అస్సలు నూనె లేకుండా వండుకోవటం (జీరో ఆయిల్ కుకుంగ్) గుండెకు మంచిదని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇందులో నిజం లేదు.
అస్సలు నూనె అనేది లేకుండా ఉడకబెట్టేసుకు తినమని చెప్పటం సరికాదు. నూనెల నుంచి వచ్చే పోషకాలు, శక్తి-క్యాలరీలు కూడా మన శరీరానికి అవసరం. మనం తినే ఆహారంలో, ఆహారం ద్వారా మనకు లభించే క్యాలరీల్లో కనీసం 20% నూనెల నుంచి రావటం ఎంతైనా అవసరం. నూనెల నుంచి మన శరీరానికి అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కొన్ని లభిస్తాయి. మన శరీరంలో కొన్ని జీవక్రియలు సజావుగా జరగాలంటే కొవ్వు తప్పనిసరి. అలాగే ఎ, బి, ఇ, కె విటమిన్లు కేవలం కొవ్వులో మాత్రమే కరుగుతాయి, కొవ్వు ఉంటేనే ఇవి మన ఒంటికి పడతాయి. కాబట్టి ఇవన్నీ సజావుగా జరగాలంటే మన ఆహారంలో నూనె, కొవ్వు తప్పనిసరిగా ఉండాలి.
నూనె అస్సలు లేకుండా వంటలు చేస్తుంటే- రకరకాల చర్మ సమస్యలు, విటమిన్ లోపాల వంటి రుగ్మతలు మొదలవుతాయి. మరోవైపు నూనె అవసరమంటున్నారు కదా అని.. వాటిని విపరీతంగా తినకూడదు. దానివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చక్కటి ఆరోగ్యానికి మితంగా అంటే రోజుకు మనిషికి 20 గ్రాములకు మించకుండా నూనె వాడుకోవటం అవసరం. శరీరానికి అన్ని పోషకాలూ అవసరం, కానీ వాటిని మితంగా, సమతులంగా తీసుకోవటం మంచిది.