నెలసరి సమయంలో నొప్పి కి కారణాలు...

ApurupA
0
చాలా మంది స్త్రీలకు నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. దీనిని బహిష్టు నొప్పి(డిస్మనోరియా) అంటారు. డిస్మనోరియా అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం యుక్త వయసులో ఉన్న స్త్రీలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ప్రతీ చిన్న విషయానికి ఎక్కువ ఆందోళన చెందడం వల్ల గర్భాశయంలోని హార్మోన్స్ సరియైన క్రమంలో పనిచేయక గర్భాశయ సమస్యలు మొదలవుతున్నాయని అంటున్నారు వైద్యులు. గర్భాశయానికి సంబంధించిన సమస్యలు, అందులో నెలసరి సమస్యలు స్త్రీలను ఎక్కువగా బాధిస్తుంటాయి. 
ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను ఎక్కువగా వేధిస్తుంది. బహిష్టు నొప్పి వల్ల స్కూల్కు, కాలేజ్కు వెళ్లలేకపోవడం, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయాల్సి రావడం, చికాకు, ఏ పనీ సరిగ్గా చేసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా మంది స్త్రీలు బహిష్టు నొప్పిని భరించాల్సిందేనా అని అడుగుతూ ఉంటారు.

ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చే బహిష్టు నొప్పి నివారణకు ఔషధాలు వేసుకుంటున్నా ఫలితం ఉండటం లేదని మరికొందరు స్త్రీలు వాపోతుంటారు. అయితే నిపుణులైన డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.

గర్భాశయ నిర్మాణం

స్త్రీలలో గర్భాశయం ముఖ్యమైన రీప్రోడక్టివ్ అర్గాన్. ఇది 9 సెంమీ పొడవు, 6.5 సెంమీల వెడల్పు, 3.5 సెంమీల మందం కలిగి పెల్విక్ జోన్లో అమరి ఉంటుంది. గర్భాశయంలో ఉండే లోపలి పొర కదలికలతో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది.

లక్షణాలు

  • కొంతమందిలో బహిష్టు మొదలైన మొదటిరోజు మాత్రమే ఒకటి, రెండు గంటలు నొప్పి ఉండి రుతుస్రావం సాఫీగా జరగడంతో తగ్గిపోతుంది. ఈ సమయంలో వచ్చే నొప్పి ఎక్కువగా ఉండి పొట్ట బిగదీసినట్లుగా ఉండటం, విరేచనాలు కావడం వంటి లక్షణాలు ఉంటాయి. నొప్పి మరీ అధికంగా ఉన్నప్పుడు వాంతులు కావడం, శరీరం వణకడం, కొన్ని సందర్భాల్లో తలతిరగడం జరగచ్చు. ఈ రకమైన లక్షణాలు 50శాతం మంది స్త్రీలలో కనిపిస్తాయి. దీనిని స్పాస్మోడిక్ డిస్మనోరియా అంటారు.
  • కొంతమందిలో బహిష్టు మూడు నుంచి ఐదు రోజుల ముందే పొత్తి కడుపులో, నడుము భాగంలో నొప్పితో ప్రారంభమవుతుంది. ఇది రుతుస్రావం మొదలైన తరువాత ఔషధాలు ఉపయోగించకపోయినా దానికదే తగ్గిపోతుంది. దీనిని కంజెస్టివ్ డిస్మనోరియా అంటారు.
  • కొంతమందిలో నొప్పి విపరీతంగా ఉండి రక్తస్రావంలో గడ్డలు పడటం జరుగుతుంది. దీనిని మెంబ్రేనస్ డిస్మనోరియా అంటారు.


కారణాలు

  • కొంతమందిలో యోని ముఖద్వారం చిన్నదిగా ఉండటం వల్ల స్రావం సరిగ్గా బయటకు రాక, చిన్నగడ్డల రూపంలో రుతుస్రావం జరిగి నొప్పి కలుగుతుంది.
  • గర్భాశయ ముఖద్వారం చిన్నదిగా ఉండటం, ముడుచుకుని ఉండటం వల్ల స్రావం సాఫీగా జరగక నొప్పి వస్తుంది.
  • గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు, ఇతరత్రా వ్యాధుల కారణంగా సరియైన సంకోచ వ్యాకోచాలు జరగకపోవడం కారణంగా రుతుస్రావం కష్టంగా ఉండి బహిష్టు సమయంలో నొప్పి విపరీతంగా వస్తుంది.
  •  గర్భాశయం ఆకృతిలోనూ, పరిమాణంలోనూ ఉండే తేడాల వల్ల బహిష్టు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
  • గర్భాశయం స్థానం మారి వెనకకు తిరిగి ఉండటం వల్ల కూడా బహిష్టు సమయంలో నొప్పి రావడం జరుగుతుంది.
  • గర్భాశయంలో గడ్డలు, చీము చేరడం, అండాశయంలో కణితులు పెరగడం మొదలైనవి కూడా నొప్పికి కారణమవుతాయి.
  • గర్భనిరోధక మాత్రలు వాడటం, గర్భనిరోధక పద్ధతులను పాటించడం, మానసిక ఆందోళన వంటి కారణాల వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడి నొప్పి ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఏం చేయాలి?

రుతు స్రావ సమస్యలకు ఇప్పుడు మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అధిక రక్తస్రావం జరుగుతున్నా, ఇతర రుతుస్రావ సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top