సెల్‌ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతోపాటు ఉపయోగించేవారి విస్తృతీ పెరుగుతోంది. సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడితే సమస్యలూ ఎక్కువేనని, వాటిలోని రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయనే నేపథ్యంలో పరిశోధకులు ఎన్నో అధ్యయనాల్ని పరిశీలించారు. ఇంతకీ సెల్‌ఫోన్లతో నిజంగానే సమస్యలున్నాయా? అనే దిశగా అధ్యయనాలు సాగిస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలు, వృత్తిపరంగా ఫోన్లను ఎక్కువగా వినియోగించే వారికి సెల్‌ఫోన్లతో ఎంతోకొంత హాని ఉంటోందనే వాదనల నిగ్గు తేల్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
సెల్‌ఫోన్లతో అందరూ అనుకున్నంతగా, ప్రచారం చేస్తున్నంత హాని మాత్రం లేదని కొలరాడో యూనివర్సిటీ పరిశోధకులు ఫ్రాంక్ బార్నెస్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీటితో ముప్పు ఉన్నట్లు తేలకపోయినా.. దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయనే దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందంటున్నారు. ఇవే కాకుండా సెల్‌ఫోన్ టవర్లపై పనిచేసే వారిపై ప్రభావం ఎలా ఉంటోందన్నదీ పరిశీలించాలంటున్నారు. పాఠశాల వయసు పిల్లలు సెల్ వాడటం వల్ల తలెత్తే మంచీచెడ్డల్నీ పట్టించుకోవాల్సి ఉందన్నారు. ఎందుకంటే.. పెద్దలతో పోలిస్తే.. పిల్లల్లో తల, పుర్రె పరిమాణం, మందం కొంత తక్కువగా ఉండటం వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందా? అనేదీ గమనించాల్సి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్లను చేతుల్లో పట్టుకోవటమే కాకుండా నడుము బెల్టులకూ పెట్టుకోవటం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం ఎంతమేర ఉంటుందన్నదీ గమనించాల్సిన అవసరం ఉందని వారి వాదన.
అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) సెల్‌ఫోన్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేషనల్ రీసెర్చి కౌన్సిల్(ఎన్‌ఆర్సీ- అమెరికా) కు పురమాయించింది. దీనికోసం భారీ వర్క్‌షాప్ నిర్వహించి పలు దేశాల నుంచి నిపుణుల్ని ఆహ్వానించి సెల్‌ఫోన్లపై పలు నివేదికల్ని విశ్లేషించి, దీర్ఘకాలిక వినియోగంతో వాటివల్ల తలెత్తే సమస్యల్ని విశ్లేషించారు. సెల్‌ఫోన్లు, వ్యక్తిగత కంప్యూటర్లు వంటి వాటితో వెలువడే విద్యుత్తు తరంగాల వల్ల పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలపై ప్రభావాన్ని దీర్ఘకాలంపాటు పరిశీలిస్తేనే ముప్పు ఏమిటనేది తెలుస్తుందని, దీనికోసం మరింతగా అధ్యయనాలు సాగాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో సెల్‌ఫోన్లు వినియోగించే ధోరణిలోనూ పలుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. ఇప్పటికే చాలామేరకు సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపించుకుంటూ, సంభాషణల్ని తగ్గిస్తున్నారనీ ఫలితంగా వీటితో తలెత్తే ముప్పు తీవ్రతల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉందని శహిస్తున్నారు. కాకపోతే.. మెదళ్లు ఎదిగే దశలో పిల్లలు ఎక్కువగా వాడటమే ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఇలాంటి అన్ని అంశాల నేపథ్యంలో సెల్‌పోన్ల వాడంకపై ఇప్పుడే తీవ్రస్థాయి ఆందోళన చెందటం అనవసరమనీ, అధ్యయన ఫలితాలు వందశాతం వెలువడ్డాకే ఒక నిర్ణయానికి రావటం శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు.
'సెల్' ఫోన్ వా (డా) లా వద్దు !!
ReplyDeleteజిలేబి