నిద్రలేమి కారణాలు, నివారణ చర్యలు

ApurupA
0
ఇప్పుడున్న సమాజ పోకడ, ఫాస్ట్ జనరేషన్‌లో చాలామందికి నిద్ర కరువైపోతోంది. ఫలితంగా నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. నిద్రలేమి చిన్న విషయం కాదు. మెదడు చురుకుగా పనిచేయాలంటే మనిషికి తగినంత నిద్ర అవసరం.
ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతుంటే, నిద్రలేమితో యువత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని సర్వేలు చెబుతున్నాయి. అసలు నిద్రలేమి అంటే ఏమిటో, దానికి కారణాలేమిటో, దాని లక్షణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రాత్రిపూట సరిగా నిద్రపట్టక పోవడాన్నే నిద్రలేమి(ఇన్సోమ్నియా) అంటారు. ఇది చాలామంది దృష్టిలో చిన్న సమస్య. కొందరైతే అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు. కానీ దీని దుష్పలితాలు ప్రమాదకరంగా ఉంటాయి. నిద్రలేమితో జరిగే అనర్థాలలో ప్రధానంగా ఏర్పడే సమస్య ఆరోగ్యం చెడిపోవడం. మానసికంగా, శారీరకంగా చురుకుదనం కోల్పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఒకటి.

లక్షణాలు : కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢమైన నిద్రలోకి జారుకోకపోవటం ఇందులో కనిపించే ప్రధానమైన లక్షణం. ఇక కొంతమందికైతే తొందరగా నిద్రపడుతుంది. కానీ అర్ధరాత్రి మెలకువ వస్తుంది. తరువాత మళ్లీ నిద్రపట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలామందికి నిద్రపోయిన తర్వాత మళ్లీ నిద్రలేచే సమయానికి ముందే మెలకువ వస్తుంటుంది. ఒకవేళ మళ్లీ పడుకుందామని ప్రయత్నించినా నిద్రరాదు. అయితే ఈ నిద్రలేమి సమస్య మగవారిలో కన్నా ఆడవాళ్లలో సమస్య ఎక్కువగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

కారణాలు : నిద్రలేమికి అసలు కారణాలేంటి, ఎలాంటి పరిస్థితిల్లో నిద్రలేమి వెంటాడుతుంది అనే సందేహాలకు వైద్యులు కొన్ని అంశాలను నిద్రలేమికి ప్రధాన కారణాలు చూపించారు. పని ఒత్తిడి, హృద్రోగ, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించిన మందులు వాడటం, విపరీతమైన ఆలోచనలు, శక్తికి మించి పనిచేయడం, కోపం, చిరాకు పడటం, మానసిక ఆందోళన, దాంపత్య జీవితం సరిగా లేకపోవడం, పగలు పడుకుని రాత్రి మేల్కొనడం. మొదలైనవి నిద్రలేమికి కారణాలు.

ప్రతి మనిషిలో భయం, ఉద్వేగం అనే లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల కారణంగా నిద్రపట్టక ఎప్పుడూ సతమతమవుతుంటారు. ఇది కూడా నిద్రలేమిని పెంపొందిస్తుంది. అలాంటివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే.. కచ్చితంగా రాత్రి పదిగంటలకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు పాలు తాగే అలవాటు చేసుకొవాలి. వేడి ఆహారం తినడం మంచిది. ఒత్తిడితో కూడిన పని చేయకూడదు.

నిద్ర త్వరగా వస్తుంది. కాని మధ్యలో చాలాసార్లు మెలకువ వస్తుంది. శరీరమంతా నొప్పులు, భయం, కోపం, బాధ మొదలైన లక్షణాలు ఉంటాయి. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే... మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఉపవాసం చేయకూడదు.

తెల్లవార్లు త్వరగా నిద్రలేవడం జరుగుతుంది. అలసటగా అనిపిస్తూ ఉంటుంది. సమయానికి ముందే మెలకువ వస్తుంది.దీనిని నివారించాలంటే వ్యాయామం ఎక్కువగా చేయాలి. గోరు వెచ్చని నీరు తాగాలి. తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.

నిద్రలేమిని అధిగమించడానికి సహజంగా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి....

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • కెఫిన్ లాంటి పదార్థాలు తినకూడదు.
  • మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
  • ఒత్తిడి తగ్గించుకోవాలి.
  •  పగటి నిద్ర మంచిది కాదు.
  • ఆహార విహారాలలో మార్పులు చేసుకోవాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top