ఇష్ట మైన, రుచికర మైన భోజనంవల్ల, నచ్చిన ఆహారపు వాసన వల్ల, వెరైటీ టేస్ట్ వల్ల నోట్లో నీళ్లు ఊరతాయి. దీన్నే ‘నోరూరటం’ అంటారు. ‘నీరు’అని పేర్కొనే ఈ ద్రవం నోటిలోని లాలాజలమే. ఇది ఎలాంటి ప్రయత్నం లేని స్వయంచోదిత (ఆటోమేటిక్) చర్య. నోటిలోని లాలాజలగ్రంథులకూ, మెదడులోని ప్రేరణ కలిగించే స్పందనలకూ, సందేశాలకూ మధ్యజరిగే ప్రక్రియ వల్ల నోరూరడం జరుగుతుంది. దీనికి నాలుక మీది రుచి బుడిపెలు (టేస్ట్ బడ్స్), మానసిక ఉల్లాసం మరికొంత సహకరిస్తాయి. నోటిలో మూడు జతల లాలాజలగ్రంథులు వుంటాయి. చెవులకు ముందర, నాలుక కింద, కింది దవడ లోపల ఒక్కో జత చొప్పున వుంటాయి. లాలాజలగ్రంథులు స్రవించే లాలాజలం లక్ష ణాలు కూడా భిన్నంగా వుంటాయి. తినే పదార్థాన్ని బట్టి ఎంత లాలాజలం స్రవించాలో (ఊరాలో)అంతే ఊరుతుంది.మొత్తం ఆరు లాలాజలగ్రంథులలో చెవులకు ముందరి భాగంలో వుండే లాలాజలగ్రంథులు పల్చని లాలాజలాన్ని, కింది దవడ లోపల వుండే లాలాజలగ్రంథులు జిగటగా వుండే లాలాజలాన్నిస్రవిస్తాయి. అంటే గట్టి పదార్థాలు తింటే పల్చని లాలాజలం, పండ్లు వగైరా రసం గల పదార్థాలు తింటుంటే కింది దవడలోని గ్రంథులు చురుకుగా పనిచేస్తాయి. ఇదంతా శరీరంలోని ఒక యాంత్రిక ప్రక్రియ. ‘జిరస్టోమియా’ అనే అరుదైన వ్యాధి కలిగితే నోరూరడం కొంత తగ్గిపోతుంది. దీనివల్ల పదార్థాల రుచిని ఆస్వాదించలేరు.