విటమిన్-ఇని సమృద్ధిగా తీసుకుంటే 65 ఏళ్ల పైబడిన వృద్ధులు శారీరకంగా బలంగా ఉంటారని తాజా అధ్యయనంలో గుర్తించారు. మన శరీరంలో తయారుకాదు, విటమిన్-ఇ ని ఆహార పదార్థాల ద్వారానే తీసుకోవాలి. వృక్ష సంబంధ నూనె, సోయా గింజలు, మొక్కజొన్న, ఆలివ్ నూనె, గుడ్డుసొన, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలతో విటమిన్-ఇ అందుతుంది. ఇవి యాంటీఆక్సిడెంట్లనూ అందివ్వటం వల్ల శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. విటమిన్-ఇ మన శరీరంలోని కణజాలాన్ని అన్నిరకాల దాడుల నుంచి రక్షిస్తుంటుంది. వృద్ధాప్య లక్షణాల్ని నెమ్మదింప జేయటంతోపాటు, చర్మ కణాలు క్షీణించటాన్నీ అడ్డుకుంటుంది.
యేల్ యూనివర్సిటీ పరిశోధకులు కొంతమంది వాలంటీర్లు రక్తం శాంపిళ్లను పరీక్షించి విటమిన్ల స్థాయుల్ని గణించగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో విటమిన్-ఇ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. విటమిన్-ఇ తక్కువగా ఉన్నవారిలో శారీరక సామర్థ్యం 1.62 రెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విటమిన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాల్ని సరిపడినంతగా తీసుకుంటే ఈ సమస్య తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. దీనికోసం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనీ, ఆరోగ్యకరమైన ఆహారంతోనే విటమిన్‌ను పొందవచ్చని స్పష్టం చేశారు.