నెలసరిలో భరించలేని నొప్పి కొందరికి. నెల మధ్యలో రక్తస్రావం కనిపిస్తుంటుంది మరికొందరికి. బాధించే ఈ సమస్యలు ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్‌కి సంకేతం కావచ్చు. అసలు ఈ సమస్యలేంటీ... వాటికి ఎటువంటి చికిత్సలున్నాయో... తెలుసుకుందాం..
కొన్ని సమస్యలకు ఇదీ కారణం అని ప్రత్యేకంగా ఉండదు. ఎండోమెట్రియోసిస్ కూడా అలాంటిదే. గర్భాశయంలో ఉండాల్సిన ఎండోమెట్రియం పొర కొన్నిసార్లు అక్కడ కాకుండా మరో చోట ఏర్పడుతుంది. ముఖ్యంగా కటివలయ భాగం, పొత్తికడుపూ, మరికొన్నిసార్లు ఇతర శరీర భాగాల్లోనూ ఏర్పడుతుంది. ఆ పరిస్థితినే ఎండోమెట్రియోసిస్ అంటారు.
బయట పెరగడమే కారణం..
సాధారణంగా ఎండోమెట్రియల్ కణాలు ఈస్ట్రోజెన్ హార్మోనుకి స్పందించి, రెట్టింపవుతాయి. అలా పెరిగిన కణాలు పొరలుగా నెలసరి సమయంలో బయటకు వచ్చేస్తాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు గర్భాశయం బయట, అండాశయాలూ, ఫెల్లోపియన్ ట్యూబుల్లో కూడా పెరుగుతాయి. దాంతో నెలసరి సమయంలో బయటకు రావాల్సిన ఆ పొర అక్కడే ఉండిపోతుంది. అదే ఎండోమెట్రియోసిస్ సమస్య. ఈ పొరలు జిగురుగా ఉండటం వల్ల కొన్నిసార్లు రెండు శరీర భాగాలను కలిపి అతికించేస్తాయి. ఎండోమెట్రియోసిస్ పొరలు పెద్దగా ఉన్నప్పుడు అవి సిస్ట్‌లుగా మారిపోతాయి. వీటినే చాక్లెట్ సిస్ట్‌లు అంటారు. ఈ చాక్లెట్ సిస్ట్‌లలో రక్తం నిల్వ ఉండిపోతుంది. నెలసరి సమయంలో వాటినుంచి కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది. ఎండోమెట్రియోసిస్‌కీ, ఎడినోమయోసిస్‌కీ పెద్ద తేడా ఉండదు. ఎండోమెట్రియాసిస్‌లో కణాలు గర్భాశయం బయటి శరీరాభాగాల్లోని ఉపరితలం పైనే చేరతాయి. అదే ఎడినోమయోసిస్‌లో ఎండోమెట్రియం పొర గర్భాశయ కండరంలోకి చొచ్చుకెళుతుంది.దాంతో గర్భాశయంపై ప్రభావం పడి, అది పెరుగుతుంది. ఎండోమెట్రియోసిస్‌తో బాధపడే మహిళల్లో పన్నెండు శాతం మంది ఎడినోమయోసిస్ సమస్యకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు తెలియజేశాయి.
ఒకే లక్షణాలుంటాయి..
ఎండోమెట్రియోసిస్ పొరల ప్యాచ్‌లు సూది మొన మొదలు, పెద్ద బంతి అంత పరిమాణం వరకూ ఉంటాయి. అయితే ఈ సమస్య ఉన్నా.. లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. ఎండోమెట్రియోసిస్ పొర ఎంత పెద్దగా ఉంటే.. లక్షణాలు అంత తీవ్రంగా ఉంటాయి. అలాగని ఇది అందరికీ వర్తించదు. సాధారణంగా అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నెలసరికి కొద్దిరోజుల ముందు నుంచీ పొత్తికడుపులో నొప్పి మొదలవుతుంది. నెలసరి పూర్తయ్యాక పోతుంది. కొందరికయితే.. నెలసరి అయిపోయినా కూడా ఆ నొప్పి కొన్ని రోజుల పాటు వేధిస్తుంది. నెలసరితో సంబంధం లేకుండా కొన్నిసార్లు రక్తస్రావం కనిపిస్తుంది.
