విటమిన్ ట్యాబ్లెట్స్ గురించి....

ApurupA
0
జీవక్రియలు సక్రమంగా జరగాలంటే శరీరానికి విటమిన్లు తగినంత అందాలి. ఈ విటమిన్లు పోషకాహారం తీసుకున్నప్పుడు, పండ్లు తిన్నప్పుడు తగినన్ని లభిస్తాయి. అయితే కొందరు సంప్రదాయ మార్గంలో కాకుండా మాత్రల రూపంలో విటమిన్లు తీసుకుంటుంటారు. కానీ దానివల్ల ఇతర సమస్యలు రావచ్చు. జబ్బు పడినప్పుడు విటమిన్ మాత్రలు తీసుకోవడంలో తప్పులేదు కానీ, అవసరం లేకపోయినా వేసుకుంటే ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు.

విటమిన్ మాత్రలు వేసుకుంటే మంచిదేగా అని రోజూ వేసుకుంటే మొదటికే మోసం జరిగే అవకాశం ఉంది. విటమిన్లు ప్రతీ ఒక్కరికీ అవసరమే. అయితే తక్కువ మోతాదులో అన్ని రకాల విటమిన్లు శరీరానికి అవసరమవుతాయి. జీవక్రియలు జరగడానికి, కణాలన్నీ పనిచేయడానికి విటమిన్లు అవసరమవుతుంటాయి. ఇంతటి ప్రాధానత్య ఉన్న విటమిన్లు శరీరంలో తయారు కావు. ఆహారంతోనే శరీరానికి అందాలి. విటమిన్ డి ఒక్కటే శరీరంలో తయారవుతుంది. విటమిన్లలో రెండు రకాలుంటాయి. ఒకటి కొవ్వులో కరిగేవి, రెండవది నీటిలో కరిగేవి. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ,డి,ఇ,కె, నీటిలో కరిగేవి బి మరియు సి విటమిన్లు. కొన్నిరకాల విటమిన్లలో యాంటీ అక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియలు పూర్తయిన తరువాత విడుదలయ్యే ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిం చడంలో ఉపయోగపడతాయి.

లోపి స్తే అనేక జబ్బులు

చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారి వరకు అందరికీ విటమిన్లు అవసరమే. అయితే ఏ వయస్సులో ఏ విటమిన్లు అవసరమనే విషయంపై అవగాహన ఉండాలి. చిన్నపిల్లలకు అంటే శిశువు నుంచి ఆరేళ్ల వయస్సు ఉన్న పిల్లలకు విటమిన్-ఎ, విటమిన్-సి చాలా అవసరం. ఈ దశలో వారికి సరియైన మోతాదులో విటమిన్స్ లభించక పోతే కంటి చూపు తగ్గిపోవడం, రికెట్స్, స్కర్వీ అనే సమస్యలు వచ్చి అవకాశం ఉంటుంది. పెద్దవారిలో విటమిన్స్ తగ్గినపుడు అథెరోస్కెలెరోసిస్ అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కేన్సర్ వంటి వ్యాధులు రావచ్చు. ఇమ్యూనిటీ తగ్గి ఇన్‌ఫెక్షన్స్‌ రావచ్చు. ఎముకలు బలహినంగా అయి ఆస్టియోపోరోసిస్ సమస్య ప్రారంభం కావచ్చు. వీరు కింద పడిపోతే ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. గర్భిణులు ఫోలిక్‌ యాసిడ్ అనే విటమిన్ మాత్రలను తప్పకుండా తీసుకోవాలి. ఈ విటమిన్ లోపిస్తే పుట్టబోయే శిశువుల్లో అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శాఖాహారుల్లో విటమిన్-బి12 లోపం ఉంటుంది.

ఎక్కువగా వేసుకుంటే...

విటమిన్లలో నీటిలో కరిగే విటమిన్లు అయినటు వంటి బి, సి విటమిన్ల వల్ల ఎటువంటి నష్టం ఉండదు. కొంచెం ఎక్కువయినా కిడ్నీ తీసేస్తుంది. కానీ కొవ్వులో కరిగే ఎ, డి, ఇ, కె విటమిన్ల వల్ల నష్టం ఉంటుంది. వీటిని తీసుకున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రెగ్నెసీ సమయంలో విటమిన్-ఎ ఎక్కువగా తీసుకుంటే జెనెటిక్ డిఫెక్ట్స్, బర్త్ డిఫెక్ట్స్‌తో శిశువులు జన్మించే అవకాశం ఉంటుంది. విటమిన్ డి అవసరం లేని వారు కూడా తీసుకుంటే కాల్షియం శాతం పెరిగిపోయి ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం, సడన్ కార్డియాక్ డెత్ జరగడానికి ఆస్కారం ఉందని పరిశోధనల్లో వెల్లడయింది.

ప్రయోజనమెంత?

విటమిన్‌ లోపంతో క్రానిక్ డిసీజెస్ బారిన పడిన వారు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఎటువంటి ఫలితం ఉండటం లేదని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయింది. ఆహారం ద్వారా శరీరానికి అందినపుడు మాత్రమే ఫలితం ఉంటోంది. విటమిన్లు శరీరానికి సక్రమంగా అందాలంటే తాజా కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి అందిన విటమిన్స్ మాత్రమే క్రానిక్ డిసీజెస్‌ను ప్రివెంట్ చేస్తాయి. అవసరం ఉన్నప్పుడు అంటే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మాత్రమే విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. విటమిన్లు ఆహారం రూపంలో శరీరానికి అందింతే ఏ సమస్యా ఉండదు. అలా కాకుండా విటమిన్ మాత్రలపై ఆధారపడితే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

విటమిన్ డి లోపమే ఎక్కువ

నగరాల్లో నివసించే వారిలో 30 శాతం మందిలో విటమిన్ డి లోపం ఉంటున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా ఏసీ గదుల్లో పనిచేసే ప్రొఫెషనల్స్‌లో ఈ సమస్య మరీ ఎక్కువ. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరు ఏసీ గదుల్లో ఉండటంతో సూర్యరశ్మి తగలక విటమిన్ డి లోపం ఏర్పడుతోంది. ఇలాంటి వారికి విటమిన్-డి మాత్రలు అవసరమవుతాయి.

ఎవరు తీసుకోవచ్చు

ఈ మధ్యకాలంలో స్థూలకాయంతో బాధపడుతున్న వారు బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇటువంటి వారికి న్యూట్రిషన్స్ సరిగ్గా అబ్జార్బ్ కావు. అప్పుడు వారికి బి- కాంప్లెక్స్ మాత్రలు అవసరమవుతాయి. కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న కేన్సర్ రోగులు కూడా విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చు. హీమోడయాలసిస్ చేయించుకుంటున్న వారికి కణాలన్ని చనిపోతుంటాయి. ఈ చికిత్స తీసుకుంటున్న వారు విటమిన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు వైద్యులు. సమస్య ఉన్నా లేకపోయినా ఇష్టానుసారంగా విటమిన్ మాత్రలు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆహారం ద్వారానే శరీరానికి తగినన్ని పోషకాలు లభించేలా చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top