చాల మంది వ్యాయామాన్ని హుషారుగానే మొదలు పెడతారు. కానీ కొద్ది రోజులు కాగానే మధ్యలోనే మానేస్తుంటారు. ఒకసారి వ్యాయామం ఆరంభిస్తే దాన్ని కొనసాగించటం చాల అవసరం. క్రమం తప్పకుండా రోజూ చేస్తేనే ఫలితం కనబడుతుంది. వ్యాయామాన్ని మధ్యలో మానకుండా ఉండాలంటే దాన్నొక అలవాటు మార్చుకోవడం మంచి పద్ధతి. అప్పుడది మిగతా పనుల్లో ఒకటి గానే తోస్తుంది కానీ భారంగా అనిపించదు. కనీసం 6 నెలల పాటు వ్యాయామాన్ని ఆపేయకుండా చేయగలిగితే ఒక అలవాటుగా మారుతుంది. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
- రకరకాల పనులతో తీరిక లేకుండా గడిపే వారు వ్యాయామానికి చివరి స్థానం ఇస్తుంటారు. అయితే ఆయా పనులను చేయాలంటే ముందు చురుకుగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఇందుకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి పనుల్లో మునిగిపోక ముందే ఉదయం లేస్తూనే వ్యాయామానికే ప్రాధాన్యమివ్వటం అలవరచుకోవాలి. దీన్ని కూడా తప్పనిసరి పనిగా భావిస్తే సమయం దానంత అదే చిక్కుతుంది.
- బయటికి వెళ్లటాన్ని ఇష్టపడేవారు సైకిల్ తొక్కడం, ఈత, నడక వంటి వాటితో వ్యాయామాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. నడుస్తున్నప్పుడు, తోట పని చేస్తున్నప్పుడు సంగీతం కూడా వినొచ్చు. చాల మంది ఒకరకం వ్యాయామం చాలని సరిపెట్టుకుంటుంటారు. అయితే రకరకాల వ్యాయామాలను ఎంచుకోవటం వల్ల సహన శక్తి, దృఢత్వం, నియంత్రణ వంటివి చేకూరుతాయి. దీంతో విసుగు రాకుండా ఉండటమే కాదు.. గాయాల బారిన పడకుండా చూసుకోవచ్చు.
- ఎలాంటి వ్యాయామాలైనా గాయాలు కాకుండా చూసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా కొత్తవి ఆరంభించినా, చాల కాలం తర్వాత తిరిగి మొదలెట్టినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బులతో బాధ పడుతుంటే వైద్యుల సలహా మేరకు, శరీరానికి సరి పడేలా ఎంచుకోవాలి. వ్యాయామం మొదలెట్టక కొద్దిరోజుల పాటు నొప్పిగా ఉన్నా క్రమంగా తగ్గిపోతుంది. అయితే నొప్పులు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే వ్యాయామం తీవ్రంగా చేసి ఉండొచ్చని గుర్తించాలి. కాబట్టి వ్యాయామాన్ని నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.
- వ్యాయామం చాల కష్టంగా ఉన్నా.. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నా.. అసౌకర్యంగా అనిపించినా దానిపై అంతగా ఆసక్తి ఉండదు. కాబట్టి దీన్ని సాధ్యమైనంత తేలికగా మార్చుకోవాలి. కుర్చీలో కూచ్చోని టీవీ చూస్తున్నప్పుడు చేత్తో బరువులెత్తడం, పిల్లలను ఆడిస్తూ నడవడం, ఒకేసారి ఎక్కువ కాకుండా మధ్య మధ్యలో విరామం ఇస్తుండడం వంటివి చేస్తుంటే అసలు వ్యాయామం చేసినట్టే అనిపించదు.
- స్నేహితుడితో గానీ కుటుంబసభ్యులతో గానీ కలిసి వ్యాయామం చేయం పరస్పరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీంతో వ్యాయామం కొనసాగించే వాతావరణమూ ఏర్పడుతుంది. వీలైతే యోగా తరగతుల్లో, వాకింగ్ క్లబ్లో చేరమూ మంచిది.
- మనకు మనమే శారీరక శ్రమ చేయటానికి వీలున్న అవకాశాలను సృష్టించుకోవడం కూడా బాగా ఉపయోగపడుతుంది. బయటకు వెళ్ళినప్పుడు వాహనాలను కాస్త దూరంగా ఆపి నడవడం, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. వృద్ధులు క్యూలో ఎక్కువ సేపు నిలబడాల్సి వస్తే ఒక కాలు మీద నిలబడుతూ నియంత్రణనూ సాధన చేయవచ్చు. ఏదైమైన మనసుంటే మార్గం దొరక్కపోదని గుర్తుంచుకోవాలి.