి చేయి, మణికట్టును ఎక్స్రే తీసి ఎముక వయసును గుర్తిస్తారు. ఎముకల ఎదుగుదల ఎంత వేగంగా ఉందన్న దాన్ని బట్టి హార్మోన్ల పనితీరుని తెలుసుకుంటారు. అలాగే రక్తపరీక్ష, గొనాడోట్రోఫిస్ హార్మోస్ పరీక్ష చేస్తారు. వాటిని బట్టి ఇతర హార్మోన్ల గురించి తెలుసుకుంటారు. కొన్నిసార్లు హైపో థైరాయిడిజం కూడా ఈ సమస్యకు కారణం అవుతుంది కాబట్టి థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకోమని సూచిస్తారు. వీటివల్ల కేవలం రుతుచక్రం గురించి తెలుసుకోవడమే కాదు, అందుకు కారణమయ్యే ఇతర సమస్యలనూ గుర్తించవచ్చు.
వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి!
పరీక్షలన్నీ చేశాక సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా రుతుచక్రం మొదలైందని తేలితే కొన్ని రకాల మాత్రలను సూచిస్తారు. అయితే కొన్నిసార్లు ఆ మందును ప్రతి నెల ఇంజెక్షస్ రూపంలో చేయించుకోమంటరు. దాని వల్ల కొంతకాలం పాటు ప్రతి నెల వచ్చే నెలసరి ఆగిపోతుంది. రుతుక్రమానికి తగిన వయసు వచ్చే వరకూ వాటిని వాడాల్సి ఉంటుంది. ఒక్కసారి సరైన వయసు వచ్చాక డాక్టర్ సలహాతో వాటిని మానేయవచ్చు. ఆ తర్వాత మళ్లీ మార్పులు మొదలతాయి.
ముందుజాగ్రత్త..
సమస్య వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందుగా జాగ్రత్తపడడమే అన్ని విధాల మేలు. అలాగే వయసుకు తగినట్లుగా కనీసం ఇరవై నిమిషాలు నడక లేదా యోగా లాంటివి చేయడం చాల అవసరం. ఒత్తిడి సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. అలాగే జంక్ ఫుడ్ తగ్గించి, దానికి బదులుగా పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే వయసుకు తగిన మార్పులు సహజంగా చోటు చేసుకుంటాయి.