నెలసరి మొదలైందంటే ఆడవారికి సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా అప్పుడే రజస్వల అయిన ఆడపిల్లలకు మరీ సమస్యగా ఉంటుంది. వారి ఆరోగ్యం పాడవుతుందనే టెన్షన్ ప్రతి తల్లికీ ఉంటుంది. అయితే ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు రక్తాన్ని మళ్ళీ భర్తీ చేయలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించ మంటారు వాళ్ళూ వీళ్ళూ. ఆ మాట ఎంతవరకూ నిజం? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితి నెలకొని సతమతమవుతుంటాంరు.
కొత్తగా రుతుస్రావం మొదలైన వారికి కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి కాస్తంత పరిమితి పాటిస్తే మంచిది.
నెయ్యికి బదులు వెన్న వాడాలి. ఎందుకంటే వెన్న కాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. కొవ్వులో జీర్ణమయ్యే విటమిన్లను ఒంటబట్టించు కునేందుకు వెన్న దోహదం చేస్తుంది.
ఎక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు
- మీరు శాకాహారులైతే… మీ రోజువారీ ఆహారం తోపాటు తాజాగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు (గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీళ్లు, బెల్లం, వేయించిన వేరుశనగలు), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండేలా చూడండి.
- మీరు మాంసాహారులైతే… మీ రోజువారీ ఆహారాన్నే తీసుకోండి. దాంతోపాటు మీ ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తో పాటు… మాంసాహారంలో లివర్‌ను ప్రత్యేకంగా ఇవ్వండి.
- అదే మాంసాహారులైనా, శాకాహారులైనా… కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ ఇవ్వండి. కోడిగుడ్డులో పచ్చసొన వద్దనే అపోహను తొలగించుకుని, దాన్ని అమ్మాయికి తప్పక ఇవ్వండి. ఎందుకంటే ఈ వయసులో వారు అది తీసుకోవడం వల్ల పచ్చసొన కారణంగా వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, ఒకవేళ వారు గుడ్డు తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ.
- మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉన్నప్పటికీ మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే… అది తిన్నవెంటనే ఒంటికి పడుతుంది. అదే శాకాహార పదార్థాల్లోని నాన్ హీమ్ ఐరన్ మన ఒంటికి పట్టాలంటే, అదనంగా విటమిన్-సి కావాలి. కాబట్టి ఐరన్ ఉండే శాకాహార పదార్థాలతో పాటు విటమిన్-సి ఉండే తాజా పండ్లు… జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
- రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం పుష్కలంగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే.
పరిమితంగా తీసుకోవలసిన పదార్థాలు:
- ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటివాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
- కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా పరిమితంగా తీసుకోవాలి.
అస్సలు తీసుకోకూడనివి పదార్థాలు:
- బేకరీ ఐటమ్స్ అయిన చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాల వంటి జంక్‌ఫుడ్‌తో పాటు కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు.
- ప్రతినెలా రక్తం కోల్పోతుండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది. అందుకే రక్తహీనత రాకుండా ఐరన్‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఉండటం వల్ల పై ఆహారాన్ని తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తారు.