భోజనం చేసేప్పుడు పావువంతు కడుపును ఖాళీగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కడుపునిండా తింటే ఆహారం సరిగా జీర్ణం కాకపోవటంతో పాటు ఒంట్లో కొవ్వు మోతాదూ పెరుగుతుందనేది అందులోని పరమార్థం. మరి అలా కొవ్వు పెరగకుండా చూసుకోవాలంటే ఆహారంలో వీటినీ భాగంగా చేసుకొని చూడండి.
- గుడ్లు: ఉదయం పూట ప్రోటీన్లను తీసుకుంటే చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందువల్ల రోజూ గుడ్డు తినటం మంచిది. ఒక గుడ్డులో 75 కేలరీలే ఉంటాయి. ఇతర పోషకాలతో పాటు 7 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. గుడ్డును జీర్ణం చేసుకునేప్పుడు శరీరం ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది కూడా. కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా గలవారు వారానికి ఎన్ని గుడ్లు తినొచ్చో డాక్టర్‌ని అడిగి తెలుసుకోవటం మేలు.
- ఆకుకూరలు: ఇవి విటమిన్ కె నిలయాలు.
- సాల్మన్ చేపలు: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వీటితో దండిగా లభిస్తాయి.
- వెన్న తీసిన పాలు: ఇందులో ప్రోటీన్, క్యాల్షియం దండిగా ఉంటాయి. వెన్న తీసినప్పటికీ ఈ పాలు తాగినప్పుడు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఇవి బరువు తగ్గటాన్ని ముఖ్యంగా నడుం వద్ద కొవ్వు పేరుకుపోవటాన్ని తగ్గిస్తాయి.
- చిక్కుళ్లు: బీన్స్, గోరుచిక్కుడు, చిక్కుడు వంటి కూరగాయల్లో ప్రోటీన్లు, పీచు దండిగా ఉంటాయి. తక్కువ కేలరీలతోనే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి.
- గింజ పప్పులు: బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజపప్పులు (నట్స్) త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. వీటిల్లో ప్రోటీన్, పీచు, గుండెకు మేలు చేసే కొవ్వులు ఉంటాయి. అయితే వీటిని పరిమితంగానే తినాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే ఇవి బరువు తగ్గటానికి, కొలెస్ట్రాల్ స్థాయులు అదుపులో ఉండేందుకు దోహదం చేస్తాయి.
- పుచ్చపండు: ఇందులో నీరు అధికంగా ఉంటుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కేలరీలూ తక్కువే. పైగా ఇందులో లైకోపేన్ అనే యాంటీఆక్సిడెంట్ దండిగా ఉంటుంది. ఏ, సి విటమిన్లూ లభిస్తాయి.
- పీర్స్, యాపిల్స్: వీటిని పొట్టు తీయకుండా తింటే పీచు మరింత ఎక్కువగా లభిస్తుంది. త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. చాలాసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. నమిలి తినటం వల్ల కేలరీలూ ఖర్చవుతాయి.
- బత్తాయి వంటి పుల్లటి పండ్లు: వీటిల్లో విటమిన్ సి, విటమిన్ ఈ, అత్యవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి.
- బెర్రీలు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలోనూ పీచు, నీరు అధికంగా ఉంటాయి. పైగా ఇవి తీయగా ఉండటం వల్ల తిన్న తృప్తీ కలుగుతుంది. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లూ దండిగానే ఉంటాయి.
- టమోటాలు: వీటిల్లోని లైకోపేన్ సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుంది.