జుట్టు తల మీద ఒత్తుగా.. నల్లగా నిగనిగలాడాలనే మహిళలంతా కోరుకుంటారు. అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులూ పాటిస్తుంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే?
మనసులో తీవ్ర వేదన మొదలవుతుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఆందోళనకు దారితీస్తుంది. నిజానికి మహిళలకు పెదవులు, చుబుకం, ఛాతీ, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా.. కంటికి కనిపించని విధంగానే ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించటం చూస్తుంటాం. ఈ సమస్యను 'హిర్సుటిజమ్' అంటారు. సాధారణంగా స్త్రీలల్లో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్) తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగటం మొదలవుతుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకం.
అయితే చాలామందిలో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతోంది. చూడటానికి ఇబ్బంది తప్పించి అవాంఛిత రోమాలన్నది చాలాసార్లు హానికరమైన సమస్యేమీ కాదు. అధికబరువు గలవారు బరువు తగ్గితే ఈ వెంట్రుకలు పెరగటమూ తగ్గుతుంది. బ్లీచింగ్ చేసుకోవటం ద్వారా వీటిని అంతగా కనిపించకుండా చూసుకోవచ్చు. షేవింగ్ చేసుకుంటే మరిన్ని వెంట్రుకలు మొలుస్తాయని అనుకుంటారు కానీ అది నిజం కాదు. కాకపోతే వెంట్రుకలు దట్టంగా కనిపిస్తాయి. ప్లకింగ్, ట్వీజింగ్, వ్యాక్సింగ్ సురక్షితమైన, చవకైన ప్రక్రియలు. అయితే వీటితో నొప్పి కలుగుతుంది. అలాగే మచ్చలు, వాపు, చర్మం నల్లబడటం, కొన్నిసార్లు చీముపట్టి ఇన్ఫెక్షన్లు రావటం వంటి ముప్పులూ ఉంటాయి. అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించే ఎలక్ట్రాలసిస్, లేజర్ వంటి ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నిపుణులతో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.