వ్యాయామాలు ఉదయమే చేయాలా ?

ApurupA
0
కొత్తగా వ్యాయామం చేయడం మొదలుపెట్టే వాళ్లు ఏ సమయంలో చేయాలి
దాని దేముంది.. రోజులో ఎప్పుడైనా చేయవచ్చు అంటారా?
కానీ, ఆశించే ప్రయోజనాల ఆధారంగా వ్యాయామానికి సమయం కేటయించుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా.

ఎవరి వీలు, ఆశించే ప్రయోజనాలను బట్టి వ్యాయామ సమయం కేటాయించుకోవచ్చు. అందుకే మీ శరీర పరిస్థితిని బట్టి, అవసరాలను బట్టి ఎప్పుడు వ్యాయామం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఆ టైం మీ శరీరానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. ఎందుకంటే అందరూ ఒకే సమయంలో ఉత్సాహంగా ఉండలేరు. కొందరు పగలు ఉత్సాహంగా ఉంటే, మరికొందరు రాత్రి సమయాల్లో ఉత్సాహంగా ఉంటారు. అందుకే ఏదైనా సరే మీ శరీర పరిస్థితికి తగినట్టుగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి!

ఏ టైంలో వ్యాయామం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరతాయో తెలుసుకుందాం..

వ్యాయామం అనగానే కొంత మంది ఉత్సాహంగా ముందుకు వస్తే, మరికొందరు బద్ధకంగా వెనకడుగు వేస్తారు. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేవగానే కొందరికి శరీరం తొందరగా సహకరించక పోవచ్చు. అందుకే సాయంత్రం సమయాల్లో వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి అలసిపోతాం కాబట్టి ఉదయం చేయడం ఉత్తమం అనుకుంటారు. కానీ.. వారి వారి అవసరాలు, ఆశించే ప్రయోజనాల్ని బట్టి వ్యాయామం చేయాల్సిన సమయాన్ని నిర్ణయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇబ్బంది కలగకుండా ఉండాలంటే..
పొద్దున్నే నిద్రలేవగానే వ్యాయామం చేయడానికి అందరి శరీరం ఒకేలా సహకరించక పోవచ్చు. ఎందుకంటే సహజంగా ఉదయాన్నే నిద్ర లేచే సమయానికి శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఫలితంగా అంత తొందరగా మీ శరీరం మీకు సహకరించక పోవచ్చు. బలవంతంగా వ్యాయామం చేస్తే.. కండరాలు పట్టేయడం.. కీళ్ల నొప్పులు.. వంటి సమస్యలు తలఎత్తతాయి. అందుకే ఇలాంటి సమస్య ఉన్నారు వీలున్నంత వరకూ సాయంత్రం పూట వ్యాయామం చేయడం మంచిది. అది కూడా 4గం నుంచి రాత్రి 8గం లోపు చేయాలి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ శరీరం మీరు చేసే వ్యాయామానికి బాగా సహకరిస్తుంది.
అలాగే కొంత మందికి పోలన్ అలర్జీ (పువ్వులో ఉండే పరాగరేణువుల వల్ల కలిగే అలర్జీ) సమస్య ఉంటుంది. సాధారణంగా తెల్లవారుజామున 4గం నుంచి ఉదయం 10గం వరకు వాతావరణంలో పోలస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలర్జీ బారిన పడకుండా ఉండాలంటే వీరు కూడా సాయంత్రం వేళల్లోనే వ్యాయామం లేదా వాకింగ్ చేయడం మంచిది. లేదు, ఉదయాన్నే చేయాలనుకుంటే బయట కాకుండా ఇండోర్‌లో వ్యాయామం చేయడం ఉత్తమం.

నిద్ర పట్టాలంటే..
చాలామందికి నిద్రలేమి ఒక పెద్ద సమస్య. అందుకే మీరూ నిద్ర పట్టడం కోసం వ్యాయామాలు చేస్తుంటే మాత్రం.. పడుకునే ముందు వ్యాయామం చేయడానికి సమయం పిక్స్ చేసుకోండి. నిద్రకు ఉపక్రమించే ముందు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదని అంటారు కానీ, నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఒక సర్వేలో రాత్రి పూట పడుకునే ముందు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా చక్కని నిద్ర పడుతుందని వెల్లడైంది. అందుకే నిద్రకు ఉపక్రమించే అరగంట ముందు క్విక్ యోగా చేయండి. నిద్ర కోసం నిద్ర మాత్రలు వాడేకంటే ఈ మార్గం ఎంచుకోవడం ఉత్తమం.

బరువు తగ్గాలనుకుంటే..
బరువు తగ్గడం కోసం వ్యాయామాలు చేసేవారు మాత్రం బ్రేక్ ఫాస్ట్ కు ముందే చేయాలి. ఉదయాన్నే జిమ్ లేదా ఇంటి దగ్గరే చేయాలి.. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్లు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బ్రేక్ ఫాస్ట్ చే శాక వ్యాయామం చేసేవారి కంటే తినక ముందు వ్యాయామం చేసేవారిలో కొవ్వు 20 శాతం తొందరగా కరుగుతుందని వెల్లడైంది. పైగా అసలు విషయం ఏం టంటే, మీరు వ్యాయామం చే సేదే అదనపు కేలరీలను తగ్గించుకోవడానికి. మరి, బ్రేక్ ఫాస్ట్ ద్వారా ముందు కేలరీలు తీసుకుని తర్వాత వ్యాయామం చేస్తే.. అదనపు కేలరీలతో పాటు జమయ్యే కొత్త కేలరీలు ఎప్పుడు కరుగుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌కు ముందే వ్యాయామం చేయాలి

ఒత్తిడి అధిగమించడానికి..
వివిధ కారణాల వల్ల ఎదురయ్యే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఉదయాన్నే వ్యాయామం చేయాలి. అలాగే ఎప్పుడైతే బాగా ఒత్తిడి అనిపిస్తుందో, ఆ సమయంలో 10 నుంచి 15 నిమిషాల పాటు ధ్యానం లేదా శ్వాస మీద ధ్యాస ఉంచడం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని ఎదుర్కోగలుగుతారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో ఇలా చేయడం వల్ల మీలో కలిగే మార్పు మీకే సులభంగా తెలుస్తుంది. ఒత్తిడి బాగా తగ్గుతుంది. తిరిగి ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top