విటమిన్ - D తో నెలసరి నొప్పికి చెక్

ApurupA
0
చాలామంది మహిళలు నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. దీన్ని భరించలేక నొప్పి తగ్గించే మందులు వేసుకుంటూ ఉంటారు. కొందరికి నొప్పితో పాటు వికారం, వాంతి, విరేచనాలు, నిద్ర సమస్యలు కూడా తోడవుతాయి. ఇలాంటి వారికి ఒకేసారి పెద్దమొత్తంలో విటమిన్‌ డి ఇవ్వటం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతున్నట్టు ఇటలీ పరిశోధకులు గుర్తించారు. దీంతో నొప్పి నివారణ మందుల వాడకాన్ని తగ్గించొచ్చని భావిస్తున్నారు. 
రెండు నెలల పాటు చేసిన తమ అధ్యయనంలో విటమిన్‌ డి ఇచ్చినవారికి గణనీయంగా నొప్పి తగ్గినట్టు తేలిందని మెసినా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణులు అంటున్నారు. హార్మోన్ల వంటి ప్రోస్టాగ్లాండిన్స్‌ పదార్థాలు అధికంగా విడుదల కావటం వల్ల నెలసరి సమయంలో నొప్పికి దారితీస్తుంది. విటమిన్‌ డి వీటి ఉత్పత్తిని తగ్గిస్తుంది కాబట్టి పరిశోధకులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నెలసరి రావటానికి ఐదు రోజుల ముందు కొందరికి పెద్దమొత్తంలో విటమిన్‌ డి ఇవ్వగా.. మరికొందరికి ఏ మందూ లేని మాత్రలు ఇచ్చారు. రెండు నెలల అనంతరం పరిశీలించగా.. విటమిన్‌ డి తీసుకున్నవారిలో నొప్పి అంతగా రాలేదని గుర్తించారు. వీళ్లంతా నొప్పి నివారణ మందులు అసలే వేసుకోలేదు కూడా. ఇక మిగతా వారిలో 40% మంది కనీసం ఒక్కసారైనా నొప్పి మందులు వేసుకోవటం గమనార్హం. సాధారణంగా నెలసరి సమయంలో నొప్పిని తగ్గించటానికి వైద్యులు కూడా నాన్‌స్టిరాయిడల్‌ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ను సిఫారసు చేస్తుంటారు. అయితే వీటిని దీర్ఘకాలం వాడితే జీర్ణకోశ సమస్యలకు దారితీయొచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top