మన ఆరోగ్యానికి 'ఉప్పు పెద్ద ముప్పు' అని భావిస్తూ ఉప్పును పూర్తిగా మానెయ్యటం అవసరమన్న భావన తరచుగా వినపడుతుంటుందిగానీ అది పూర్తిగా మంచిది కాదు.
ఉప్పు కూడా మన శరీరానికి, జీవక్రియలకు అవసరమైన వనరు. ఆరోగ్యవంతులు రోజుకు కాస్త అటూ ఇటూగా 4 గ్రాముల ఉప్పు తీసుకోవటం మంచిది. చాలామంది మన శరీరానికి కావాల్సిన సోడియం అంతా కూడా కూరగాయలు, మన ఆహార పదార్థాల నుంచి సహజంగానే వచ్చేస్తుందనీ, ఇంక అదనంగా ఉప్పు వేయటం వల్ల దాని పరిమితి పెరిగిపోతుందని చెబుతుంటారుగానీ నిజానికి ఆహారం కాకుండానే 4 గ్రాములు (యాడెడ్ సాల్ట్) తీసుకోవాలన్నది శాస్త్రరంగం చేస్తున్న సిఫార్సు. కొన్ని రకాల జీవక్రియల్లో సోడియం క్లోరైడ్ (ఉప్పు) చాలా అవసరం. ఒంట్లో నీరు, ఖనిజ లవణాల సమతుల్యత (బ్యాలెన్స్) సజావుగా ఉండటానికి, మనం 'డీహైడ్రేషన్' లోకి వెళ్లకుండా ఇది చాలా కీలకం.
దీనర్థం ఉప్పు ఎక్కువెక్కువగా వాడమని కాదు. ఉదాహరణకు హైబీపీ ఉన్నవాళ్లు, కిడ్నీ జబ్బులున్న వాళ్లు ఉప్పు తగ్గించుకోవటం అసవరం. అంతేగానీ ఆరోగ్యవంతులు అసలు ఉప్పును పెద్ద శత్రువులా అభిప్రాయపడుతూ, అస్సలు ఉప్పు లేకుండా తినటం సరికాదు.