భయం ముదిరితే ఫోబియా అవుతుంది. ఫోబియా అంటే...అతిగా భయపడటం. ప్రపంచంలో ప్రతి మనిషికీ భయం అనే లక్షణం ఉంటుంది. భయమే పెద్ద బాధంటే, అతిగా భయపడటం అనేది పెద్ద బాధే. అయితే ఫోబియాకు చికిత్స ఉంది. సంపూర్ణంగా నయమైపోయే వ్యాధుల్లో ఫోబియా కూడా ఒకటి కావడం విశేషం.
ఫోబియాకు సమానార్థం భయమే అనుకోవాలి. కాకపోతే ప్రత్యేకమైన భయం అని అర్థం. ఏదో ఒక విషయం గురించి అతిగా భయపడటాన్నే ఫోబియా అంటారు. మానసిక సమస్యల్లో తరుచుగా కనపడే సమస్య ఇది. ఫోబియాతో బాధపడే వారి జీవితం అపుపడప్పుడూ విచిత్రమైన ఇబ్బందుల్లో పడిపోతుంది. అయితే చికిత్సలో పూర్తిగా నయమైపోయేది కూడా ఈ ఫోబియాలే కావటం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. ఏదైనా ఒక వస్తువు లేదా ఒక సందర్భం లేదా పరిస్థితుల పట్ల అసహజమైన భయం పెరిగిపోవటమే ఫోబియా. నిజానికి ఫోబియాను అనుభవిస్తున్న వాళ్లకి కూడా ఆ సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఆ భయానికి అర్థం లేదని అర్థం అవుతూనే ఉంటుంది. భయపడకూడదు అని తెలుస్తూనే ఉంటుంది. అయినా కూడా భయపడతారు. చిన్న చిన్న అంశాల పట్ల భయాలు పెంచుకోవటమన్నది చూసేవాళ్లకు, వినేవాళ్లకు నవ్వు తెప్పించవచ్చు కానీ, దాన్ని అనుభవించే వారికి మాత్రం నిజంగా అదొక పెనుసవాలే అని చెప్పాలి. నిర్ధిష్టమైన అంశాలు, వస్తువులు, సందర్భాల పట్ల భయం ఉండటాన్ని మానసిక చికిత్సా పరిభాషలో స్పెసిఫిక్ ఫోబియా అంటారు. ఇక, సామాజికంగా నలుగురిలోకి వెళ్లినప్పుడు ఎదురయ్యేది సోషల్ ఫోబియా. ఎక్కువ మందికి ఉన్న ఫోబియాలు కొన్నే ఉన్నాయి. ఏక్రోఫోబియా(ఎత్తైన ప్రదేశాలంటే భయపడటం), క్లాస్ట్రోఫోబియా(ఒంటరితనం అంటే భయపడటం), నెక్రోఫోబియా(చావు అంటే భయపడటం), ఫైరోఫోబియా(నిప్పు అంటే భయపడటం), హీమోఫోబియా(రక్తం అంటే భయపడటం), హైడ్రోఫోబియా(నీరు అంటే విపరీతంగా భయపడటం)
చాలావరకు మనం పుట్టి పెరిగిన, చూసిన తిరిగిన వాతవారణంలో ఎటువంటి అనుభవాలను సందర్భాలను ఎదుర్కొన్నామో వాటి ఆధారంగా కూడా కొన్ని ఫోబియాలు స్థిరపడతాయి. తల్లిదండ్రులలో ఎవరికైనా భయాలుంటే ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలకు కూడా ఫోబియాలు రావచ్చు. ఫోబియా ఉన్న వ్యక్తులు ఒక దానితో భయం తలెత్తితే దానిని పోలి ఉన్న దేన్ని చూసినా భయపడుతూనే ఉంటారు. ఉదాహరణకు బొచ్చు కుక్క పట్ల ఫోబియా ఉన్నవారు చివరికి చిన్న కుక్క పిల్లను ను చూసినా కూడా భయపడతారు. జన్యుపరంగా, వ్యక్తిత్వంలో భాగంగా కూడా కొన్ని ఫోబియాలు రావచ్చు. భయాలను సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ ద్వారా జయించవచ్చు. దానికి కొన్ని వారాలు టైమ్ పడుతుంది. అయితే ఫ్లడింగ్ టెక్నిక్‌లో మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే పరిస్థితి చక్కబడుతుంది. ఈ చికిత్సా విధానాలు సమర్థంగా పనిచేస్తాయి. కొందరికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఏ ఆలోచన భయం తెచ్చిపెడుతుందో దాన్ని గుర్తిస్తారు. దానిలోని అసంబద్దతను చర్చించటం, ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవటం అన్నదానిపై శిక్షణ ఇస్తారు. ఫోబియాలతో నిత్యం సతమతం అవుతున్నా గానీ చికిత్స కోసం వైద్యుని సంప్రదించారు. ఆ తరువాత ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల్లో కూరుకుపోయి సతమతం అవుతుంటారు. కాబట్టి ఫోబియాను వదిలించుకోవటం అత్యవసరం.