ఈ మధ్య సరిగా నిద్రపట్టడం లేదు. దానివల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది అంటుంటారు చాలామంది. ఇలా నిద్రపట్టకపోవడానికి కారణం మన అలవాట్లే అంటున్నారు వైద్యులు. వాటిని గుర్తించి సరిచేసు కోగలిగితే హాయిగా నిద్రపడుతుందని చెప్తూ కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే...
- వేళకు నిద్రకు ఉపక్రమించాలి. కొందరైతే శని, ఆదివారాలప్పుడు ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్రలేవడం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. వారాంతాల్లో కూడా సమయానికే నిద్రపోవడం నేర్చుకోవాలి.
- సుఖవంతమైన నిద్రకు చక్కటి పరుపులు, దిండ్లు అవసరం. వాటిలో ఏ ఒక్కటి శరీరానికి అనుకూలంగా లేకపోయినా రాత్రంతా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక వేళ నిద్రపోయినా.. పొద్దున మెల్కొన్నక ఒళ్లు నొప్పులు, కండరాల సమస్యలతో బాధపడక తప్పదు.
- మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే నిద్రకు ఉపక్రమించాలి. మనసులో లేనిపోని ఆలోచనలు పెట్టుకుని పడుకుంటే నిద్ర పట్టదు. బలవంతంగా నిద్రపోవాలని ప్రయత్నిస్తే తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
- నిద్రలో గురకపెట్టే అలవాటుంటే దాన్నుంచి బయటపడేందుకు వీలైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించండి. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఈ సమస్య ఉన్నా.. మరో వ్యక్తి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- పడగ్గదిని వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడి వస్తువులు అక్కడే పడేస్తే.. మనసుకు చికాకు కలుగుతుంది. దాంతో మూడ్ మారిపోతుంది. అన్ని గదులకంటే బెడ్‌రూములే అపరిశుభ్రంగా ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. దుప్పట్లు, బెడ్‌కవర్లు, దిండు కవర్లను వారానికి రెండుసార్లు ఉతకాలి. పడగ్గదిని శుభ్రంగా సర్దుకోవాలి.
- పడగ్గదిలో లైట్లు మనసు మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. అందుకని పడగ్గదిలో మితిమీరిన వెలుగు ఉండకూడదు. అలాగని చిమ్మచీకట్లో పడుకోకూడదు. డిమ్‌లైటింగ్‌తో పల్చటి వర్ణాన్ని వెదజల్లే దీపాలను పెట్టుకోవాలి.
- పడుకునే ముందు చేయకూడనివి మద్యపానం సేవించడం, పొగతాగడం. పడుకునే మూడు గంటల ముందు వీటి జోలికి వెళ్లకండి. చాలామంది పడుకునేముందు సిగరెట్ తాగి నిద్రరావడం లేదని ఇబ్బంది పడుతుంటారు.
- కొందరికి ఏ చిన్న అలికిడి కలిగినా నిద్రాభంగం అవుతుంది. అలాంటి వారు పడకగది చుట్టుపక్కల శబ్దాలొస్తున్నా అక్కడే పడుకోకుండా మరో గదిలో పడుకోవడం ఉత్తమం.