ఆఫీసు పనివల్ల తామెంతో మానసిక ఒత్తిడికి గురవుచున్నామని ఉద్యోగాలు చేస్తున్న వారిలో సుమారు 50 శాతం మంది చెబుతుంటారు. ఆఫీసు పనిభారం వలన కలిగే ఈ మానసిక వత్తిడి కారణంగా కొంతమంది విధులకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మద్యపానానికి బానిసలవుతున్నారు. ఉత్పాదక శక్తి గణనీయంగా పడిపోవడానికి ఈ రకమైన వత్తిడి ఒక ప్రధాన కారణం.
మానసిక వత్తిడి అంటే?
మనందరమూ మన విధుల నిర్వహణలో అనేక రకాలైన సమస్యలను, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము. అయితే వీటిలో చాలా వరకూ మనం సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగే వే అయి ఉంటాయి. అయితే ఈ రకమైన సమస్యలు, లేదా క్లిష్ట పరిస్థితులు మనం పరిష్కరించుకోలేని స్థాయి దాటిపోయినప్పుడు, మానసికపరమైన, శారీరకమైన మార్పులు చోటు చేసుకోవడం మొదలవుతుంది. దీనిని మానసిక వత్తిడి లేదా స్ట్రెస్ అని వ్యవహరిస్తాము.
ఈ రకమైన మానసిక వత్తిడిని మనందమూ సాధారణంగా అప్పుడప్పుడూ అనుభవిస్తూనే ఉంటాము. అయితే ఇది కొన్నిసార్లు మనం ఊహించలేని పరిణామాలకు దారి తీస్తుంది.
లక్షణాలు
ఈ సమస్యలో లక్షణాలు మూడు దశలలో కనిపిస్తాయి. వాటిని ఈ కింద పొందుపరచడం జరిగింది.
- తొలిదశ
అస్పష్టమైన ఆందోళన, విసుగు, దేని మీదా అభిరుచి లేకపోవడం, లేదా అనవసరమైన విషాదం.
- మాధ్యమిక దశ
నిద్రాభంగం, తరచు తలనొప్పి రావడం, ఒళ్లు నొప్పులు, చిరాకు, మద్యపానానికి లేదా నిద్ర మాత్రలకు, లేదా పొగాకుకు బానిస కావడం.
- తీవ్రస్థాయి
తనను తాను తక్కువ చేసుకోవడం, తీవ్రమైన విచారం లేదా కోపం, ఆత్మహత్యా తలంపులు, తీవ్రమైన బాటు, అతి స్వల్ప విషయాలకే అతిగా స్పందించడం, అల్సర్లు, గుండెజబ్బులు వంటి శారీరక అనారోగ్యాలకు గురి కావడం.
ఉద్యోగ భద్రతపై భయం, పనిభారం ఎక్కు వగా ఉండటం, సహోద్యోగులు సహకరించక పోవడం తదితర అంశాలు కార్యాలయాలలో మానసిక ఒత్తిళ్లు పెరగడానికి కారణం. కేవలం పని భారం పెరిగినంత మాత్రం చేత మానసిక వత్తిడికి లోనుకారు.
- సాధారణంగా ఆఫీసు వాతావరణం, చేస్తున్న కృషిని మెచ్చుకోక పోవడం, ఆఫీసులో తనకంటే ఇతరులకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తున్న భావన మొదలైన అంశాలెన్నో ఈ రకమైన మానసిక వత్తిడికి కారణమవుతున్నాయి.
- ఒక వ్యక్తికి తాను చేస్తున్న పని పట్ల సంతృప్తి (జాబ్ శాటిస్ఫాక్షన్) లేనప్పుడు అది అతడి పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఆ వ్యక్తి తన ఉన్నతాధికారులనుంచి మందలింపులు, చివాట్లు తినాల్సి వస్తుంటుంది. దీనితో ఆ వ్యక్తి ఇంకా నిస్పృహకు గురవుతారు. అతడి పని తీరు మరింతగా దెబ్బ తింటుంది. చేస్తున్న పనిపై ఎలాంటి ఉత్సాహాన్ని చూపించడు. ఏదో పని చేయాలి కనుక తప్పనిసరై చేస్తున్న పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
- పనిభారంతో కలిగే మానసిక వత్తిడి అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించదు. మన సాధారణ ఆరోగ్యం, ఆఫీసు బైట మన స్నేహ సంబంధాలు, వ్యక్తిత్వం మొదలైనవి ఈ ఒత్తిడిని మనం ఎలా తట్టు కోగలుగుతున్నా మనే అంశాన్ని నిర్ధారిస్తాయి.
పనిభారంతో కలిగే ఈ మానసిక ఒత్తిడికి నిర్దుష్ట మైన నిబంధనలేవీ లేనందున కొన్ని చిన్న చిన్న సూచనలను పాటిస్తే దీనిని మనం సమర్థవంతంగా ఎదుర్కొనడం కష్టమేమీ కాదు.
మానసికారోగ్యానికి సూచనలు
- క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం అవసరం.
- కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ కలిసి సరదాగా కొంత సమయం గడపడం. సామాజిక సంబంధాలను కొనసాగించడం.
- ఇతరులకు సహాయపడుతూ, వారి సహకారాన్ని కూడా పొందండి. ఇతరులకు అవసరమైనప్పుడు చేయూతనివ్వండి. మీకు సహాయం అవసరమైనప్పుడు అడగటానికి మొహమాట పడకూడదు. యోగా, ధ్యానం, కొన్ని రకాల రిలాక్సేషన్ విధానాలను క్రమం తప్పకుండా సాధన చేస్తుండటం వలన ఉపయోగం ఉంటుంది.
- తీవ్రమైన ఆందోళనకు, కుంగుబాటుకు గురైనప్పుడు మానసిక వైద్య నిపుణులను సంప్రదించడానికి సిగ్గుపడకూడదు.
- మన విధుల నిర్వహణలో ఎంతో కొంత మేరకు వత్తిడిని ఎదుర్కొంటూ ఉండటమనే ది తప్పనిసరి అంశమైంది. దీని వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన మనకు ఉండి, ముందుగానే జాగ్రత్తపడితే, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను నివారించడానికి సాధ్యమతుంది.