ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడంతో ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. నూటికి తొంభైమందిలో స్థూలకాయ సమస్య ఈ కారణాలవల్లనే వస్తోంది. మిగిలిన పదిమందిలో ఎండోక్రైన్ సమస్యలు, జన్యుపరమైన అంశాలు, మందుల దుష్ర్పభావం వంటివి ఈ సమస్యకు దారితీస్తున్నాయి. శరీరంలో కొవ్వు పురుషులలో 25 శాతం కంటే ఎక్కువగానూ, మహిళల్లో 35 శాతం కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ఉన్నట్లుగా పరిగణిస్తాం. స్థూలకాయం, దాని పరిష్కార మార్గాలపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి.
ప్రశ్న : స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి విదేశీయులకూ, భారతీయులకూ ఉపయోగించే ప్రమాణాలు ఒక్కటేనా...?
జవాబు: సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీ యులకూ, భారతీయులకూ ఒకటి కాదు. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి శరీర బరువును కిలోగ్రాములలో తీసుకొని, దానిని ఆ వ్యక్తి ఎత్తు (మీటర్లు) స్క్వేర్తో భాగిస్తే వచ్చే విలువే బీఎమ్ఐ.
ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోగ్రాములు, ఎత్తు 1.83 మీటర్లు (ఆరడుగులు) అనుకుందాం.
ఆ వ్యక్తి బీఎమ్ఐ (120 / 1.83) / 1.83
అంటే 120 / 1.83 = 65.57
65.57 / 1.83 = 35.8
120 కిలోగ్రాములు, ఎత్తు 1.83 మీటర్లు ఎత్తు ఉండే మనిషి బీఎమ్ఐ 35.8
ఇలా లెక్కించిన విలువను ఈ కింది బీఎమ్ఐ పట్టికతో పోల్చి చూసుకుంటే మీ స్థూలకాయ స్థాయి ఏమిటో తెలుస్తుంది.
స్థూలంగా... సూక్ష్మంగా...
ఏ స్థాయి స్థూలకాయం భారతీయుల బీఎమ్ఐ పాశ్చాత్యుల బీఎమ్ఐ
సాధారణ బరువు 18.50 - 22.99 కేజీ/మీ 21.850 - 24.99 కేజీ/మీ2
అధిక బరువు 23.00 - 24.99 కేజీ/మీ2 25.00 - 29.99 కేజీ/మీ2
స్వల్ప స్థూలకాయం 25.00 - 29.99 కేజీ/మీ 23.00 - 34.99 కేజీ/మీ2
అధిక స్థూలకాయం 30+ 35.00 - 39.99 కేజీ/మీ2
వ్యాధిగ్రస్త స్థూలకాయం 40.00 -49.99 కేజీ/మీ2
సూపర్ స్థూలకాయం 50.00 - 59.99 కేజీ/మీ2
సూపర్ సూపర్ స్థూలకాయం 60.00 - ఆపైన
బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువ గానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వుశాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనకు తక్కువ స్థూలకాయం ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
భారతీయుల్లో స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బాడీ మాస్ ఇండెక్స్తో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుం చుట్టుకొలత మహిళ ల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగా, పురుషుల్లో 90 సెం.మీ.కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లు. ఇక నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి.