మామూలుగా విశ్రాంతి తీసుకునేప్పుడు గుండె తక్కువ గా కొట్టుకుంటుంది. అదే తొందరగా నడిచేప్పుడు లేదా పరుగెత్తేప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రసరించడంతో గుండె స్పందనలు పెరుగుతాయి. ఇలా గుండె వేగంగా కొట్టుకోవడాన్ని గుండెదడగా పేర్కొనవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల నుంచి ఒక్కోసారి కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికంగా వచ్చే గుండె తరంగాలు గుండె సైనస్నోడ్ నుంచే కాకుండా గుండెలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అదనంగా ఏర్పడిన తరంగాల అనియంత్రితంగా గుండెకు చేరి గుండెదడకు కారణం కావచ్చు.
గుండెదడ లక్షణాలు
గుండెదడ వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్ష ణాలివి...
- ఆయాసం
- తలతిరగడం
- కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం కూడా జరగవచ్చు.
చికిత్స
గుండెదడకు చికిత్స అనేది రోగి పడే ఇబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. గుండెదడ వల్ల ఇబ్బంది తక్కువగా ఉంటే దాన్ని ప్రత్యేకమైన చికిత్స ఏదీ అవసరం లేదు. డాక్టర్ రోగికి కొన్ని చిట్కాలు సూచిస్తారు. చల్లనినీళ్లతో ముఖం కడుక్కోవడం, ఊపిరి బిగబట్టి ముక్కడం వంటి చాలా సాధారణ చిట్కాలతో దీన్ని అధిగమించవచ్చు.
గుండెదడ అనియంత్రితంగా జరుగుతుంటే మాత్రం చికిత్స అవసరమవుతుంది. అప్పుడు దీనికోసం కొన్ని మందులు వాడటం లేదా అబ్లేషన్ చికిత్స ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. గుండెదడను నియంత్రించడానికి ఉపయోగించే మందులు చాలా రకాలుగా ఉంటాయి. గుండెలో ని ఎలక్ట్రికల్ సిస్టమ్లో అధిక ప్రకంపనలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయో నిర్ధారణ చేసి, తగిన మందులను గుండె వ్యాధి నిపుణులు సూచిస్తారు. సాధారణంగా 90 శాతం వ్యక్తుల్లో కేవలం మందుల ద్వారానే ఈ సమస్యను నియంత్రించవచ్చు. అయితే ఈ తరహా మందులను జీవితాంతం వాడాల్సి రావడం వల్ల వీటి తాలూకు దుష్పరిణావూలు (సైడ్ ఎఫెక్ట్స్) తలెత్తే అవకావం ఉండవచ్చు. అందుకే ఒకవేళ మందులు పనిచేయకపోయినా లేదా మందుల కారణంగా దుష్ర్పభావాలు కనిపించినా అబ్లేషన్ పద్ధతి ద్వారా గుండెలోని ఏస్థానం నుంచి అధికంగా విద్యుత్ తరంగాలు తయారవుతున్నాయో చూసి, వాటిని సరిచేస్తారు. ఈ అబ్లేషన్ చికిత్స అంత సంక్లిష్టమైనది కూడా కాదు.
సురక్షితమైనది కూడా. పైగా గుండెదడను నియంత్రించడా నికి ఒకసారి అబ్లేషన్ చికిత్స చేయించాక ఇక జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అబ్లేషన్ చికిత్స చేశాక ఆ తర్వాత గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని పలుచబార్చడం కోసం ‘ఆస్పిరిన్’మందును ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే ఈ తరహా చికిత్స గురించి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
చాలా సందర్భాల్లో కేవలం ఆందోళన వల్లనే...
గుండెదడ అన్నది చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికీ కని పించే అంశమే. ఇది కేవలం మానసిక ఆందోళన వల్ల కూడా జరిగే అవకాశాలే ఎక్కువ. వ్యక్తిగత లక్షణాలలో భాగంగా కొందరికి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందడం తేలిగ్గా ఉద్రేకాలను లోనుకావడం వంటివి సంభవించ వచ్చు. ఇలా జరిగేప్పుడు వచ్చే గుండెదడ చాలా తాత్కాలికం. దీనికి ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు.
కాకపోతే ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఆందోళనలను నియంత్రించుకునేలా యోగా, ధ్యానం వంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అయితే ఈ తరహా చిట్కాలు కూడా ప్రయోజనం ఇవ్వని సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి గుండెదడ కనిపించినప్పుడు అది రోగికి ఆరోగ్యపరంగా ఇబ్బందినీ, సమస్యను కలిగించే స్థాయిలో ఉందా లేదా అన్నది హృద్రోగ నిపుణులతో పరీక్షింపజేసు కుని, అది పెద్ద ప్రమాదకరమైన విషయం కాదని వారు భరోసా ఇచ్చాక దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువ అన్నప్పుడే చికిత్స అవసరమని గుర్తిస్తే చాలు.