నెయ్యి ఎవరికీ మంచిది కాదని భావిస్తూ కొందరు అస్సలు నెయ్యిని పూర్తిగా దూరంగా పెట్టేస్తుంటారు. ఇది సరికాదు. చంటి పిల్లలు, పెరిగే పిల్లలు, రోజంతా కష్టించి బరువు పని చేసేవారు, క్రీడాకారులు.. వీరంతా రోజూ నెయ్యి వంటివి తీసుకోవటం మంచిదే. నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్-ఎ ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. పెరిగే పిల్లలకు చాలా మంచి చేస్తుంది.
కాకపోతే అస్సలు శారీరక శ్రమ లేని కంప్యూటర్ ఉద్యోగుల వంటివారు, శారీరక కదలికలు పెద్దగా లేని, మంచం దిగని వృద్ధుల వంటివారు రోజూ నెయ్యి వంటివి తినటం మంచిది కాదు. నెయ్యి అనేది సంతృప్త కొవ్వు కాబట్టి దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా వంట నూనెలను తగ్గించటమంటే కష్టం గానీ నెయ్యి తగ్గించెయ్యటం, మానెయ్యటం తేలికే. అందుకే ఎదిగే వయసు దాటిపోయిన పెద్దలు దీనికి దూరంగా ఉండొచ్చు.