కలయిక సమయంలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఆ తరవాత కూడా కొన్ని గంటల పాటు ఆ నొప్పి వేధిస్తుంది.
ఫెల్లోపియన్ ట్యూబుల్లో ఎండోమెట్రియం పొరలు చేరడం వల్ల అవి మూసుకుపోతాయి. దాంతో గర్భధారణ కష్టం అవుతుంది. మలమూత్ర విసర్జన సమయంలో పొత్తికడుపులో నొప్పి, కొన్నిసార్లు నెత్తురు కూడా కనిపిస్తుంది. ఎడినోమయోసిస్‌లో అయితే నెలసరి సమయంలో రక్తస్రావం తీవ్రంగా కనిపిస్తుంది. నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం గర్భాశయంపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది.
ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్... ఈ రెండూ క్యాన్సర్‌కి దారితీసే సమస్యలు కాదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. సమస్య తీవ్రతకు తగిన చికిత్స తీసుకుని ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా అయితే.. ఎండోమెట్రియోసిస్‌ని లాపరోస్కోపీతో గుర్తించవచ్చు. ఎడినోమయోసిస్‌కయితే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అయితే అన్నిసార్లూ అది ఆ సమస్యా లేక ఫైబ్రాయిడ్లా అన్నది తేలదు. అప్పుడే అవసరాన్ని బట్టి ఎంఆర్‌ఐ పరీక్షతో నిర్థరిస్తారు.
మాత్రలు మొదలు.. ఎన్నో చికిత్సలు..
సాధారణంగా ఈ రెండు సమస్యలకీ ఒకే తరహా చికిత్సలుంటాయి. చికిత్స తీసుకోని వారిలో.. పదిమందిలో నలుగురికి సమస్య తీవ్రమవుతుంది. ఈ పది మందిలో ముగ్గురికి దానికదే తగ్గే అవకాశాలూ ఉంటాయి. చాలా కేసుల్లో అటు తగ్గకుండా.. ఇటు పెరగకుండా యథాతథంగా ఉండిపోతాయి! అలాగని చికిత్స తీసుకోకుండా, ఏం ఫరవాలేదు దానికదే తగ్గిపోతుంది అన్న నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే చికిత్స తీసుకోకుండా ఉండిపోతే ఒక్కోసారి పరిస్థితి తీవ్రంగా మారుతుంది. ఎండోమెట్రియాసిస్ కణాలు చిన్న పేగులకి అడ్డుపడొచ్చు. కిడ్నీనీ... బ్లాడర్‌నీ కలిపే నాళానికి (యురేటర్) ఆటంకం కలిగించొచ్చు. నెలసరి సమయంలో భరించలేని నొప్పీ, అధిక రక్తస్రావంతో బాధపడకుండా ఉండాలంటే తప్పకుండా చికిత్స తీసుకోవాలి.
నెలసరి సమయంలో పారాసిటమాల్ వంటి సాధారణ నొప్పి నివారణ మందులు వాడొచ్చు. వీటి కన్నా తీవ్రమైన నొప్పి నివారిణులు వాడితే కొన్నిసార్లు దుష్ఫలితాలూ ఏర్పడొచ్చు. అందుకే వైద్యుల సలహాతోనే వీటిని వేసుకోవాలి. వీటిని ఇప్పుడొకటి.. అప్పుడొకటిగా కాకుండా నెలసరి వస్తున్నన్ని రోజులూ క్రమం తప్పకుండా వాడాలి.
ఇలా నయం చేసుకోవచ్చు..
ఎండోమెట్రియోసిస్ కణాలు పెరగడానికి ఈస్ట్రోజెన్ హార్మోనే కారణం. కాబట్టి దీన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు వైద్యులు. దాంతో ఆ కణాలు కృశిస్తాయి . అందుకోసం కొన్ని చికిత్సా విధానాలున్నాయి.
