ఓ గంటా, గంటన్నర సేపు వ్యాయామం చేశాక ఒళ్లంతా పట్టిన చెమటను తువాలుతో తుడుచుకుంటాం. చాలా సేపటి తరవాత స్నానం చేస్తాం. కానీ చర్మానికి పట్టిన చెమటా, ఆ వాసనా వదిలి తాజాగా మారాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- వ్యాయామం అయిన వెంటనే చన్నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. దానివల్ల చెమటంతా పోతుంది. తరవాత మీ చర్మతత్వాన్ని బట్టి సబ్బుకి బదులు పండ్లతో చేసిన ఫేస్‌వాష్ రకాన్ని ఎంచుకోవాలి. దానివల్ల ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి చర్మం తాజాగా మెరుస్తుంది.
- వ్యాయామం చేసినప్పుడు చెమట వల్ల చర్మ గ్రంథులు పెద్దవవుతాయి. దుమ్మూ, మురికీ వాటిల్లో చేరి, చర్మం మెరుపు కోల్పోతుంది. మొటిమల్లాంటి సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యల్ని నివారించాలంటే క్లెన్సర్ వాడాలి. అందుకోసం క్రీం క్లెన్సర్‌ని వాడొచ్చు. లేదంటే పాలు రాసుకుని కాసేపయ్యాక దూదితో తుడిచేసుకున్నా సరిపోతుంది. ఇదయ్యాక ఏదయినా ఫేస్‌ప్యాక్‌ని వేసుకుంటే చర్మం మళ్లీ మృదువుగా మారుతుంది. మునుపటి తాజాదనాన్ని పొందుతుంది.
- నాలుగైదు ఐసు ముక్కల్ని ఓ న్యాప్‌కిన్‌లో వేసి మూటకట్టాలి. వ్యాయామం చేసిన వెంటనే దాన్ని ముఖం, మెడ దగ్గర మర్దన చేసుకున్నట్లుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా మారుతుంది. మురికి పేరుకోకుండా ఉంటుంది.