ఎముకలు బలంగా లేకపోతే వృద్ధాప్యంలో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ముప్పయి ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు బలవర్దకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎముకల సామర్థ్యాన్ని పెంచుకోవాలంటున్నారు వైద్యులు.
- కండరాల పటుత్వానికి, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు, హార్మోన్ల పనితీరుకు కాల్షియం అవసరం. శరీరంలో 99 శాతం కాల్షియం ఎముకలు, పళ్లలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, ఛీజ్, మజ్జిగ, పెరుగు, ఆల్మండ్స్, బీన్స్‌లు తరచూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది.
- శరీరానికి తగినంత కాల్షియం అందించడంలో విటమిన్ డి ఎంతో దోహదపడుతుంది. పొద్దున లేస్తూనే బిజీ జీవితంలో పడిపోయే నగరజీవి శరీరం మీద సూర్యకిరణాలు పడేలా చూసుకోవడం కష్టం. అందుకని విటమిన్ డి కొరత ఉంటే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల సప్లిమెంట్లు వాడవచ్చు. పొటాషియం, విటమిన్ కె కూడా ఎముకల్ని బలంగా ఉంచేందుకు తోడ్పడతాయి.
- పౌష్టికాహారం ఒక్కటే ఎముకల్ని బలంగా తయారుచేయదు. శరీరానికి తగినంత శ్రమ, వ్యాయామం తప్పక అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ, ఆరోగ్యంగా ఉంచుకుంటే కాల్షియం కొరత ఏర్పడదు. దీని కోసం ఉదయాన్నే నడవడం, పరిగెత్తడం, వ్యాయామం చేయాలి.
- ఎముకల సామర్థ్యాన్ని దెబ్బతీసేవాటిలో మద్యపానం, ధూమపానం ప్రమాదకరమైనవి. మోతాదుకు మించి తీసుకుంటే వయసు మీద పడేలోపు ఎముకల్ని పీల్చిపిప్పి చేస్తుంది మద్యం. అందుకని మితంగా తీసుకుని, చక్కటి ఆహారాన్ని భుజిస్తే సమస్యను అధిగమించవచ్చు.