నవ్వినపుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా...?

ApurupA
0
నవ్వు నాలుగిందాల చేటనేది పాత సామెత. నవ్వు నాలుగిందాల ఆరోగ్యదాయిని అనేది నేటి మాట. ఇది మంచి మందులా పనిచేస్తుందని, తరచుగా నవ్వుతూ గడిపేవాళ్లు మరింత ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధనలు కూడా నొక్కి చెబుతున్నాయి. ఇంతకీ నవ్వినపుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ముఖంలోని కండరాలతో పాటు శరీరంలోని అన్ని కండరాలు సాగుతాయి. నాడి కొట్టుకోవటం, రక్తపోటు పెరుగుతుంది. శ్వాస వేగంగా తీసుకుంటాం. దీంతో మెదడుకు, కణజాలానికి ఆక్సిజన్‌ మరింతగా సరఫరా అవుతుంది. ఫలితంగా నిరుత్సాహం మాయమై హుషారు పుట్టుకొస్తుంది. నవ్వు చూపే ప్రభావాలపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటి వివరాలేంటో చూద్దాం. 

  • భోజనం చేసిన తర్వాత హాస్య సన్నివేశాలను చూసిన మధుమేహుల రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గినట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. 
  • నవ్వు మూలంగా రక్తనాళాల సంకోచ, వ్యాకోచాలు తేలికగా జరుగుతున్నట్టు మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. ఇలా రక్తప్రసరణ మెరుగుపడటానికి నవ్వు తోడ్పడుతుందన్నమాట. 
  • నవ్వు తేలికపాటి వ్యాయామంతో సమానంగా లాభాలు చేకూరుస్తున్నట్టు వెల్లడైంది. 10-15 నిమిషాల సేపు నవ్వితే 50 కేలరీలు ఖర్చవుతున్నట్టూ బయటపడింది. 
  • నవ్వు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబోడీల స్థాయులు పెరగటానికి తోడ్పడుతున్నట్టు, రోగనిరోధక కణాల మోతాదులనూ పెంచుతున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. 
  • ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులో గామా తరంగాలను ప్రేరేపిస్తున్నట్టు లోమా లిండా విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. మెదడులోని అన్ని భాగాల్లోనూ కనబడేవి ఒక్క గామా తరంగాలే. అంటే ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులోని అన్ని భాగాలపైనా ప్రభావం చూపుతుందన్నమాట.
  • స్పాండిలైటిస్‌ సమస్యతో బాధపడేవారు పది నిమిషాల సేపు హాస్య సన్నివేశాలతో కూడిన సినిమాలను చూస్తే రెండు గంటల పాటు నొప్పి లేకుండా హయిగా నిద్రపోయినట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top