ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం కోసం వ్యాయామం తప్పనిసరి....

ApurupA
0
మనిషిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందడానికి చక్కని ఆరోగ్యం అవసరం. మంచి ఆరోగ్యానికి సమతులాహారం, రోజువారీ వ్యాయామ ప్రక్రియలు ఎంతో దోహదపడుతాయనడంలో సందేహం లేదు.
ఆత్మ విశ్వాసంతో జీవించగలిగిననాడు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చు. తద్వారా జీవితాన్ని సాఫీగా, ఆనందంగా గడుపవచ్చు. జీవితంలో నిర్దేశించుకునే లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు.

వ్యాయామాన్ని తొలిసారిగా ప్రారంభించేవారు కూడా తమ శరీరంలో కలిగే మార్పులను తేలిక గానే గుర్తించవచ్చు. వీరు ఇతరులను అనుకరించకూడదు. ముఖ్యంగా మోడల్స్, సినీ తారలు మొదలైన వారితో పోల్చుకుంటూ, వారు చేసే వ్యాయామ ప్రక్రియలను నిర్వహించకూడదు.
సమాజంలో కొందరు సన్నగానూ, మరికొందరు లావుగానూ, ఇంకొందరు ఎంతో బలిష్టంగానూ కనిపిస్తారు. అది లోక సహజం. వారి వారి శరీరాకృతులనూ, ఆరోగ్యాన్ని చూసి మన మలా లేమని కలత చెందాల్సిన పని లేదు. వారికంటే మనం అన్నిటిలో తక్కువగా ఉన్నామనే భావనతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఫిట్నెస్ సెంటర్లు శారీరకంగా తగిన అర్హత కల్పించడానికి ఏర్పడినవే. వాటిద్వారా శారీరకంగా ఫిట్నెస్ను పొందవచ్చు.

ప్రతివ్యక్తి తనకు అనుకూలమైన, తనకు ఆనందాన్ని కలిగించే వ్యాయామ ప్రక్రియలను ఎంచుకుని వాటిని కొనసాగిస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఆశయ సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది. సుదీర్ఘ జీవనయానంలో తగిన సత్ఫలితాలను అందుకోవడానికి వీలుగా వ్యాయామ ప్రక్రియల రూపకల్పన జరగాలి. ఈ ప్రక్రియలను ముందు చిన్నవిగా రూపొందించుకుంటూ, తరువాత అసాధ్యమనుకునే ప్రక్రియలను కూడా నెమ్మదిగా చేపట్టాలి. వాటిని సాధన చేయగలిగితే చురుకుగా ముందుకు సాగడానికి వీలవుతుంది.

శరీరంలో కలిగే మార్పుల వలన ఎటువంటి ఆందోళనలకు గురి కాకుండా తాను రూపొందించుకున్న వ్యాయామ ప్రక్రియల ప్రకారం ఒక సదవగాహనను ఏర్పరచుకుని ప్రతిరోజూ కొనసాగించాలి. వ్యాయామ  ప్రక్రియల వలన కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటి వలన ఆశించిన ఫలితాలను సాధించినప్పుడల్లా ఒక పుస్తకంలో రికార్డు చేసుకోవాలి.

సమాజంలో మిమ్మల్ని ప్రోత్సహించి, మీ ఆశయాలకు అనుగుణంగా స్పందించే వ్యక్తులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగాలి. వారితో అనేక విషయాలపై చర్చలు జరుపుతూ, మీరు నిర్వహిస్తున్న వ్యాయామ ప్రక్రియల గురించి కూడా చర్చలు జరపండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top