గుండెదడ... ఇది ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ అనుభవం లోకి వచ్చే అంశమే. పరీక్షలకు వెళ్లేప్పుడో, ఏ విషయం గురించైనా ఆందోళనతో ఎదురు చూసేటప్పుడో, ఏదైనా వినకూడని విషయం వినాల్సి వస్తుందనప్పుడో గుండె దడ కలగడం సర్వసాధారణం. అయితే ఇది సాధారణంగా కాకుండా కొన్ని సార్లు ఇబ్బంది కలిగేలా కూడా ఉండవచ్చు. అలాంటప్పుడే చికిత్స అవసరమవుతుంది. గుండెదడకు కారణాలు, అది వచ్చినప్పుడు కలిగే పరిణామాలు, దాన్ని సరిచేయడానికి అవసరమైన చికిత్స ప్రక్రియల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
గుండె స్పందనలు కలగడం ప్రతి వ్యక్తిలోనూ కనిపించే అంశమే. అయితే అలా గుండె స్పందనలు మనలో ఎవరికీ తెలియకుండానే జరిగిపోతుంటాయి. కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండవచ్చు. లేదా మరింత నెమ్మదిగా కూడా జరుగుతుండవచ్చు. ఒక వ్యక్తిలో గుండె కొట్టుకోవడం ఆ వ్యక్తికే తెలిసేలా జరుగుతుంటే దాన్ని గుండెదడగాచెప్పవచ్చు.
గుండెదడ అంటే...
గుండెదడ అన్నది ఒక వ్యాధి కావచ్చు. లేదా ఏదైనా వ్యాధికి అది లక్షణం కూడా కావచ్చు. రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, మానసిక ఆందోళన, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం లాంటి అనేక వ్యాధుల్లో కూడా గుండెదడ ప్రధాన లక్షణం. ఈ కారణంగా వచ్చే గుండెదడ... ప్రధాన వ్యాధికి తగిన చికిత్స చేస్తే తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో గుండె దడకు ప్రధాన కారణం ఇదే. కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మరికొందరిలో మాత్రం గుండెకు జరిగే విద్యుత్ సరఫరా సర్క్యూట్లో తేడాలు రావడం వల్ల గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులు రావడం సంభవిస్తుంది. గుండె కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువగా కొట్టుకుంటుంటే దాన్ని ‘టాకికార్డియా’ అని, నెమ్మదిగా కొట్టుకుంటే దాన్ని ‘బ్రాడీకార్డియా’ అని వైద్య పరిభాషలో చెబుతుంటారు.
గుండె ఎలక్ట్రిక్ సర్క్యుట్ ప్రాధాన్యం...
గుండె లయబద్ధంగా (నిమిషానికి 60 నుంచి 100 సార్లు) స్పందించడానికి అవసరమైన కండరశక్తిని సమకూర్చడంలో గుండె తాలూకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అత్యంత కీలకం. గుండె కచ్చితంగా నిర్ణీత వేగంతో కొట్టుకోడానికి అత్యంత క్రమశిక్షణతో గుండెకు అవసరమైన ఎలక్ట్రిక్ తరంగాలను ఇచ్చే పేస్మేకర్ గుండెలోని కుడి కర్ణికలో ఉంటుంది. దీనిపేరే ‘సైనస్ నోడ్’. ఇది గుండె తాలూకు పవర్హౌస్లా పరిగణించవచ్చు. ఇక్కడ తయారైన విద్యుత్ తరంగాలు కర్ణిక (ఏట్రియమ్), జఠరిక (వెంట్రికిల్)ల కూడలి వద్ద ఉన్న ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ దగ్గరకు వస్తాయి. గుండె విద్యుత్ తరంగాలు కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా తయారైనా ఈ ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ వాటిని గుండెకు చేర కుండా నియంత్రిస్తుంటుంది. అందుకని దీనిని గుండె తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్కి పోలీస్ ఆఫీసర్లాగా భావించవచ్చు. ఈ ఏవీనోడ్ నుంచి విద్యుత్ తరంగాలు గుండె ఎడమ జఠరిక (వెంట్రికల్) నుంచి కుడి (జఠరిక) వెంట్రికల్కు ప్రసరిస్తాయి. ఇది సాధారణ స్పందనల్లో జరిగే ప్రక్రియ.