తలనొప్పి వేధిస్తోందా?

ApurupA
0
ఈ మధ్య మీకు కారణం తెలియకుండానే తలనొప్పి వేధిస్తోందా? దీనికేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ విధి నిర్వహణలో భాగంగా తలెత్తిన ఒత్తిడి. దీన్ని పట్టించుకోకపోతే డిప్రెషన్‌లోకీ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

భారత పరిశ్రమల అనుబంధ సంస్థ- అసోచామ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక సర్వేలో.. మనదేశంలో పలురంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, బడలిక అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. భారతీయ ఉద్యోగివర్గంలో ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య తేడా చెదిరిపోతున్నట్లు తేల్చారు. పనివేళలు ఎక్కువవ్వటం, అసాధారణ పని వేళల్లో విధులు నిర్వర్తించాల్సి రావటం వంటివన్నీ మానసిక ఒత్తిడులను అంతకంతకూ పెంచుతూ పలురకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒత్తిడి డిప్రెషన్‌కు కారణమవ్వటం మామూలే కానీ.. ఇది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలకూ దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తలనొప్పులకు స్పష్టమైన కారణం కూడా తెలియటం లేదని పేర్కొంటున్నారు. తలనొప్పితోపాటు కాళ్లూ చేతుల్లో నొప్పులు, నిద్రలేమి, ఆకలి తగ్గటం, మహిళల్లోనైతే ఎక్కువెక్కువగా తినెయ్యటం వంటి సమస్యలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. 

అకస్మాత్తుగా ఇలా తలనొప్పి, కాళ్ల నొప్పుల వంటివి వేధిస్తున్నప్పుడు తరచూ ఆఫీసు వదిలి ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుండటం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఎన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా ఈ తరహా నొప్పులకు కారణాలేమిటనేది వైద్యులు సైతం గుర్తించలేకపోతున్నారు. ఎంతకీ అంతుచిక్కని పలురకాల నొప్పులు, దేనిపైనా ఆసక్తి లేకపోవటం, నీరసం వంటివి సతాయిస్తున్నప్పుడు ఇవన్నీ విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలుగా అనుమానించాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

అధిక వేతనాలు, పెరుగుతున్న కోర్కెలు, తీవ్రస్థాయి పోటీతత్వం, బాగా సంపాదించాలనే కాంక్ష.. వంటివన్నీ భారతీయ ఉద్యోగుల్లో ఒత్తిడులను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేసే పనినీ, పనిచేసే చోటునీ ఆస్వాదించటం, అనవసరమైన ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top