గర్భనిరోధక మాత్రలు: ఇవి ఎండోమెట్రియోసిస్ చికిత్స కోసం కాకపోయినా.. ఇవి వాడుతున్న చాలామందిలో ఆ సమస్యలు తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఈ మాత్రలు అండాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. తద్వారా అండాశయంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి శాతం కూడా తగ్గుతుంది. దాంతోపాటూ నెలసరి సమయంలో రక్తస్రావం కూడా తగ్గి, నొప్పి బాధించదు. లైంగిక చర్య సమయంలో వచ్చే నొప్పీ, కటివలయంలో బాధా తగ్గుతాయి.
ఇంట్రాయుటరైన్ డివైజ్: ఇది కూడా గర్భనిరోధక సాధనమే. ఇందులో లెవొనోజెస్ట్రెల్ అనే ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. ఇది గర్భసంచి ఉపరితలాన్ని పలుచగా చేస్తుంది. అండాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. దీన్ని వైద్యులు గర్భసంచిలో అమరుస్తారు. ఇది కూడా ఎండోమెట్రియోసిస్ నొప్పిని తగ్గిస్తుంది. నెలసరిలో అధిక రక్తస్రావం కాకుండా చూస్తుంది. దీన్ని ఒక్కసారి గర్భసంచిలో అమరిస్తే ఐదేళ్లు పనిచేస్తుంది.
జీఎన్‌ఆర్‌హెచ్ ఔషధాలు: పిట్యూటరీ గ్రంథి గొనాడోట్రోఫిన్స్ ఉత్పత్తి చేయకుండా ఇవి అడ్డుకుంటాయి. ఈ గొనాడోట్రోఫిన్సే అండాశయాల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటిని నియంత్రించడం ద్వారా ఈస్ట్రోజెన్‌ను అదుపు చేయవచ్చు. అందువల్ల జీఎన్‌ఆర్‌హెచ్ ఔషధాలను ఇంజెక్షన్లుగానూ, నాజల్ స్ప్రేగానూ వాడొచ్చు. అయితే వీటితో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల జననేంద్రియాలు పొడిగా మారడం, లైంగిక చర్యపై ఆసక్తి తగ్గడం వంటి దుష్ఫలితాలు ఏర్పడతాయి. ఈ హార్మోనల్ చికిత్సలో సత్పలితాలు రావాలంటే వీటిని కనీసం ఆరు నెలల పాటు వాడాలి.
శస్త్రచికిత్స
ఒకవేళ ఎండోమెట్రియోసిస్ ప్యాచ్‌లు పెద్దగా ఉండి.. మందుల వల్ల తగ్గనప్పుడు వైద్యులు శస్త్రచికిత్సను సూచిస్తారు. ఇందులోనూ రకరకాల పద్ధతులున్నాయి.
సాధారణంగా అయితే లాపరోస్కోపీ పద్ధతిలో పొత్తికడుపు దగ్గర చిన్న కోత పెట్టి టెలీస్కోప్ లాంటి పరికరాన్ని గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఆ తరవాత లాపరోస్కోపీ ద్వారా పొట్టలోపలి భాగాన్ని చూసి... వేడి, లేజర్ లేదా ప్రత్యేకమైన హీలియం గ్యాస్ ద్వారా ఆ ప్యాచ్‌లు నశించేలా చేస్తారు. సిస్ట్‌లు ఉంటే.. లాపరోస్కోపీ ద్వారా తొలగిస్తారు. ఎండోమెట్రియోసిస్ ఉండి, సంతానసాఫల్య సామర్థ్యం తగ్గినప్పుడు.. ఇలాంటి శస్త్రచికిత్స చేయడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ పిల్లలు పుట్టి ఉంటే.. వయసు ఇతర అనారోగ్యాలను అంచనా వేసి.. గర్భాశయాన్ని తొలగిస్తారు. దాంతోపాటూ అండాశయాలనూ తొలగించే అవకాశం ఉంది. దాంతో ఆ లక్షణాలు అదుపులోకి వచ్చేస్తాయి. ఎడినోమయోసిస్‌లో అయితే.. లాపరోస్కోపీ చేయరు.